గెలిచి తీరాల్సిందే..!

ABN , First Publish Date - 2021-02-25T04:56:57+05:30 IST

హైదరాబాద్‌ - రంగారెడ్డి - మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల నియోజకవర్గం

గెలిచి తీరాల్సిందే..!
సమావేశంలో మాట్లాడుతున్న కేటీఆర్‌

  • ప్రతి ఓటరునూ కలవాలి 
  • అభివృద్ధిని వివరించండి 
  • బీజేపీ, కాంగ్రెస్‌ నేతల విమర్శలు తిప్పికొట్టండి 
  • ఎమ్మెల్సీ ఎన్నికపై కేటీఆర్‌ దిశానిర్దేశం


వికారాబాద్‌, ఆంధ్రజ్యోతి : హైదరాబాద్‌ - రంగారెడ్డి - మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికలో టీఆర్‌ఎస్‌ తన సత్తా చాటేందుకు సన్నద్ధమవుతోంది. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా బరిలోకి దిగిన వాణీదేవిని గెలిపించుకునేందుకు ఏ విధంగా ముందుకు సాగాలనే విషయమై టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మంత్రులు, జడ్పీ చైర్‌పర్సన్లు, ఎమ్మెల్యేలు, డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్లు, పార్టీ ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేశారు. బుధవారం టీఆర్‌ఎస్‌ భవన్‌లో హైదరాబాద్‌, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు చెందిన మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్లు సునీతారెడ్డి, అనితారెడ్డి, శరత్‌ చంద్రారెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎంఎల్‌సీలు డాక్టర్‌ పి.మహేందర్‌రెడ్డి, శంభీపూర్‌రాజు, మూసీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, డాక్టర్‌ మెతుకు ఆనంద్‌, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ప్రకా్‌షగౌడ్‌, సుభా్‌షరెడ్డి, వివేకానంద, డీసీసీబీ చైర్మన్‌ మనోహర్‌రెడ్డి, డీసీఎంఎస్‌ చైర్మన్‌ కృష్ణారెడ్డి, టీఆర్‌ఎస్‌ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శుభప్రద్‌ పటేల్‌ తదితరులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ అభ్యర్థి వాణిదేవిని వారికి పరిచయం చేశారు. పార్టీ అభ్యర్థి వాణీదేవిని ఎంఎల్‌సీగా గెలిపించుకునేందుకు విస్తృతంగా ప్రచారం చేయాలని, ప్రతి ఓటరును వ్యక్తిగతంగా కలిసి పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని అభ్యర్థించాలని ఆయన సూచించారు. ఎంఎల్‌సీ అభ్యర్థి వాణీదేవి ప్రతి నియోజకవర్గంలో పర్యటించి ప్రచారం నిర్వహిస్తారన్న కేటీఆర్‌... ఈ మేరకు రూట్‌మ్యాప్‌ తయారు చేస్తున్నామని తెలిపారు. ర్యాలీలతో హంగామా చేస్తూ షోపుట్‌పగా కాకుండా ఒక్కో ఓటరును కలవాలని ఆయన సూచించారు. ఈ ఎన్నికల్లో మీరే పోటీ చేస్తున్నట్లుగా భావించి విస్తృతంగా ప్రచారం చేయాలి... పార్టీ ఉం టేనే మీరు ఉంటారు... కష్టపడి పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలను ఎప్పటికప్పుడు విమర్శలతో ఎండగట్టాలని, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గత ఆరేళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఓటర్లకు వివరించాలని ఆయన మార్గదర్శనం చేశారు. ఈ ఆరేళ్లలో కొత్తగా ఎన్నో ఉద్యోగాలు ఇచ్చామని, ఉద్యోగులకు మంచి వేతనాలు ఇస్తున్నామనే విషయం కూడా తెలియజేయాలని ఆయన సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికను పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయాన్ని మరిచిపోవద్దని.. మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ప్రతిఒక్కరూ కష్టపడి వాణీదేవిని అత్యధిక మెజార్టీతో గెలిపించే బాధ్యత తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ ఎమ్మెల్యేలకు పట్టభద్రుల ఓటర్ల జాబితాలు అందజేశారు. 



Updated Date - 2021-02-25T04:56:57+05:30 IST