కూకట్‌పల్లి కాల్పుల ఘటనలో దొంగలెవరో తేలిపోయింది..

ABN , First Publish Date - 2021-05-02T12:57:47+05:30 IST

సంచలనం సృష్టించిన కూకట్‌పల్లి కాల్పుల దోపిడీ కేసును ఎట్టకేలకు సైబరాబాద్‌ పోలీసులు ఛేదించారు.

కూకట్‌పల్లి కాల్పుల ఘటనలో దొంగలెవరో తేలిపోయింది..

  • కాల్పుల దొంగలు పాతనేరస్థులే..
  • బతుకుదెరువుకోసం వచ్చి దోపిడీలు 
  • సైబరాబాద్‌లోనే 3 దోపిడీలు
  • పాత క్రిమినల్‌ హిస్టరీని తీస్తున్న పోలీసులు

హైదరాబాద్‌ సిటీ : నగరంలో సంచలనం సృష్టించిన కూకట్‌పల్లి కాల్పుల దోపిడీ కేసును ఎట్టకేలకు సైబరాబాద్‌ పోలీసులు ఛేదించారు. దోపిడీ జరిగిన గం టల వ్యవధిలోనే నిందితులను పట్టుకున్న పోలీసులు వారి క్రిమినల్‌ హిస్టరీని బయటకు తీశారు. నిందితులు ఇప్పటికే నగరంలో పలు దోపిడీలకు పాల్పడినట్లు గుర్తించారు.


ఐదేళ్లక్రితమే నగరానికి.. 

దోపిడీకి పాల్పడిన దుండగులు యూపీ, బిహార్‌ రాష్ట్రాలకు చెందిన వారిగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఐదారేళ్ల క్రితం వారు ఈ రాష్ట్రానికి చెందిన పరిచయస్థుల ఆధారంగా బతుకుదెరువుకోసం నగరానికి వచ్చారు. ఒకే ప్రాంతంలో ఉంటూ కూలీ పనులు చేసుకుంటున్న క్రమంలో అంతా స్నేహితులయ్యారు. దుండిగల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఉంటూ లేబర్‌ పనులు చేసుకునేవారని విచారణలో తేలింది. జల్సాలు, వ్యసనాలకు అలవాటుపడిన నిందితులు వాటికోసం దోపిడీలు చేయాలని నిర్ణయించుకున్నారు. అర్థరాత్రి దుండిగల్‌, మేడ్చల్‌, పేట్‌బషీరాబాద్‌ జీడిమెట్ల, జగద్గిరిగుట్ట ప్రాంతాల్లో తిరుగుతూ రాత్రిపూట వెళ్లేవారిని బెదిరించి, భయపెట్టి దారిదోపిడీలకు పాల్పడేవారు. ఈ క్రమంలో నాలుగేళ్ల క్రితం ఇద్దరు నిందితులు దుండిగల్‌ పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యారు. జైలు నుంచి బయటకువచ్చిన నిందితులు తిరిగి కూలీ పనులు చేస్తూ అవకాశం చిక్కినప్పుడల్లా చిన్న చిన్న దొంగతనాలు చేసేవారని పోలీసుల విచారణలో తేలింది. ఇటీవల జీడిమెట్లలో ఆన్‌లైన్‌ మనీ ట్రాన్స్‌ఫర్‌ షాపులో దోపిడీకి పాల్పడింది కూడా ఈ నిందితులేనని పోలీసులు నిర్ధారణకు వచ్చా రు.  కూకట్‌పల్లి కాల్పుల ఘటన జరిగిన రోజే పోలీసులు ఈ పని చేసింది అదే ముఠా అనే నిర్ధారణకు వచ్చారు. 


భారీ దోపిడీకి స్కెచ్‌

జీడిమెట్లలో దోపిడీ జరిగిన తర్వాత పదిరోజుల పాటు రహస్యంగా పోలీసులకు చిక్క కుండా నగరంలోనే నక్కి ఉన్న దుండగులు ఆ తర్వాత భారీ దోపిడీ చేయాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా కూకట్‌పల్లి పటేల్‌కుంట పార్కు హెచ్‌డీఎ్‌ఫసీ ఏటీఎంను టార్గెట్‌ చేశారు. ఏటీఎంలో డబ్బులు నింపుతున్న క్రమంలో సిబ్బందిని భయపెట్టి డబ్బుల పెట్టెను లాక్కొని పారిపోవాలని ప్రయత్నించారు. సిబ్బంది ప్రతిఘటించడంతో కాల్పులు జరిపి రూ. 5లక్షల నగదుతో పారిపోయారు.ఈ ఐదారేళ్లలో నిందితులపై ట్రై కమిషనరేట్‌ పరిధిలో పలు దోపిడీ కేసులు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. జీడిమెట్లలో జరిగిన దోపిడీ కేసులో టీవీఎస్‌ జుపిటర్‌ తెల్లకలర్‌ స్కూటీని వాడిన దుండగులు దాన్ని పరిచయస్థుల వద్ద తీసుకున్నారు. కాగా..కూకట్‌పల్లి దోపిడీ కేసులో వాడిన బ్లాక్‌కలర్‌ పల్సర్‌ బైక్‌ను చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇది నగరంలో చేశారా? లేక మరెక్కడైనా చేశారా? అనేది తేలాల్సి ఉంది. నాందేడ్‌లో ఉంటూ వీరికి సహకరిస్తున్న ఈ ముఠాలోని వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది.

Updated Date - 2021-05-02T12:57:47+05:30 IST