మీ ఆందోళన నచ్చింది! అందుకే వచ్చా!

ABN , First Publish Date - 2022-09-27T17:35:22+05:30 IST

సమస్యల పరిష్కారం కోసం బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులు(Basara Triple IT students) చేసిన ఆందోళన అదిరిందని మంత్రి కేటీఆర్‌(Minister KTR) అన్నారు. రాజకీయాలకు తావు లేకుండా విద్యార్థులు చేసిన ఆందోళన తనకు నచ్చిందని చెప్పారు

మీ ఆందోళన నచ్చింది! అందుకే వచ్చా!

విద్యార్థులూ.. మీ ఆందోళన అదిరింది!

రాజకీయాలకు తావు లేకుండా పోరాడారు 

మీకెంత చేసినా తక్కువే.. సమస్యలన్నీ పరిష్కరిస్తా

నవంబరులో వచ్చి ల్యాప్‌టాప్‌లు అందజేస్తా

బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులతో మంత్రి కేటీఆర్‌

విద్యార్థులతో కలిసి భోజనం చేసిన మంత్రులు

బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులతో కేటీఆర్‌


బాసర, సెప్టెంబరు 26: సమస్యల పరిష్కారం కోసం బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులు(Basara Triple IT students) చేసిన ఆందోళన అదిరిందని మంత్రి కేటీఆర్‌(Minister KTR) అన్నారు. రాజకీయాలకు తావు లేకుండా విద్యార్థులు చేసిన ఆందోళన తనకు నచ్చిందని చెప్పారు. ‘మీరు ఎంచుకున్న పద్ధతి మహాత్మా గాంధీ బ్రిటిష్‌ వారిపై చేసిన పోరాటంలా.. స్ఫూర్తిదాయకంగా ఉంది’ అని కేటీఆర్‌ విద్యార్థులతో అన్నారు. ప్రభుత్వ దృష్టిని ఆకర్షించడానికి రేయింబవళ్లు, వర్షంలోనూ చేపట్టిన నిరసన తననెంతగానో ఆకర్షించిందని.. విద్యార్థులకు ఎంత చేసినా తక్కువేనని చెప్పారు. సోమవారం మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి బాసరలోని ఆర్జీయూకేటీ ట్రిపుల్‌ ఐటీ క్యాంప్‌స్‌(RGUKT Triple IT Campus)ను కేటీఆర్‌ సందర్శించారు. తొలుత విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. అనంతరం వారితో మాట్లాడి, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 


ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. 

సమస్యలు అపరిష్కృతంగా ఉన్నప్పుడు ప్రజాస్వామికంగా నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని చెప్పారు. 33 జిల్లాల్లో పదో తరగతి టాపర్స్‌ ఎంపికయ్యే ట్రిపుల్‌ ఐటీకి చాలా ప్రాముఖ్యత ఉందన్నారు. కానీ, ఇక్కడ ఆశించిన స్థాయిలో వసతులు లేకపోవడంతోపాటు కరోనా వల్ల కూడా కొన్ని సమస్యలు ఏర్పడ్డాయని తెలిపారు. ఎన్‌ఐటీ, ఐఐటీలకు దీటుగా ట్రిపుల్‌ ఐటీని తయారు చేస్తామని స్పష్టం చేశారు. ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులకు ఎంత చేసినా తక్కువేనని, వర్సిటీలో నెలకొన్న సమస్యలన్నీ పరిష్కరించాలని, కొత్త సౌకర్యాలు కూడా కల్పించాలని సీఎం కేసీఆర్‌ తనతో చెప్పారని కేటీఆర్‌ తెలిపారు.   ఉద్యోగాల కోసం చదవకుండా స్వతహాగా పది మందికి ఉద్యోగాలు కల్పించే స్థాయికి చేరేలా విద్యార్థులు ఎదగాలని కేటీఆర్‌ సూచించారు. ట్రిపుల్‌ ఐటీలో కూడా మినీ టీ హబ్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. దానికి అవసరమైన ఏర్పాట్లన్నీ తానే చూసుకుంటానని వీసీతో చెప్పారు. ఇన్నోవేషన్‌ వారోత్సవాలు నిర్వహించాలన్నారు. ఇకపై ఆర్నెల్లకోసారి ట్రిపుల్‌ ఐటీకి వస్తానని తెలిపారు.  


ట్రిపుల్‌ ఐటీకి వరాలు..

ట్రిపుల్‌ ఐటీపై కేటీఆర్‌ వరాల జల్లు కురిపించారు. స్టేడియం నిర్మాణానికి రూ.3 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. నవంబరులోపు విద్యార్థులందరికీ ల్యాప్‌టాప్‌లు అందజేస్తామన్నారు. 1000 కంప్యూటర్లతో ఆధునిక డిజిటల్‌ ల్యాబ్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అదనంగా 50 అధునాతన తరగతి గదులతో పాటు ఆధునిక ఫర్నీచర్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. విద్యార్థులు కోరినట్లుగా మెస్‌ టెండర్లను కొత్తగా పిలిచామని.. పెద్దగా స్పందన రాలేదని చెప్పారు. త్వరలోనే మరోసారి టెండర్లను పిలుస్తామన్నారు. తాను కూడా హాస్టల్‌లో చదువుకున్న వాడినేనని.. హాస్టళ్లలోని సమస్యలన్నీ తెలుసని చెప్పారు. సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు.









Updated Date - 2022-09-27T17:35:22+05:30 IST