వరంగల్‌ను అద్భుతంగా తీర్చిదిద్దుదాం..

ABN , First Publish Date - 2021-04-13T06:16:07+05:30 IST

వరంగల్‌ను అద్భుతంగా తీర్చిదిద్దుదాం..

వరంగల్‌ను అద్భుతంగా తీర్చిదిద్దుదాం..
ఖిలా వరంగల్‌లో జరిగిన సభకు హాజరైన ప్రజలు, మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్‌

రాబోయే జీడబ్ల్యుఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎ్‌సకే పట్టం కట్టాలి

మాయమాటలతో మభ్యపెడుతున్న బీజేపీ

పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌


 వరంగల్‌ అర్బన్‌, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) :  వరంగల్‌ను అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దే బాధ్యత తమదేనని, ఈ విషయంలో ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ పెట్టారని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. వరంగల్‌ నగరంలో సోమవారం ఆయన సుడిగాలి పర్యటన చేపట్టి పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఖిలా వరంగల్‌ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ఆరేళ్లుగా ప్రజలు టీఆర్‌ఎ్‌సనే గెలిపిస్తున్నారని, రాబోయే కార్పొరేషన్‌ ఎన్నికల్లోనూ ఇదే తీర్పు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వరంగల్‌ ప్రజల ఆశీర్వాదం సీఎం కేసీఆర్‌కు ఉండాలని కోరారు. తెలంగాణకు బీజేపీ మొండి చేయి చూపిందని విమర్శించారు. 

ప్రజలకు త్వరలోనే కొత్త రేషన్‌కార్డులు ఇస్తామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ‘పెద్దలు ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అంటారు. కానీ కేసీఆర్‌ ఇల్లు, పెళ్లి రెండూ చేస్తున్నారు’అని అన్నారు. వరంగల్‌ నగరాభివృద్ధికి బీజేపీ చేసిందేమీ లేదని విమర్శించారు. వరంగల్‌ పట్టణాభివృద్ధికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం బడ్జెట్లో ఏడాదికి రూ.300కోట్లు కేటాయించిందని గుర్తు చేశారు. కేవలం తాగునీటి కోసమే రూ.1,580 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసిందని వివరించారు. విదేశాల్లో నల్లధనం తీసుకొచ్చి పేదల ఖాతాల్లో రూ.15లక్షలు జమ చేస్తామన్న ప్రధాని మోదీ మాట ఏమైందని కేటీఆర్‌ ప్రశ్నించారు. తెలంగాణ ఆవిర్భావ సమయంలో కాజీపేటలో రైల్వే కోచ్‌ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని చెప్పి ఇప్పుడు మాట మార్చారన్నారు.  

రాష్ట్రంలో పేదల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. టీడీపీ హయాంలో పెన్షన్‌ రూ.75 అయితే కాం గ్రెస్‌ హయాంలో రూ.200 అని, టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మొ త్తం రూ.2016కు పెరిగిందన్నారు. ఆసరా పెన్షన్లతో పేదల ముఖాల్లో సంతోషాన్ని చూస్తున్నామన్నారు. దివ్యాంగులకు కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ.500 ఇస్తే ఇప్పుడు రూ.3016 ఇస్తున్నామని తెలిపారు.  సభలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌ రావు, సత్యవతి రాథోడ్‌, ఎంపీలు దయాకర్‌, మాలోత్‌ కవిత,  ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్‌, పెద్ది సుధర్శన్‌ రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేశ్‌, డాక్టర్‌ రాజయ్య, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు..


ఒక రోజు ముందే ఉగాది

న్యూశాయంపేట : వరంగల్‌ నగర ప్రజలకు ఉగాది పండుగ ఒక రోజు ముందే వచ్చిందని మంత్రి కేటీఆర్‌ అన్నారు.  హన్మకొండలోని న్యూశాయంపేట జంక్షన్‌ వద్ద అమృత్‌  అర్బన్‌ మిషన్‌ భగీరథ నీటి సరఫరాను సోమవారం సాయంత్రం ఆయన ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. ‘వరంగల్‌ ప్రజలకు ఒక రోజు ముందే ఉగాది వచ్చింది. రూ.2177కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో వారిలో ఆనందం వెల్లివిరుస్తోంది. నగరమంతా పండుగ వాతావరణం కనిపిస్తోంది..’ అని అన్నారు.  తెలంగాణ రాష్ట్రంలో వరంగల్‌కు ప్రత్యేక స్థానం ఉందని, మేధావులు, విద్యావేత్తలు, కళాకారులకు ఈ ప్రాంతం నిలయమని తెలిపారు. ఇది పోరాటాల గడ్డ, చైతన్యానికి ప్రతీక అని కొనియాడారు. 

అర్బన్‌ మిషన్‌ భగీరథ కింద వరంగల్‌ నగర ప్రజలకు పరిశుభ్రమైన తాగునీరు అందుబాటులోకి వచ్చిందన్నారు. వరంగల్‌ నగరం ఐటీ హబ్‌గా అభివృద్ధి చెందడం ఖాయమని తెలిపారు. కొరియా కంపెనీ యంగ్‌వన్‌ రాకతో జిల్లాలో వేలాది మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు.  భద్రకాళి బండ్‌ సుందరీకరణ ఒక చారిత్రక అద్భుతమని కేటీఆర్‌ అభివర్ణించారు. మామునూరు ఎయిర్‌ పోర్టులో విమాన సేవలు, నగరంలో మెట్రో రైలు సేవలు అందించే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. నగరంలో నాలాల పరిస్థితి మారిందన్నారు. బీజేపీ తప్పుడు ప్రచారంతో ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు.  రానున్న కార్పొరేషన్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎ్‌సకు పట్టంకట్టాలని ప్రజలను కోరారు.

ప్రభుత్వ చీప్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ మాట్లాడుతూ అభివృద్ధికి చిరునా మా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనన్నారు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ నేతృత్వంలో బంగారు తెలంగాణ సాకారమవుతోందని ప్రశంసించారు. కాగా, మంత్రి కేటీఆర్‌ బహిరంగ సభలో చిన్న అపశృతి చోటుచేసుకుంది. సభాస్థలి వద్ద పెద్ద ఎత్తున బాణసంచా కాల్చడంతో మిరుగులు సభా వేదిక వద్ద కార్పెట్‌పై పడి మంటలు అంటుకున్నాయి. అప్రమత్తమైన కార్యకర్తలు ఆర్పేయడంతో ప్రమాదం తప్పింది.



Updated Date - 2021-04-13T06:16:07+05:30 IST