సైకోలా మారిన కేటీఆర్‌

ABN , First Publish Date - 2022-05-19T09:10:58+05:30 IST

మంత్రి కేటీఆర్‌ సైకోలాగా మారారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ దుయ్యబట్టారు.

సైకోలా మారిన కేటీఆర్‌

  • ఇష్టం వచ్చినట్టు ప్రధానిపై మాటలు 
  • త్వరలో మూడో ప్రజా సంగ్రామ యాత్ర
  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌


వేములవాడ రూరల్‌, మే 18: మంత్రి కేటీఆర్‌ సైకోలాగా మారారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ దుయ్యబట్టారు. ప్రధాన మంత్రి అనే కనీస గౌరవం లేకుండా అసభ్య పదజాలంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. కేటీఆర్‌ ప్రవర్తన వల్ల త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ‘సన్‌’స్ట్రోక్‌ తాకనుందని జోస్యం చెప్పారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్‌ మండలం ఫాజుల్‌నగర్‌లో బీజేపీ బూత్‌ కమిటీ సభ్యులతో ఆయన సమావేశమయ్యారు. కల్వకుంట్ల కుటుంబ సభ్యుల కబంధ హస్తాల్లోనే కీలక మంత్రిత్వ శాఖలు ఉన్నాయని, ఎమ్మెల్యేలు, మంత్రులు తమకు రావాల్సిన నిధుల కోసం ప్రగతి భవన్‌ వద్ద భిక్షమెత్తుకునే పరిస్థితి నెలకొందన్నారు. శ్రీలంక తరహాలో కుటుంబ పాలన వల్ల ఏర్పడ్డ ఆర్థిక సంక్షోభం.. కల్వకుంట్ల కుటుంబ పాలన వల్ల రాష్ట్రంలో ఏర్పడవద్దని దేవుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు. బంగారు తెలంగాణ చేస్తానన్న కేసీఆర్‌ రాష్ట్ర ప్రజలకు బతుకుదెరువు కరువయ్యేలా చేస్తున్నారని ఆరోపించారు. ఓట్లు కొనే ఎజెండా టీఆర్‌ఎ్‌సదైతే ఓట్లను అభ్యర్థించి రాష్ర్టాన్ని అభివృద్ధి చేస్తామనేది బీజేపీ ఎజెండా అన్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఉచిత విద్య, వైద్యం, నిలువ నీడలేని కుటుంబాలకు ఆవాస్‌ యోజన పథకం కింద ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. ఫసల్‌ బీమా పథకం అమలు చేస్తామని చె ప్పారు. ప్రతీ సంవత్సరం ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. ప్రజాసంగ్రామ యాత్రకు అనూహ్య స్పందన వచ్చిందని, దీంతో టీఆర్‌ఎస్‌ గుండెల్లో గు బులు పుట్టిందన్నారు. మూడో సంగ్రామ యాత్ర త్వరలోనే ఉంటుందని బండి వెల్లడించారు. ఇప్పటికే 20 వేల పోలింగ్‌ బూత్‌ కమిటీలకు అధ్యక్షులను నియమించామని, రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కమిటీలను ప్రకటించుకున్నాక బూత్‌ కమిటీ అధ్యక్షులను నేరుగా ప్రధాని మోదీతో సమావేశపరుస్తామన్నారు. ‘ప్రసాదం’ పథకం కింద వేములవాడ రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని కేంద్రం చెబుతున్నా.. రాష్ట్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రెండేళ్ల క్రితంకేంద్రం ప్రతిపాదించిందని గుర్తుచేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం  పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-19T09:10:58+05:30 IST