న్యూ సిటీకి దీటుగా..

ABN , First Publish Date - 2022-04-20T16:39:58+05:30 IST

పాతబస్తీని కొత్త నగరానికి సమాన స్థాయిలో అభివృద్ధి చేస్తామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. పాతబస్తీ బహదూర్‌పురాలో

న్యూ సిటీకి దీటుగా..

రూ.580 కోట్లతో పాతబస్తీలో అభివృద్ధి పనులు

ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన కేటీఆర్‌


హైదరాబాద్‌ సిటీ/చార్మినార్‌/మదీనా: పాతబస్తీని కొత్త నగరానికి సమాన స్థాయిలో అభివృద్ధి చేస్తామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. పాతబస్తీ బహదూర్‌పురాలో రూ.109 కోట్లతో నిర్మించిన వంతెన, మీరాలం ట్యాంక్‌ వద్ద రూ.2.5 కోట్లతో నిర్మించిన మ్యూజికల్‌ ఫౌంటెయిన్‌, రూ.2 కోట్లతో ఏర్పాటు చేసిన సెకండరీ కలెక్షన్‌ అండ్‌ ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్‌ను ఆయన ప్రారంభించారు. రూ.30 కోట్లతో ఆధునికీకరణ/పునరుద్ధరించనున్న సర్దార్‌ మహల్‌, రూ.21 కోట్లతో ప్రతిపాదించిన మీరాలం మండి పునరుద్ధరణ, రూ.35 కోట్లతో అభివృద్ధి చేయనున్న ముర్గిచౌక్‌, రూ.4.2 కోట్లతో నిర్మించ తలపెట్టిన కాలాపత్తర్‌ పోలీ్‌సస్టేషన్‌, కార్వాన్‌ నియోజకవర్గంలో రూ.280 కోట్లతో ప్రతిపాదించిన మురుగు నీటి పైపులైన్ల వ్యవస్థ, పాతబస్తీలో మురుగు శుద్ధికి రూ.81 కోట్లతో ఎస్‌టీపీల నిర్మాణ పనులకు మంగళవారం శంకుస్థాపన చేశారు. మొత్తం రూ.580 కోట్ల పనులకు ప్రారంభోత్సవాలు/శంకుస్థాపనలు చేశారు. పలు ప్రాంతాల్లో స్థానికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కూలీలను చూసి వాహనం ఆపి వారితో మాట్లాడారు. బహదూర్‌పురా వంతెన వద్ద ఆస్తులు కోల్పోయిన పలువురు బాధితులు ఇంకా పరిహారం అందలేదని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం సర్దార్‌మహల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడారు.


ఎన్నికలు లేకపోయినా..

ప్రస్తుతం ఏ ఎన్నికలు లేకపోయినా హైదరాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో ఒకే రోజు రూ.495 కోట్లతో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేసుకున్నామని కేటీఆర్‌ చెప్పారు. ప్రపంచ వారసత్వ దినోత్సవం మరుసటి రోజే నగరంలో సర్దార్‌మహల్‌, ముర్గిచౌక్‌, మీరాలం మండి వంటిచారిత్రక కట్టడాల పునరుద్ధరణ, ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేయడం సంతోషకరమన్నారు. సర్దార్‌మహల్‌ను మ్యూజియం, 12 గదుల హోటల్‌, సాంస్కృతిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. బహదూర్‌పురా వంతెన అందుబాటులోకి వచ్చిందని, జూపార్కు నుంచి అరాంఘర్‌ మీదుగా నిర్మిస్తోన్న ఎక్స్‌ప్రెస్‌ వే ఏడాదిలో పూర్తి చేసి పాతబస్తీ వాసులకు కానుకగా ఇస్తామన్నారు. జీఓ-58, 59లో లక్ష మందికి పట్టాలిచ్చామని, పాతబస్తీ, ఇతర ప్రాంతాల్లో నోటరీ ఆస్తులున్న పేదలకు యాజమాన్యపు హక్కు కల్పించే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని, త్వరలో సీఎంతో మాట్లాడి పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు.


ఉస్మానియా ఆస్పత్రి అభివృద్ధిపై శాసనసభలో సీఎం కేసీఆర్‌ ఆరోగ్య శాఖ మంత్రికి స్పష్టమైన ఆదేశాలిచ్చారని చెప్పారు. బహదూర్‌పురా వంతెనకు జామై నిజామియా వ్యవస్థాపకుడి పేరు పెట్టాలన్న ఎంపీ అసదుద్దీన్‌ విజ్ఞప్తిపై తగిన చర్యలు తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు సూచించారు. హోంమంత్రి మహమూద్‌ అలీ మాట్లాడుతూ.. ఓల్డ్‌ సిటీ కాదు.. ఇది గోల్డ్‌ సిటీ అన్నారు. ఎంపీ అసదుద్దీన్‌ మాట్లాడుతూ.. చారిత్రక కట్టడాల పరిరక్షణ పేరిట కొందరు వ్యక్తం చేస్తోన్న అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా.. ఉస్మానియా ఆస్పత్రి స్థ్థలంలో కొత్త నిర్మాణం చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు ప్రభాకర్‌రావు, సురభి వాణిదేవి, రియాజుద్దీన్‌ హసన్‌, ఎమ్మెల్యేలు ముంతాజ్‌ అహ్మద్‌ఖాన్‌, మోజంఖాన్‌, కౌసర్‌ మొహినుద్దీన్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకే్‌షకుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-04-20T16:39:58+05:30 IST