సఫ్రాన్‌ పెట్టుబడులపై కేటీఆర్‌ హర్షం

ABN , First Publish Date - 2022-07-07T09:54:26+05:30 IST

ఫ్రాన్స్‌కు చెందిన సఫ్రాన్‌ సంస్థ హైదరాబాద్‌లో రూ.1,200 కోట్లతో విమాన ఇంజన్ల మెయింటెనెన్స్‌, రిపేర్‌, ఓవర్‌ హాల్‌ (ఎంఆర్‌వో) కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించడంపై రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు.

సఫ్రాన్‌ పెట్టుబడులపై కేటీఆర్‌ హర్షం

హైదరాబాద్‌, జూలై 6 (ఆంధ్రజ్యోతి): ఫ్రాన్స్‌కు చెందిన సఫ్రాన్‌ సంస్థ హైదరాబాద్‌లో రూ.1,200 కోట్లతో విమాన ఇంజన్ల మెయింటెనెన్స్‌, రిపేర్‌, ఓవర్‌ హాల్‌ (ఎంఆర్‌వో) కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించడంపై రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. భారత్‌లో తన తొలి ఎంఆర్‌వో కేంద్రం ఏర్పాటుకు హైదరాబాద్‌ను ఎంచుకోవాలన్న సఫ్రాన్‌ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ఈ మేరకు కేటీఆర్‌ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. సఫ్రాన్‌కు చెందిన అతిపెద్ద నిర్వహణ కేంద్రం ఇదే అవుతుందని, మనదేశంలో ఒక విదేశీ సంస్థ పెడుతున్న తొలి విమాన ఇంజన్ల నిర్వహణ కేంద్రం కూడా ఇదేన న్నారు. పౌర, సైనిక విమానాల కోసం అధునాతన ఇంజన్లు ఉత్పత్తి చేసే అగ్రశ్రేణి కంపెనీల్లో ఒకటైన సఫ్రాన్‌ ఏర్పాటు చేసే ఎంఆర్‌వోతో దాదాపు వెయ్యి మందికి ఉద్యోగాలు లభించనున్నాయని తెలిపారు. భారత్‌తోపాటు విదేశీ వాణిజ్య విమానయాన సంస్థల విమానాల్లో వాడే లీప్‌-1ఏ, లీప్‌-1బీ ఇంజన్ల నిర్వహణను హైదరాబాద్‌లోనే చేస్తారని, ఇంతవరకు ఈ సౌకర్యం విదేశాల్లోనే అందుబాటులో ఉందన్నారు. సఫ్రాన్‌ ఎంఆర్‌ఓ కేంద్రం ఏర్పాటుతో తెలంగాణలోని ఏవియేషన్‌ పరిశ్రమకు మరింత ఊతం లభిస్తుందని కేటీఆర్‌ తెలిపారు. 

Updated Date - 2022-07-07T09:54:26+05:30 IST