బాజాప్తాగా రోడ్ల మీదకు

ABN , First Publish Date - 2020-04-03T07:59:50+05:30 IST

మూసాపేటలో నివాసముండే ఓ వ్యక్తి కూరగాయల కోసం కేపీహెచ్‌బీ రైతుబజార్‌కు వెళ్లాడు. తిరిగి వస్తుండగా కూకట్‌పల్లి వైజంక్షన్‌ వద్ద పోలీసులు అపి.. ‘మీ ఇంటి దగ్గర దొరకవా కూరగాయలు?’ అని అడిగారు. అతడిచ్చిన సమాధానం విని ఆశ్చర్యపోయారు.

బాజాప్తాగా రోడ్ల మీదకు

భయం లేకుండా యథేచ్ఛగా తిరుగుతున్న జనం

నిత్యావసరాలు, వైద్యం పేరుతో బయటకు

లాక్‌డౌన్‌ ఆదేశాలు బేఖాతర్‌.. బైక్‌ల మీద చక్కర్లు


హైదరాబాద్‌ సిటీ/ కూకట్‌పల్లి/ఎల్‌బీనగర్‌, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): మూసాపేటలో నివాసముండే ఓ వ్యక్తి కూరగాయల కోసం కేపీహెచ్‌బీ రైతుబజార్‌కు వెళ్లాడు. తిరిగి వస్తుండగా కూకట్‌పల్లి వైజంక్షన్‌ వద్ద పోలీసులు అపి.. ‘మీ ఇంటి దగ్గర దొరకవా కూరగాయలు?’ అని అడిగారు. అతడిచ్చిన సమాధానం విని ఆశ్చర్యపోయారు. కిలోకు రెండు రూపాయలు ఎక్కువ అమ్ముతున్నారు సర్‌ మా దగ్గర. అందుకే అంత దూరం వెళ్లాను అనేది అతడి సమాధానం.  భరత్‌నగర్‌కు చెందిన ఇద్దరు యువకులదీ ఇదేతీరు. స్థానికంగా బియ్యం ధర కిలోకు రూ.10 ఎక్కువగా ఉందని బైకుపై కూకట్‌పల్లిలోని మెట్రో షాపింగ్‌ మాల్‌కు వెళ్లారు. తీరా అక్కడ ఏమీ కొనకుండా  తిరిగి పయనమవడం విశేషం!! ఇద్దరి చేతా పోలీసులు గుంజీలు తీయించి.. కాసేపు అక్కడే నిలబెట్టి పంపించి వేయడం పక్కనబెడితే కరోనాపై ప్రభుత్వం, ప్రసార మాధ్యమాలు హెచ్చరిస్తున్నా.. లాక్‌డౌన్‌కు కట్టుబడి ఇళ్లలోనే ఉండాలని పదే పదే చెబుతున్నా జనానికి పట్టడం లేదు. యథేచ్ఛగా బైక్‌లతో రోడ్ల మీదకొచ్చి చక్కర్లు కొడుతున్నారు. కొందరైతే భార్యాపిల్లలనూ బయటకి తీసుకొస్తున్నారు. ఇదేం తీరు అని పోలీసులు ఆపి ప్రశ్నిస్తే.. నిత్యావసరాలు అనో.. మరేదో కారణం చెబుతూ పోలీసుల సహనానికి పరీక్ష పెడుతున్నారు. ఇవన్నీ గ్రేటర్‌ పరిధిలోని కూకట్‌పల్లి వై జంక్షన్‌, జెఎన్‌టీయూ, అమీర్‌పేట మైత్రివనం, ఖైరతాబాద్‌, పంజాగుట్ట, ఎల్‌బీనగర్‌  ప్రాంతాల్లో  ప్రధాన రహదారులపై పోలీసులు ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల వద్ద గురువారం ఉదయం 11:30 నుంచి 12:30 గంటల వరకు ‘ఆంధ్రజ్యోతి’ పరిశీలనలో తేలాయి. దిల్‌సుఖ్‌నగర్‌, కొత్తపేట, వనస్థలిపురం, చింతలకుంట, కర్మన్‌ఘాట్‌, మందమల్లమ్మ, చంపాపేట చౌరస్తాల వద్ద  చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినా బైక్‌లు, కార్లతో జనం రోడ్ల మీదకు వస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు రహదారులపై కొంచెం రద్దీ కనిపించింది.  నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై  తిరుగుతున్న వాహనాలను పోలీసులు గుర్తించి సీజ్‌ చేశారు. పలువురిపై కేసులు నమోదు చేశారు. మెడికల్‌ ఎమర్జెన్సీ పేరుతో ఎక్కువ మంది రోడ్లపైకి వస్తున్నారు. వాటిలో 25శాతం నకిలీవిగా పోలీసులు గుర్తించి చర్యలు తీసుకున్నారు. నిత్యావసరాల పేరుతో కుటుంబ సభ్యులంతా రోడ్లపైకి వస్తుండటం పోలీసులకు తలనొప్పిగా మారింది. పనీపాట లేకుండా రోడ్లపైకి వస్తున్న యువకులతో పోలీసులు  గుంజీలు తీయిస్తున్నారు. కరోనా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించిన పోస్టర్‌ను పట్టుకొని చెక్‌పోస్టుల వద్ద నిల్చోబెట్టడం వంటి పనులు చేయిస్తున్నారు.  


