దావోస్‌లో ముగిసిన కేటీఆర్‌ టూర్‌

ABN , First Publish Date - 2022-05-28T09:18:16+05:30 IST

హైదరాబాద్‌, మే 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ దావోస్‌ పర్యటన ముగిసింది. ఈనెల 18న లండన్‌కు చేరుకు న్న ఆయన అక్కడ పలు సమావేశాల్లో

దావోస్‌లో ముగిసిన కేటీఆర్‌ టూర్‌

- రాష్ట్రానికి రూ.4200 కోట్ల పెట్టుబడులు

- 45 కంపెనీల ప్రతినిధులతో సమావేశాలు

హైదరాబాద్‌, మే 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ దావోస్‌ పర్యటన ముగిసింది. ఈనెల 18న లండన్‌కు చేరుకు న్న ఆయన అక్కడ పలు సమావేశాల్లో పాల్గొన్నారు. అనంతరం స్విట్జర్లాండ్‌లోని దావో్‌సలో జరిగిన వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం వేదికగా ప్రపంచంలోని ప్రముఖ కంపెనీల ప్రతినిధి బృందాలతో భేటీ అయ్యారు. తెలంగాణలో పెట్టుబడుల అవకాశాల గురించి, రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక విధానాల గురించి వారికి వివరించారు. ఈ పర్యటనలో మొత్తం 45 కంపెనీల ప్రతినిధి బృందాలతో సమావేశమైన ఆయన.. సుమారు 4200 కోట్ల రూపాయల పెట్టుబడులు తెలంగాణకు వచ్చేలా చేశారని అధికార వర్గాలు వెల్లడించాయి.  తెలంగాణ ప్రభు త్వ విధానాలతో పాటు, పెట్టుబడి అవకాశాల గురించి ప్రపంచ వేదికపై వివరించడానికి ఈ పర్యటన ఎంతగానో దోహదపడిందని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. ఈ పర్యటన ద్వారా రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. పర్యటన విజయవంతం కావడానికి కృషి చేసిన ప్రభుత్వ అధికారులు, వ్యాపార వాణిజ్య సంస్థలకు.. యూకే, స్విట్జర్లాండ్‌ దేశాల్లోని చెందిన ఎన్నారైలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఎప్పటిలాగానే.. అత్యుత్తమ విధానకర్తలను, వ్యాపారవేత్తలను, ఆలోచనాపరులను కలుసుకునే గొప్ప అవకాశాన్ని, తెలంగాణను పెట్టుబడుల గమ్యస్థానంగా నిలిపే అవకాశాన్ని దావోస్‌ ఇచ్చిందని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.  

జ్యూరిక్‌లో జడ్‌ఎఫ్‌ కంపెనీతో సమావేశం

స్విట్జర్లాండ్లోని జ్యూరిక్‌ నగరంలో జడ్‌ఎఫ్‌ కంపెనీ అధికారులతో మంత్రి కేటీఆర్‌ సమావేశమయ్యారు ఈ సందర్భంగా జడ్‌ఎఫ్‌ కంపెనీ తెలంగాణలో తన విస్తరణ ప్రణాళికలను ప్రకటించింది. ప్రస్తుతం హైదరాబాద్‌ నగరంలో ఉన్న తమ కంపెనీ కార్యకలాపాలను విస్తరించనున్నట్లు తెలిపింది. జడ్‌ఎఫ్‌ కంపెనీ విస్తరణతో తెలంగాణలో మొబిలిటీ రంగానికి అదనపు బలం చేకూరుతుందని కేటీఆర్‌ అభిప్రాయపడ్డారు. జ్యూరిక్‌ వీధుల్లో మధ్యాహ్న భోజనానికి కూర్చున్న ఫొటోను పోస్ట్‌ చేసిన కేటీఆర్‌.. ‘అడియోస్‌ (గుడ్‌బై) దావోస్‌.. మళ్లీ కలిసేదాకా’ అని ట్వీట్‌ చేశారు.

Updated Date - 2022-05-28T09:18:16+05:30 IST