Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Mon, 07 Jun 2021 17:22:22 IST

కేటీఆర్.. అసలు వ్యాక్సిన్ అంటే ఏంటో తెలుసా?: విజయశాంతి

twitter-iconwatsapp-iconfb-icon
కేటీఆర్.. అసలు వ్యాక్సిన్ అంటే ఏంటో తెలుసా?: విజయశాంతి

హైదరాబాద్: రాష్ట్ర మంత్రి కేటీఆర్‌పై బీజేపీ సీనియర్ నాయకురాలు విజయశాంతి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అసలు వ్యాక్సిన్ అంటే ఏంటో తెలుసా.. టీకా ఉత్పత్తి ఎలా జరగుతుందో అవగాహన ఉందా.. అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. వ్యాక్సిన్ రూపకల్పనకు శాస్త్రవేత్తలు రేయింబవళ్లు కష్టపడ్డారని.. టీకాల పంపిణీపై టీఆర్ఎస్ సర్కారు దుష్ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. ఫేస్‌బుక్‌లో సుదీర్ఘ పోస్టు పెట్టిన రాములమ్మ.. టీఆర్ఎస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. 


విజయశాంతి ఏమన్నారంటే.. ఫేస్‌బుక్ పోస్ట్ యథాతథంగా..     


కేటీఆర్ గారు..!! అసలు మీకు వ్యాక్సిన్ అంటే ఏంటో తెలుసా..? టీకా ఉత్పత్తి ఎలా జరుగుతుందో కొంతమాత్రమైనా అవగాహన ఉందా..? వ్యాక్సిన్ అనేది గంటలలోనో... రోజులలోనో... ఉత్పత్తి నడిపి ఇప్పటికిప్పుడు ఇబ్బడిముబ్బడిగా తయారు చేసేది కాదు. అదొక ప్రత్యేకమైన ప్రక్రియ.


అనేకమంది శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి వ్యాక్సిన్‌ రూపకల్పనకు రేయింబవళ్లు కష్టపడ్డారు. వ్యాక్సిన్ల తయారీ కోసం ఎందరో అవిశ్రాంతంగా పనిచేశారు.  సాధారణంగా టీకాల తయారీకి ఏళ్లు పడుతుంది. కానీ నరేంద్ర మోదీ సర్కారు ప్రోత్సాహం, నిర్దిష్టమైన ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయడంతో..  మన శాస్త్రవేత్తలు అతి తక్కువ సమయంలోనే అభివృద్ధి చేశారు. దాని ఫలితంగానే నేడు ఒకటి కాదు రెండు స్వదేశీ టీకాలు అందుబాటులోకి వచ్చాయి. అంతేకాదు, ఇంకా ఎన్నో వ్యాక్సిన్లు కూడా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. దేశీయ టీకా తయారీతో భారత్‌ సత్తా మరోసారి ప్రపంచానికి తెలిసింది. ఇది భారతదేశ బలానికి, భారతదేశ శాస్త్రీయ నైపుణ్యానికి, భారతదేశ ప్రతిభకు ఒక ప్రకాశవంతమైన రుజువు.


ఇంకా కేంద్ర ప్రభుత్వానికి విజన్ లేదు.. ప్లాన్ లేదంటూ మాట్లాడుతున్న కేటీఆర్ గారికి సరైన విజ్ఞత లేదని అర్థమవుతోంది. ఎందుకంటే ప్రపంచంలో వ్యాక్సినేషన్ మొదలైందే గత డిసెంబర్ లో..! భారత్ లో జనవరి 16వ తేదీన వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైంది. జనవరి 16 నుంచి మొదలు ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 25 కోట్లకు పైగా టీకా డోసుల (వ్యాక్సినేషన్) పూర్తి చేశాం. ఇది అమెరికా కంటే ఎక్కువ. ఈ లెక్కలు తెలుసా కేటీఆర్ గారూ?

వేగంగా టీకాలను అందిస్తోన్న దేశాల జాబితాలో భారత్ మూడో స్థానంలో ఉంది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి అందరికీ వ్యాక్సిన్లు అందేలా నరేంద్ర మోదీ ప్రభుత్వ తీవ్రంగా కృషి చేస్తోంది. వీలైన అన్ని మార్గాల ద్వారా టీకాల సేకరణకు మోదీ సర్కార్ నడుం బిగించింది. డిసెంబర్ నాటికి 250 కోట్ల డోసుల టీకాలను భారత్ సేకరించేలా ప్రణాళికలు రూపొందించింది.


