కుహనా లౌకికవాదమే అసలైన ‘చారిత్రక తప్పిదం’

ABN , First Publish Date - 2021-08-04T05:57:43+05:30 IST

తప్పుల మీద తప్పులు చేస్తూ వాటిని కలర్‍ఫుల్‌గా ‘చారిత్రక తప్పిదం’ అన్న పేరుతో కప్పిపుచ్చుకోవటంలో భారత కమ్యూనిస్టులకు మించినవారు లేరు...

కుహనా లౌకికవాదమే అసలైన ‘చారిత్రక తప్పిదం’

తప్పుల మీద తప్పులు చేస్తూ వాటిని కలర్‍ఫుల్‌గా ‘చారిత్రక తప్పిదం’ అన్న పేరుతో కప్పిపుచ్చుకోవటంలో భారత కమ్యూనిస్టులకు మించినవారు లేరు. అందుకే, ఒక్క కేరళలో కొడిగడుతున్న దీపం లాగా మిణుకు మిణుకుమంటున్నా, తక్కిన దేశమంతటా క్షీణిస్తున్నారు. వారి దుస్థితికి స్వయం కృతాపరాధమే కారణం. అందుకే కాబోలు ప్రధాని మోదీ ‘కాంగ్రెస్ ముక్త్‌ భారత్’ అని పిలుపునిచ్చారు తప్ప ‘కాంగ్రెస్, కమ్యూనిస్ట్ ముక్త్‌ భారత్’ అని పిలుపు నివ్వలేదు. కమ్యూనిస్టులను నిర్మూలించే అవకాశం వారు ఇతరులకు ఇవ్వరని, వారి తప్పిదాలతో వారే క్షీణిస్తారని మోదీ గ్రహించి ఉంటారు. 


దేశంలో కమ్యూనిజం క్షీణిస్తున్న పరిణామ క్రమాన్ని చూస్తే ఎవరికైనా ఇలాగే అనిపిస్తుంది. బెంగాల్ రాష్ట్రాన్నే తీసుకుంటే కొన్ని దశాబ్దాల పాటు ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించిన కమ్యూనిస్టులు ఇటీవలి ఎన్నికల్లో ఒక్క ఎమ్మెల్యే సీటును కూడా గెల్చుకోకపోగా రెండో స్థానంలో కూడా లేకుండా పోయారు. ఎందుకిలా అంటే అదే సమాధానం: స్వయంకృతాపరాధం. దేశవ్యాప్తంగా ప్రజల మన్నలతో ఎదుగుతున్న కమలం పార్టీ వికాసాన్ని ఎలాగైనా అడ్డుకోవాలనే తొందరలో తమ సిద్ధాంతాన్ని కూడా గాలికి వదిలేశారు. ఏ పార్టీ కారణంగా తాము పాతాళానికి చేరుకున్నామో అదే పార్టీకి మద్దతిచ్చి అడ్రసు లేకుండా పోయారు. కేరళలో కాంగ్రెస్ ‌పార్టీతో పోరాడుతూ బెంగాల్లో అదే పార్టీతో జట్టుకట్టడం వీరి అవకాశవాద రాజకీయానికి పరాకాష్ఠ. ఇందుకే రాజకీయంగా ఎంతో చైతన్యవంతులైన బెంగాలీలు వీరిని ఛీత్కరించుకున్నారు. అంతేకాదు నిత్యం సెక్యులరిజం, సర్వమత సమానత్వం, మతతత్వంలాంటి కబుర్లు చెప్పే ఈ సూడో సెక్యులరిస్టులు కేరళలో పచ్చిమతతత్వ పార్టీ అయిన ముస్లింలీగుతో చేతులు కలిపారు. మరోపక్క ‘సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్’ను ధ్యేయంగా చేసుకుని ముందుకెళుతున్న బీజేపీపై మాత్రం హిందూ మతతత్వ పార్టీ అంటూ బురద చల్లే ప్రయత్నం చేస్తుంటారు. సెక్యులరిజం పేరుతో హిందుత్వాన్ని మాత్రం వ్యతిరేకిస్తారు. దేశంలో ఏ మూల ఏ ఒక్క మైనార్టీకి అన్యాయం జరిగినట్లు భావించినా చాలు అరచి గోల చేసి, కొవ్వొత్తులు వెలిగిస్తూ, టీవీల్లో డిబేట్లు, పత్రికల్లో సంపాదకీయాలు రాసే ఈ సోకాల్డ్ సెక్యులరిస్టులకు హిందువులపై దాడులు జరుగుతున్నా, దళితులపై అత్యాచారాలు పెరుగుతున్నా, లవ్ జిహాద్ పేరుతో హిందూ బాలికలపై దాష్టీకం జరుగుతున్నా పట్టదు. హైదరాబాద్ నడిబొడ్డున దళిత బాలికపై అత్యాచారం జరిగినా, బైంసాలో తరచుగా హిందువులపై దాడులు, ఆస్తినష్టం, గృహదహనాలు జరుగుతున్నా ఏ రోజూ ఏ ఒక్క కొవ్వొత్తీ బయటకు రాలేదు. టీవీల్లో డిబేట్లు కాదు కదా కనీసం సానుభూతి, ధైర్యవచనాలు, పరామర్శలు కూడా లేవు. దేశంలోని కొన్ని దేవాలయాలలో మాత్రమే మహిళలకు ప్రవేశం లేకపోతే పెద్ద రాద్ధాంతం చేసి కోర్టుకెక్కిన వీరు దేశంలోని ఏ ఒక్క మసీదు లోనూ మహిళలకు ప్రవేశం లేకున్నా కనీసం ప్రశ్నించరు. అందుకేనేమో ‘భారత్‍లో సెక్యులరిజం అంటే హిందువులను నిర్లక్ష్యం చేయడం, మైనార్టీలను నెత్తికెత్తుకోవడం’ అని ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ వ్యాఖ్యానించారు.


నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా గొప్ప సాయుధ పోరాటాన్ని చేశామని గప్పాలు కొట్టుకునే వీరు అంతర్జాతీయ కమ్యూనిస్టు పార్టీ ఆదేశాలతో వెంటనే నిజాంకు మద్దతుగా మారి అప్పటి నెహ్రూ ప్రభుత్వానికి, భారత సైన్యాలకు వ్యతిరేకంగా పోరాడారంటేనే వీరి వైఖరి ఎప్పుడు ఎలా మారుతుందో చేప్పలేమన్నది అర్థమవుతుంది. అప్పటి దాకా నిజాం, రజాకార్ల నుంచే నరకాన్ని చూసిన హైదరాబాద్ సంస్థానంలోని హిందువులు ఈ మారిన కమ్యూనిస్టుల వైఖరితో మరిన్ని కష్టాల పాలయ్యారు. తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛాస్వాతంత్రాలు సెప్టెంబర్ 17, 1948 దాకా రాకపోవడానికి వీరు కూడా కారణమే. 1944లో ఆంధ్రమహాసభను కమ్యూనిస్టులు తమ పరం చేసుకున్నారు. హైదరాబాదులో కమ్యూనిస్టు పార్టీపై నిషేధం ఉండడంతో వారు ఆంధ్రమహాసభ వేదికగా కార్యకలాపాలు సాగించారు. 1947లో కాంగ్రెస్సుపై నిషేధం తొలగడంతో వారు దాన్ని వేదికగా చేసుకున్నారు. గ్రామగ్రామాన కాంగ్రెస్ జెండాలతో పాటు కమ్యూనిస్టు జెండాలు కూడ ఎగురవేశారు. అప్పుడు కూడా బలం లేని చోట కాంగ్రెస్ వారితో కలిసి పనిచేస్తూ, బలం ఉన్న చోట కాంగ్రెస్ వారిని తమ ఛాయలకు కూడా రానిచ్చే వారు కాదు. అంతర్జాతీయ కమ్యూనిస్టు పార్టీ ఆదేశాలతో తీరు మార్చుకున్న ఆంధ్ర కమ్యూనిస్టు పార్టీ నేతలైన పుచ్చలపల్లి సుందరయ్య, దేవులపల్లి వెంకటేశ్వరరావు తదితరులు హైదరాబాదులో ఒక ప్రకటన విడుదల చేశారు: ‘భారత ప్రభుత్వం బూర్జువా, భూస్వామ్య ప్రభుత్వం. ఇది బ్రిటిష్ సామ్రాజ్యవాదంతో లంకె వేసుకుని ఉంది. కాబట్టి హైదరాబాద్ సంస్థానంలో భారతసైన్యాల ప్రవేశాన్ని వ్యతిరేకించాలి. హైదరాబాదును భారత దేశంలో కలిపేసుకునే ప్రయత్నాలకు వ్యతిరేకంగా పోరాడాలి’ అన్నది దాని సారాంశం. స్వతంత్ర హైదరాబాద్ ఏర్పడాలనే నినాదం కూడా ఇచ్చారు. ఇంకేముంది నిజాం, రజాకార్లకు వెయ్యేనుగుల బలం వచ్చినట్లయింది. వెంటనే నిజాం అప్పటిదాకా వారిపై ఉన్న నిషేధాన్ని తొలగించడంతోపాటు వారికి ఆయుధాలు కూడా సరఫరా చేశారంటే కమ్యూనిస్టులు ఎంత ఘోరమైన చారిత్రక తప్పిదం చేశారో అర్థం చేసుకోవచ్చు. దీన్ని సుందరయ్య లాంటి నాయకులు సమర్థించుకున్నా అదే పార్టీకి చెందిన మరో ముఖ్యనాయకుడు రావి నారాయణరెడ్డి అసలు నిజాన్ని తన ‘తెలంగాణ-నగ్న స్వరూపం’ అన్న డాక్యుమెంటులో నిర్మొహమాటంగా వెల్లడించారు: ‘ఆంధ్ర నాయకత్వం బాధ్యురాలుగా ఉన్న అన్నివేళల్లోకెల్లా పోలీసు చర్య తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం, భారత మిలీటరీకి వ్యతిరేకంగా సాయుధ పోరాటాన్ని కొనసాగించాలనేది పెద్ద నేరం. ఈ నేరం హిమాలయ పర్వతంలాంటిదని అంటే తప్పేమీ కాదు’ అని విమర్శించారు. ఆయన ఈ డాక్యుమెంటును సాయుధ పోరాటం జరుగుతున్న రోజుల్లోనే రాశారు. ఇలాగే మితిమీరి చారిత్రక తప్పిదాలు చేస్తూపోవటంతో పాతికేళ్ళ సుధీర్ఘ పరిపాలనకు త్రిపుర ప్రజలు చరమ గీతం పాడి కమలం పార్టీకి అధికారాన్ని కట్టబెట్టారు. 


ఇలా కమ్యూనిస్టులు నాటి నుంచి  నేటి వరకు తమ సిద్ధాంతాన్ని గాలికి వదిలి సెక్యులరిజం పేరుతో హిందువులకు, రాజకీయాల్లో బీజేపీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తుండడంతో మన దేశంలో కమ్యూనిజం రోజురోజుకు పాతాళానికి చేరుకుంటోంది. ఇప్పటికైనా తమ తప్పులు తెలుసుకుని హిందువులకు క్షమాపణ చెప్పకపోతే, వచ్చే ఎన్నికల్లో కొనఊపిరితో ఉన్న కేరళలో కూడా అధికారాన్ని కోల్పోయి భారత్‍లో కమ్యూనిజం ‘ఉండేది’ అని చెప్పుకునే రోజులు వస్తాయి. 

శ్యామ్‌సుందర్ వరయోగి

కో-కన్వీనర్, బీజేపీ రాష్ట్ర ప్రశిక్షణ కమిటీ

Updated Date - 2021-08-04T05:57:43+05:30 IST