జనాల కుంటి సాకులు ఇలా.. 

ఎల్లమ్మబండకు చెందిన ఓ వ్యక్తి ఇంట్లో వంట గ్యాస్‌ అయిపోయిందంటూ ఆటోలో మరో వ్యక్తితో కలిసి మాసబ్‌ట్యాక్‌ వెళ్తుండగా.కూకట్‌పల్లి పోలీసులు ఆపారు. వివరాలు ఆరా తీయగా సదరు వ్యక్తి చెప్పిన విషయం అబద్ధమని తేలింది. ఆటోను సీజ్‌ చేశారు.

బీరంగూడకు చెందిన ఇద్దరు వ్యక్తులు బైక్‌ మీద వెళుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. అడిగితే మెడికల్‌ షాపునకు వెళుతున్నట్లు చెప్పారు. దగ్గర్లోనే మెడికల్‌ షాపు ఉంది కదా? అని అడిగితే..  డిస్కౌంట్‌ ఇస్తారనే ఆశతో తాము ఎప్పుడూ ఒకే మెడికల్‌ షాపులో మందులు కొంటామని చెప్పారు. వారిపై ఆగ్రహం వ్యక్తం చేసిన పోలీసులు తిప్పి పంపారు.  

కేపీహెచ్‌బీకాలనీలో నివాసముండే ఓ వ్యక్తి కుటుంబ సభ్యులకు హోమియో మందులు కొనేందుకు అమీర్‌పేట వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. కేపీహెచ్‌బీకాలనీలో కంటే అమీర్‌పేటలో తక్కువ ధరకు మందులు దొరుకుతాయని, అందుకే అంతదూరం వెళుతున్నానని చెప్పాడు. మందలించి వెనక్కు పంపారు.

మెడికల్‌ అత్యవసరం పేరుతో బైకుకు స్టిక్కర్‌ అంటించిన ఓ వ్యక్తిని పోలీసులు తనిఖీ చేయగా  ఎటువంటి మెడికల్‌ అత్యవసరం లేదని తెలిసింది. పనేమీ లేకున్నా అతడు  రోడ్డు మీదకు వచ్చినట్లు గుర్తించి బైక్‌ సీజ్‌ చేశారు. 

చింతల్‌ బస్తీకి చెందిన హరిప్రసాద్‌తో పాటు మరో యువకుడు బైక్‌పై వెళ్తుండగా ఖైరతాబాద్‌ చెక్‌పోస్టు వద్ద పోలీసులు అడ్డగించారు. తాము అమీర్‌పేటలోని బిగ్‌బజార్‌కు వెళ్తున్నామని చెప్పారు. చింతల్‌బస్తీలోనే కొనుగోలు చేసే అవకాశం ఉన్నా ఏదో సాకు చెప్పి వెళ్లడానికి ప్రయత్నించిన వారికి పోలీసులు అడ్డుకొని అరగంట పాటు నిలబెట్టి వెనక్కు పంపించారు.


బైకుపై ఒకరు, కారులో ఇద్దరికి మాత్రమే అనుమతి

ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు అత్యవసర సమయంలో బైకుపై ఒకరు, కారులో ఇద్దరు మాత్రమే బయటకు రావాలి. బైకుపై ఇద్దరు ప్రయాణిస్తే ఒకరిని దింపి వెనక్కు పంపిస్తున్నాం. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నాం. నిత్యావసరాల పేరుతో కుటుంబ సభ్యులంతా బయటకు రావడం, వారిని నియంత్రించడం ఇబ్బందిగా మారింది. కౌన్సెలింగ్‌ ఇచ్చినా కొందరిలో మార్పు రావడంలేదు. ఇటీవల సేవా కార్యక్రమాల పేరుతో గుంపులుగా బయటకు వస్తున్నారు. వారికి అవగాహన కల్పిస్తున్నాం.  - శ్రీశైలం, అదనపు సీఐ, కూకట్‌పల్లి ట్రాఫిక్‌ పోలీ్‌సస్టేషన్‌

Updated Date - 2020-04-03T07:59:50+05:30 IST