టీకాల పంపిణీపై టీఆర్ఎస్ సర్కారు దుష్ప్రచారం చేయడం సిగ్గుచేటు. స్వదేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తిచేయకుండా విదేశాలకు టీకాలు అమ్ముకొంటుందని కేంద్రంపై నిందలు మోపుతున్నవారికి బాధ్యత ఉందా..? స్వదేశీ సాంకేతికతతో టీకా తయారీ చేసుకోవడం మీరు ఓర్చుకోలేకపోతున్నారా..? WHO, UNO సలహా మేరకు, ఉత్పత్తి సంస్థల నిబంధనల ప్రకారం కొవాగ్జిన్, ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ సంయుక్తంగా తయారు చేసిన ఆస్ట్రాజెనికా (కొవిషీల్డ్) స్నేహపూర్వకంగా ఇతర దేశాలకు పంపిణీ చేయాల్సిందే. విదేశాలకు పంపిన టీకాలు సరైన అనుమతులు, ఇతర వాణిజ్యపరమైన నిబంధనల ప్రకారం పంపినవే. నిబంధనల ప్రకారం ఉత్పత్తి సంస్థలు కచ్చితంగా పంపాల్సిందే. ఆ విషయం తెలుసుకోకుండా మాట్లాడటం తప్పకుండా అవివేకమే.


మీ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వంపై నిందలు మోపడం మంచిదికాదు.  కరోనా మహమ్మారి భారత్ లో పుట్టలేదు. అది వూహాన్ లో పుట్టి వివిధ దేశాలకు విస్తరించి మన భారత్‌కు అంటుకుంది. అందుకే ప్రపంచానికి వ్యాక్సినేషన్ జరిగినప్పుడే వైరస్ నిర్మూలన అనేది సుసాధ్యం.  అవివేకంతో ఒక్క తెలంగాణలోనే వ్యాక్సిన్ చేస్తా అనుకుంటే అది మీ అజ్ఞానమే.  


ఫైజర్ సంస్థను వ్యాక్సినేషన్ కోసం కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు జరిపితే ఒక్క డోసుకు రూ. 2,880 నిర్ణయించారు. అంటే భారత జనాభా లెక్కల ప్రకారం రూ. 7 లక్షల కోట్లు ఆ సంస్థకు ఇవ్వాల్సి వచ్చేది. అందుకే భారత్ స్వదేశీ పరిజ్నానంతో, వేగవంతంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపట్టింది. దీన్ని కూడా తప్పుపట్టిన టీఆరెస్ నాయకత్వానికి కొంచమైన సోయి ఉందా..? లేక కమీషన్ల ముసుగులోనే మాట్లాడదుతున్నారా అర్థం కావట్లేదు..? ఫైజర్ సంస్థకు దోచిపెట్టి అక్కడ కూడా కమీషన్లు దండుకోవాలనే భ్రమలో మాట్లాడుతున్నారా..? అనే సందేహం కలుగుతోంది. 


కేసీఆర్ గారి కుటుంబం జీవితమే కమీషన్ల బాపతు. అందుకే ఫైజర్, జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీలను భారతదేశానికి ఎందుకు తీసుకురావడం లేదని గాయి గాయి పెడ్తున్న మీరు దేశ సంపదను ఆ కంపెనీలకు దోచిపెట్టాలనుకుంటున్నారా..? అంటే దేశంలో ఒక డోసు టీకా రూ. 250 ధరకే దొరకొద్దా..? రూ. 2వేలు, రూ.3వేలు అంటూ ఇష్టారీతిన రేట్లు పెంచుతూ కమీషన్లు దండుకోవాలనుకోవడం TRS దుర్బుద్ధి కాదా..? వ్యాక్సినేషన్ ప్రక్రియపై  టీఆర్ఎస్ ప్రభుత్వ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వంపై నిందలు మోపడం దుర్మార్గం. ప్రపంచంలోనే అత్యధికంగా వ్యాక్సినేషన్ జరిగిన దేశాల్లో భారత్ రెండోస్థానంలో ఉంది. మొదటి డోసు ఇచ్చిన స్థానాల్లో భారత్ మొదటిస్థానంలో ఉంది. వచ్చే డిసెంబర్ నాటికి మొత్తం 250 కోట్ల డోసులు వ్యాక్సిన్ ఇవ్వాలన్న లక్ష్యంతో నరేంద్ర మోదీ సర్కారు పనిచేస్తోంది. కరోనా టైంలో వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. ప్రైవేటు ఆస్పత్రులకు దోచిపెట్టి కమీషన్లు దండుకుంది ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం. వేలమంది పేద ప్రజల ప్రాణాలను బలిపెట్టి ఖజానా నింపుకోవడం దుర్మార్గం. ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీ గురించి స్పందించకుండా.. టాస్క్ ఫోర్స్ అంటూ కొన్ని ఆసుపత్రులపై జులుం చూపెట్టి.. దోపిడీ చేసే పలు ప్రైవేట్ ఆసుపత్రులను చూసీచూడనట్లు ఎందుకు వ్యవహరిస్తున్నారు..? ఈ వేల కోట్ల అవినీతిలో సీఎం కేసీఆర్ గారి కుటుంబ కమీషన్ ఎంతనో వారే చెప్పాలి.


