Abn logo
Jun 22 2021 @ 01:04AM

కేటీఆర్‌ ఆకస్మిక పర్యటన

సిరిసిల్లలో సమీకృత కలెక్టరేట్‌ భవనాన్ని పరిశీలిస్తున్న మంత్రి కేటీఆర్‌

 - అధికారుల పరుగులు 

- సమీకృత కలెక్టరేట్‌, డబుల్‌బెడ్‌రూం ఇళ్లు, డ్రైవింగ్‌ శిక్షణ కేంద్రం పరిశీలన 

- మార్పులు, చేర్పులపై అధికారులకు సూచనలు 

- సమీకృత కలెక్టరేట్‌ను సుందరంగా తీర్చిదిద్దాలి

- పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు 

(ఆంఽధ్రజ్యోతి సిరిసిల్ల)

 జిల్లాలో మంత్రి కే తారకరామారావు సోమవారం ఆకస్మికంగా పర్యటించారు. వచ్చే నెలలో ప్రారంభించనున్న జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌ భవనం, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, అంతర్జాతీయ డ్రైవింగ్‌ శిక్షణ కేంద్రం, నర్సింగ్‌ కళాశాల భవనాల తుది దశ పనులను  పరిశీలించారు.  మంత్రి ఆకస్మిక పర్యటనతో  అధికారులు పరుగులెత్తారు. ఉదయం 11 గంటలకే  మంత్రి కేటీఆర్‌ జిల్లాలోని తంగళ్లపల్లికి చేరుకున్నారు. మండెపల్లిలో  డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల సముదాయాన్ని, పైలాన్‌తో సహా రోడ్లు, అంతర్గతంగా ఉన్న పార్కులను పరిశీలించారు. పార్కుల్లో వాకింగ్‌ ట్రాక్‌, ఏర్పాటు చేయాలని సూచించారు. పిల్లల కోసం ప్రత్యేక పార్కును నిర్మించాలన్నారు. 1400 కుటుంబాలు ఉండనుండడంతో పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రం, ఆరోగ్య ఉప కేంద్రం వంటివి ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. సిరిసిల్ల - సిద్దిపేట రహదారి నుంచి డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల వరకు నిర్మిస్తున్న వంద ఫీట్ల రోడ్డును పరిశీలించారు. పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. రోడ్డు కింద  తమ ప్లాట్లు పోయాయని పలువురు ఇందిరమ్మ కాలనీ వాసులు వచ్చి కేటీఆర్‌కు విన్నవించుకున్నారు. వేరే చోట  ప్లాట్లు చూపిస్తామని హామీ ఇచ్చారు.  రోడ్డులో బోరు పోయిందని మహిళా రైతు కేటీఆర్‌ దృష్టికి తీసుకొచ్చింది.  స్పందించిన మంత్రి బోరు వేయిస్తామన్నారు. డ్రైవింగ్‌ శిక్షణ కేంద్రంలో ట్రాక్‌లను ఆయన వాహనం ద్వారా పరిశీలించారు. సిరిసిల్లలో నిర్మాణం పూర్తి చేసుకున్న నర్సింగ్‌ కళాశాల భవనాన్ని పరిశీలించారు. కళాశాలకు మిషన్‌భగీరథ నీళ్లకు సంబంధించిన పైపులైన్‌ సౌకర్యంపై అడిగి తెలుసుకున్నారు. పక్కనే నిర్మాణంలో ఉన్న డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను పరిశీలించారు. ఇళ్ల  రంగులు సరిగా లేకపోవడంతో వాటిని మార్చాలని ఆదేశించారు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల వరకు రోడ్డుకు ఇరువైపులా  మొక్కలు పెంచాలన్నారు. సమీకృత కలెక్టరేట్‌ భవనాన్ని పరిశీలించి తుది దశ పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు.  డబుల్‌బెడ్‌రూంల సముదాయం, కలెక్టరేట్‌ భవన సముదాయాన్ని సుందరంగా తీర్చిదిద్దాలన్నారు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల సముదాయం వద్ద చెట్లు, పార్కుల నిర్మాణాలు పరిశీలించారు. హైదరాబాద్‌లో కూడా చేపట్టాల్సిన పనులపై పురపాలక శాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి అరవింద్‌కుమార్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌కుమార్‌కు సూచనలు చేశారు.  కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌కు తుదిదశ పనులను పూర్తి చేయించాలని ఆదేశించారు. బైపాస్‌ రోడ్డు వద్ద ప్రధాన మురికి కాలువను పరిశీలించి మిగిలిపోయిన నిర్మాణాన్ని పూర్తి చేయాలన్నారు. ఆయన వెంట జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, అదనపు కలెక్టర్‌ సత్యప్రసాద్‌, ఎస్పీ రాహుల్‌హెగ్డే, న్యాప్స్‌కాబ్‌ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళాచక్రపాణి, ఆర్డీవో శ్రీనివాసరావు, మున్సిపల్‌ ఓఎస్డీ మహేందర్‌రెడ్డి, సిరిసిల్ల మున్సిపల్‌ కమిషనర్‌ సమ్మయ్య, ఆర్‌అండ్‌బీ ఈఈ కిషన్‌రావు, రైతుబంధు సమితి కో ఆర్డినేటర్‌ కల్వకుంట్ల గోపాల్‌రావు, జడ్పీటీసీ పూర్మాణి మంజుల, తంగళ్లపల్లి ఎంపీపీ పడిగెల మానస, సర్పంచ్‌ గనప శివజ్యోతి, ఎంపీటీసీ బుస్స స్వప్న, సెస్‌ మాజీ చైర్మన్‌ చిక్కాల రామారావు, ముస్తాబాద్‌ ఎంపీపీ  శరత్‌రావు, ఎల్లారెడ్డిపేట మాజీ జడ్పీటీసీ తోట ఆగయ్య, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.