ప్రాణంతో సమానం.. అయినా దానంగా ఇచ్చేసింది!

ABN , First Publish Date - 2021-02-24T01:15:50+05:30 IST

జుట్టులేక ‘పెళ్లికాని ప్రసాద్’లలా మిగిలిపోయిన మగానుభావులకూ కొదవలేదు. ఇక ఆడాళ్లకైతే అదో పెద్ద ఆస్తి. కేశాలంకరణపై

ప్రాణంతో సమానం.. అయినా దానంగా ఇచ్చేసింది!

హైదరాబాద్: జుత్తు.. మగవారికైనా, మహిళలకైనా ఇదో పెద్ద ఆస్తి. జుత్తు లేకున్నా, ఉన్నది ఊడుతున్నా వచ్చే దిగులు ఎవరూ తీర్చలేనిది. జుట్టులేక ‘పెళ్లికాని ప్రసాద్’లలా మిగిలిపోయిన మగానుభావులకూ కొదవలేదు. ఇక ఆడాళ్లకైతే అదో పెద్ద ఆస్తి. కేశాలంకరణపై మహిళలు చూపే శ్రద్ధ గురించి ఓ పెద్ద పుస్తకమే రాయొచ్చు.


కేశాలకు కుంకుడుకాయ, శీకాయ నుంచి కండిషనర్ షాంపూలకు వరకు అన్నింటినీ వాడుతు చాలా జాగ్రత్తగా, అపురూపంగా చూసుకుంటారు. అంత ప్రేమగా చూసుకునే జుత్తును ఎవరికైనా బహుమానంగా ఇచ్చేయాలనుకుంటే.. కొందరికైతే గుండాగిపోయినంత పనవుతుంది. మరికొందరు అలాంటి ఆలోచన కలలో కూడా రాకూడదని కోరుకుంటారు. 


అయితే, ఇప్పుడు చెప్పబోయేది ఇందుకు పూర్తిగా భిన్నం. హైదరాబాద్‌కు చెందిన ఓ కూచిపూడి కళాకారిణి తన పొడవైన, ఒత్తైన జుత్తును ఓ కేన్సర్ రోగికి డొనేట్ చేసి వేనోళ్ల ప్రశంసలు అందుకుంటోంది. నిజానికి కూచిపూడి కళాకారిణికి జుత్తు ఎంతో ముఖ్యమైనది. కళ్లతో పలికించే భావాలకు హొయలొలికే జుత్తు మరింత అందాన్ని తెచ్చిపెడుతుంది. అలాంటిది అవేమీ ఆలోచించకుండా దానంగా ఇచ్చేసింది. కేన్సర్ రోగులకు కీమోథెరపీ, రేడియేషన్ కారణంగా జట్టు ఊడిపోవడం సర్వసాధారణమైన విషయం. ఇలాంటి వారికి తన జుత్తును ఇచ్చేందుకు ముందుకొచ్చిన ఆ కూచిపూడి నృత్యకారిణి పేరు శ్రావ్య మానస భోగిరెడ్డి. 


ప్రొఫెషన్ డ్యాన్సర్ అయిన శ్రావ్య బీటెక్, ఎంటెక్ అనంతరం ఆర్ట్స్‌లో మాస్టర్స్ చేసింది. ఆ తర్వాత హైదరాబాద్ యూనివర్సిటీ నుంచి డ్యాన్స్‌లో పీహెచ్‌డీ డిగ్రీ చేసింది. తన జుత్తును విరాళంగా ఇచ్చిన తర్వాత శ్రావ్య తన ఫేస్‌బుక్‌లో పోస్టు చేసిన ఫొటోలు వైరల్ అయ్యాయి. ‘‘జుత్తులోనే అందం ఉందని అందరూ చెప్పేది అబద్ధం. నేనిలా అందంగా లేనా? హైదరాబాద్ హెయిర్ డొనేషన్‌కు నా జుత్తును విరాళంగా ఇచ్చేశా’’ అని క్యాప్షన్ రాసుకొచ్చింది. నున్నటి గుండుతో కనిపించిన ఆమెను చూసిన సోషల్ మీడియా యూజర్లు షాకయ్యారు. అయితే, ఆమె చేసిన పనికి మాత్రం ప్రశంసలు కురిపించారు. 


ఆమె నుంచి కేశాలు అందుకున్న స్వచ్ఛంద సంస్థ ‘హైదరాబాద్ హెయిర్ డొనేషన్’ శ్రావ్యకు కృతజ్ఞతలు తెలిపింది. శాస్త్రీయ నృత్యకారిణి అయిన ఆమె ఇలా కేశాలను దానంగా ఇచ్చి నున్నటి షేవ్‌తో కనిపించడం చాలా కష్టమైన పనేనని పేర్కొంది. కీమోథెరపీ చేయించుకున్న కేన్సర్ రోగులకు జుత్తును ఇవ్వాలనుకున్న ఆమె నిర్ణయం ఎళ్లవేళలా ప్రశంసనీయమని పేర్కొంది. తమ సంస్థకు ప్రతి రోజు 40-50 మంది జుత్తును డొనేట్ చేస్తున్నట్టు తెలిపింది. హైదరాబాద్‌లోని మోతీనగర్‌కు చెందిన శ్రావ్య కూచిపూడి నృత్యకారిణే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. 

Updated Date - 2021-02-24T01:15:50+05:30 IST