కేటీఆర్‌ vs కిషన్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-02-08T07:21:12+05:30 IST

సమతామూర్తి విగ్రహాన్ని పక్షపాతి ఆవిష్కరించారంటూ ప్రధాని

కేటీఆర్‌ vs కిషన్‌రెడ్డి

  • మోదీపై కేటీఆర్‌ విమర్శలపై ‘ట్విటర్‌ వార్‌’
  • ఒవైసీ మెప్పు కోసం ప్రధానిపై విమర్శలా?
  • రామానుజాచార్యుల విగ్రహావిష్కరణనూ
  • టీఆర్‌ఎస్‌ రాజకీయాలకు వాడుకుంటోంది
  • ఇది దిగజారుడుతనం: కిషన్‌రెడ్డి
  • మేము రాష్ట్రానికి అండగా.. మీరు దేశానికి దండగ: కేటీఆర్‌


 

హైదరాబాద్‌, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): సమతామూర్తి విగ్రహాన్ని పక్షపాతి ఆవిష్కరించారంటూ ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ మంత్రి కేటీఆర్‌ చేసిన విమర్శలు.. బీజేపీ, టీఆర్‌ఎస్‌ మధ్య మాటల యుద్ధానికి తెరతీశాయి. ఈ అంశంపై సోమవారం కేటీఆర్‌, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మఽధ్య ‘ట్విటర్‌ వార్‌’ జరిగింది. కేటీఆర్‌ వ్యాఖ్యలపై కిషన్‌రెడ్డి స్పందిస్తూ, ‘‘15 నిమిషాలపాటు పోలీసులను తొలగిస్తే సత్తా చూపిస్తామన్న ఎంఐఎం నేతల వ్యాఖ్య లు, నిజాం రజాకార్‌ ఆర్మీ హిందువుల ఊచకోత లాంటి అంశాలపై ఒవైసీ ని, ఎంఐఎంను కేసీఆర్‌, కేటీఆర్‌ సమర్థిస్తున్నట్లు అనిపిస్తోంది. సబ్‌కా సాత్‌ సబ్‌కా వికాస్‌ కోసం శ్రమిస్తున్న ప్రధానిని అవమానిస్తున్నారు’’ అంటూ కిషన్‌రెడ్డి ట్విటర్‌లో విమర్శించారు.




సమానత్వాన్ని బోధించిన రామానుజాచార్యుల విగ్రహావిష్కరణను సైతం టీఆర్‌ఎస్‌ రాజకీయాలకు వాడుకోవడం ఆ పార్టీ దిగజారుడుతనానికి నిదర్శనమని పేర్కొన్నారు. పాతబస్తీలోని అనేక వందల హిందూ దేవాలయాలను ధ్వంసం చేసిన ఎంఐఎం పార్టీకి మద్దతు గా నిలిచిన చరిత్ర టీఆర్‌ఎ్‌సదన్నారు. ‘‘ఎంఐఎంకు మద్దతు పలికిన మీ రాజవంశ పాలన కలుషితమైందన్న విషయాన్ని.. ధర్మాలను ప్రబోధించేవారు గ్రహించాలి’’ అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్‌ స్పందిస్తూ.. ఎన్డీఏ ప్రభుత్వం తెలంగాణ పట్ల చూపించిన వివక్షకు ఇదీ నిదర్శనమంటూ.. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, పసుపు బోర్డు, ఫార్మాసిటీ, కేఎంటీపీలకు నిధులు కేటాయించకపోవడం, ఐటీఐఆర్‌.. లాంటి 19అంశాలను ప్రస్తావించారు. ఈ అంశాలపై స్పష్టత ఇవ్వాలని సవాల్‌ చేశారు. ‘‘ఐటీఐఆర్‌ ఇవ్వకున్నా దిగ్గజ ఐటీ కంపెనీలను తెచ్చుకున్నాం. జాతీయ హోదా ఇవ్వకున్నా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకున్నాం. కాజీపేటలో రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీ ఇవ్వకున్నా.. ప్రైవేటు కోచ్‌ ఫ్యాక్టరీ కట్టుకున్నాం. రాష్ట్రానికి అండగా మేము.. దేశానికి దండగ మీరు’’ అంటూ ట్వీట్‌ చేశారు.


కాగా, కేటీఆర్‌పై బీజేపీ మాజీ ఎమ్మె ల్సీ ఎన్‌.రాంచందర్‌రావు ‘‘సమతామూర్తి విగ్రహావిష్కరణ తర్వాత అంతర్జాతీయ స్థాయిలో భాగ్యనగర్‌కు ఇదే చిరునామాగా మారింది. మీరు మద్దతు పలుకుతున్న వారి చార్మినార్‌ కాదు’’ అని విమర్శనాస్ర్తాలు సంధించారు. దీంతో, ‘‘గాడ్సేను ఆరాధించేవారు మత సామరస్యం, బహుళత్వం లాంటి పదాలను అర్థం చేసుకోరని నాకు తెలుసు’’అంటూ కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.  


Updated Date - 2022-02-08T07:21:12+05:30 IST