బండి సంజయ్‌ది నిరుద్యోగ దీక్ష కాదు..సిగ్గులేని దీక్ష: కేటీఆర్‌

ABN , First Publish Date - 2021-12-26T16:37:56+05:30 IST

బండి సంజయ్‌పై టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ ఘాటు విమర్శలు చేశారు.

బండి సంజయ్‌ది నిరుద్యోగ దీక్ష కాదు..సిగ్గులేని దీక్ష: కేటీఆర్‌

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ ఘాటు విమర్శలు చేశారు. బండి సంజయ్‌ది నిరుద్యోగ దీక్ష కాదని.. సిగ్గులేని దీక్షని అన్నారు. ఆయన తలపెట్టిన దీక్ష పచ్చి అవకాశవాదమేనని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం దేశంలో నిరుద్యోగ యువతకు ఏం చేసిందో ముందు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలిచ్చారో లెక్క చెప్పే దమ్ముందా? అని నిలదీశారు.


కేంద్రం వల్ల తెలంగాణ యువతకు ఎన్ని ఉద్యోగాలు వచ్చాయో చెప్పాలని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ఐటీఐఆర్ ప్రాజెక్ట్‌ను రద్దు చేసింది కేంద్రం కాదా? అని నిలదీశారు. లక్షలాది ఐటీ ఉద్యోగాలకు గండి కొట్టి.. యువత నోట్లో మట్టికొట్టి... మళ్లీ సిగ్గు లేకుండా నిరుద్యోగ దీక్షలకు దిగుతారా? అంటూ తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. బీజేపీ దొంగ దీక్షలను, కపట ప్రేమను చూసి అవకాశవాదమే సిగ్గుపడుతుందన్నారు. కరోనా సంక్షోభంలో రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ అంటూ.. తెలంగాణ రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా సాయం చేయలేదని మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజంగా బండి సంజయ్‌కు చిత్తశుద్ధి  ఉంటే దీక్ష చేయాల్సింది ఇక్కడ కాదని, ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర చేయాలన్నారు. హామీలపై కేంద్రాన్ని ప్రశ్నించలేని, చేతకానితనంపై బండి సంజయ్ ఇందిరాపార్కు సాక్షిగా ముక్కునేలకు రాసి ప్రజలకు  వివరణ ఇవ్వాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు.

Updated Date - 2021-12-26T16:37:56+05:30 IST