కూకట్‌పల్లిలో పోటా.. పోటీ

ABN , First Publish Date - 2020-11-28T06:36:59+05:30 IST

కూకట్‌పల్లి నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌, బీజేపీ అభ్యర్థుల ఉధృత ప్రచారంతో ఉత్కంఠ పరిస్థితి ఏర్పడింది.

కూకట్‌పల్లిలో  పోటా.. పోటీ
కూకట్‌పల్లి

ప్రచారంలో టీఆర్‌ఎస్‌, బీజేపీ ముందంజ

కూకట్‌పల్లి, నవంబర్‌ 27 (ఆంధ్రజ్యోతి): కూకట్‌పల్లి నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌, బీజేపీ అభ్యర్థుల ఉధృత ప్రచారంతో ఉత్కంఠ పరిస్థితి ఏర్పడింది. ఆయా పార్టీల అభ్యర్థుల తరఫున అగ్రనేతలు ప్రచారంలో పాల్గొంటున్నారు. నియోజకవర్గంలో మొత్తం ఎనిమిది డివిజన్లు ఉండగా, కేపీహెచ్‌బీకాలనీ, బాలాజీనగర్‌, ఫతేనగర్‌, కూకట్‌పల్లి డివిజన్లలో టీఆర్‌ఎ్‌సకు బీజేపీ గట్టి పోటీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌ తన ఓటు బ్యాంకుతోపాటు అభివృద్ధి సంక్షేమ పథకాల ఓట్లపై ఆశలు పెట్టుకుంది. మరో పక్క టీడీపీ ఓటు బ్యాంకునూ తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తూనే, బీజేపీని టార్గెట్‌ చేస్తోంది. బీజేపీ... టీఆర్‌ఎ్‌సపై వ్యతిరేకతతో ఉన్న వర్గాలను తమవైపు తిప్పుకొనేందుకు ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్‌ కూకట్‌పల్లి డివిజన్‌లో గట్టి పోటీ ఇస్తోంది. ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొంది. టీడీపీ అభ్యర్థులు  పార్టీ ఓటు బ్యాంకును నమ్ముకొని ప్రచారంలో ముందుకుసాగుతున్నారు. నియోజకవర్గంలో 50 శాతానికిపైగా ఓటింగ్‌ జరిగితే ప్రస్తుత అంచనాలు తారుమారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పోలింగ్‌ శాతం పెరిగితే టీఆర్‌ఎస్‌ బలంగా ఉన్న డివిజన్లలో బీజేపీ దూకుడుతో అంచనాలు తప్పే అవకాశం కనిపిస్తోంది. 

టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్యే..

గత ఎన్నికలకు భిన్నంగా ఈసారి గ్రేటర్‌ ఎన్నికల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. 2016 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, టీడీపీ మధ్య పోటీ ఉంది. గత గ్రేటర్‌ ఎన్నికల్లో కూకట్‌పల్లి నియోజకవర్గంలోని 8 డివిజన్లలో 7 డివిజన్లు కైవసం చేసుకొన్న టీఆర్‌ఎస్‌ తిరిగి ఆ స్థానాలను నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది.  కాంగ్రెస్‌, టీడీపీ నేతలు తమ ఉనికిని కాపాడుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. 

గెలుపోటములపై అనిశ్చితి..

టీఆర్‌ఎస్‌ పార్టీ కచ్చితంగా గెలుస్తామన్న డివిజన్లలో కూడా ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఆ స్థానాల్లో బీజేపీ పుంజుకొనే పరిస్థితి కనిపిస్తుండడంతో, టీఆర్‌ఎస్‌ మరిన్ని వ్యూహాలకు పదునుపెడుతోంది. గత ఎన్నికల్లో సులభంగా మెజార్టీ సీట్లను గెలుచుకొన్న టీఆర్‌ఎస్‌... ఈసారి సిట్టింగ్‌ స్థానాలను కాపాడుకొనేందుకు ఆపసోపాలు పడుతోంది. ఎన్నికల రోజు నాటికి ఆయా పార్టీల అంచనాలు మారే అవకాశాలు కనిపిస్తుండడంతో గెలుపు, ఓటములపై  అయోమయం నెలకొంది.

ఖర్చులో వెనుకడుగు..

గత గ్రేటర్‌ ఎన్నికలతో పోలిస్తే ఆయా పార్టీ అభ్యర్థులు భారీగా ఖర్చు చేసేందుకు వెనుకాడుతున్నారు. ఈ సారి పార్టీ అభ్యర్థులే సొంత నిధులను వెచ్చించి ప్రచార కార్యక్రమాలు నిర్వహించాల్సి వస్తోందని తెలుస్తోంది. ఇంటింటి ప్రచారం, సమావేశాలకు జనాన్ని తరలించే విషయంలో వెనుకపడినట్లు తెలుస్తోంది. కార్యకర్తలకు ఖర్చుల నిమిత్తం డబ్బు ఇచ్చేటప్పడు, ప్రచార కార్యక్రమాలకు ఖర్చు చేసేటప్పుడు అభ్యర్థులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఈ ప్రభావం పోలింగ్‌ శాతంపై కూడా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Updated Date - 2020-11-28T06:36:59+05:30 IST