ఇప్పటివరకు దేశమంతా వ్యాక్సినేషన్ ను కేంద్రప్రభుత్వం ఉచితంగానే ఇచ్చింది. 80 లక్షల డోసులను కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అందించింది. అసలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత కొనుగోలు చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలి. ఎంతమందికి టీకాలు అందించారో చెప్పాలి. అబద్ధాలు, పిచ్చి ప్రేలాపనలతో రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతూ, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న కేసీఆర్ కుటుంబానికి రోజులు దగ్గరపడ్డాయి. కేటీఆర్ గారు..! హైదరాబాద్ జనాభా అంత కూడా లేని దేశాలతో 130 కోట్ల జనాభా గల భారతదేశాన్ని పోల్చడం మీ అవగాహనరాహిత్యానికి నిదర్శనం కాదా?  ప్రభుత్వానికి దొరకని వ్యాక్సిన్లు, ఇంత పెద్ద మొత్తంలో కొన్ని ప్రైవేట్ సంస్థలకు ఎట్ల దొరుకుతున్నాయి..? భారత్ బయోటెక్ కంపెనీ మన దగ్గరే ఉన్నా, ఆ సంస్థ దగ్గర్నుంచి వ్యాక్సిన్ తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయింది. ఆ సంస్థ సుమారు పది లక్షల డోసులను మన రాష్ట్రంలోని ప్రైవేట్ హాస్పిటళ్లకు సరఫరా చేసినట్టు హెల్త్ ఆఫీసర్లే  చెప్తున్నారు. కానీ, ప్రభుత్వానికి మాత్రం ఇప్పటివరకూ రెండున్నర లక్షల డోసులే సరఫరా అయ్యాయి. అంటే మతలబు ఏంటి..? ప్రైవేటు ఆస్పత్రులతో కుమ్మక్కై కమీషన్ల కోసం ప్రజల ప్రాణాలు బలిపెట్టాలనుకుంటున్నారా..?  టీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 2,500 కోట్ల ఖర్చుతో గ్లోబల్ టెండర్లు పిలిచి వ్యాక్సిన్ కొనుక్కుంటామంటూ బాతాలు కొడుతున్నరు కదా..  కనీసం రాష్ట్రంలో వెంటిలేటర్లను సర్వీసింగ్ కూడా ఎందుకు చేసుకోలేకపోయారు..? ఆక్సిజన్ ను సకాలంలో అందించలేకపోయారు ఎందుకు..? కల్లబొల్లి మాటలతో మభ్యపెట్టే బదులు వ్యాక్సినేషన్ విషయంలో మీ అసమర్థతను ఒప్పుకోండి. మీరు వ్యాక్సినేషన్ చేసినా , చేయించకపోయినా.. ఖచ్చితంగా భారత ప్రజలందరికీ నరేంద్ర మోదీ ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియను అందిస్తుంది. తెలంగాణ కూడా భారత ప్రజలే అని గుర్తుంచుకోవాలి. (కేటీఆర్ గారు....! ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి ..! తెలంగాణ రాష్ట్రం కూడా భారతదేశంలోనే ఉంది.)అసలు కరోనాపై పోరాటంలో టీఆర్ఎస్ సర్కారు ఏం చేసింది..?  టెస్టులు తక్కువ చేసి, పాజిటివ్ కేసులు, మృతుల సంఖ్యను తక్కువ చూపెట్టింది. దవాఖాన్లలో సిబ్బందిని నియమించలేదు. వసతులు మెరుగుపర్చలేదు. ఫలితంగా సర్కారు ఆసుపత్రులు ప్రజలకు సరైన వైద్యసేవలు అందించలేకపోయాయి. 


టీఆర్ఎస్ నాయకుల ప్రోద్బలంతో ప్రైవేటు ఆసుపత్రుల ఫీజు దోపిడీని కొనసాగించింది. నిర్వహణ వైఫల్యంతో వ్యాక్సిన్ పెద్దమొత్తంలో వృథా చేసింది. కరోనా విషయంలో టీఆర్ఎస్ సర్కారు వైఫల్యాలపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం ఉంది. దీనిని తప్పించుకునేందుకే కేటీఆర్ వ్యాక్సినేషన్ విషయంలో కేంద్రంపై నిందలు మొపుతున్నారు. కానీ, ప్రజలు అన్నీ అర్థం చేసుకుంటున్నారు  భవిష్యత్తులో మీ పతనానికి మీరే గొయ్యి తవ్వుకుంటున్నారని గుర్తుపెట్టుకోవటం మంచిది.


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.