అభివృద్ధికి అడ్డంకులు సృష్టించొద్దు.. కేంద్రంది రాజకీయ దురుద్దేశం : KTR

ABN , First Publish Date - 2022-02-13T14:57:08+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత లేకపోయినా కంటోన్మెంట్‌ అభివృద్ధికి చేయాల్సినదానికంటే ....

అభివృద్ధికి అడ్డంకులు సృష్టించొద్దు.. కేంద్రంది రాజకీయ దురుద్దేశం : KTR

హైదరాబాద్ సిటీ/సికింద్రాబాద్‌ : రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత లేకపోయినా కంటోన్మెంట్‌ అభివృద్ధికి చేయాల్సినదానికంటే ఎక్కువగా కృషి చేస్తోందని మున్సిపల్‌శాఖ మంత్రి కె. తారకరామారావు అన్నా రు. కేంద్ర ప్రభుత్వం రాజకీయ దురుద్దేశాలతో సహకరించడం లేదని ఆయన ఆరోపించారు. రూ.61కోట్ల అంచనా వ్యయంతో సనత్‌నగర్‌, కంటోన్మెంట్‌, కూకట్‌పల్లి నియోజకవర్గాల పరిధిలో చేపట్టనున్న నాలాల అభివృద్ధి, మల్టీపర్పస్‌ ఫంక్షన్‌హాల్‌ నిర్మాణ పనులకు మంత్రులు తలసాని శ్రీనివా్‌సయాదవ్‌, చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు జి.సాయన్న, మాధవరం కృష్ణారావులతో కలిసి మంత్రి శనివారం శంకుస్థాపన చేశారు. 


ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ప్యాట్నీ కంపౌండ్‌ నాలా రీ మోడలింగ్‌ పనులను చేపట్టామని, కంటోన్మెంట్‌లో కూడా 20వేల లీటర్ల ఉచిత నీటి సరఫరాకు ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. కొత్త రోడ్లు వేయాలని, నాలాలు నిర్మించాలని, పేదలకు పట్టాలు ఇవ్వాలని చూస్తున్నట్టు చెప్పారు. అయితే కేంద్రం కంటోన్మెంట్‌లోని రోడ్లను మూసివేయాలని చూస్తోందని, పేదలకు పట్టాలు ఇవ్వకుండా అడ్డుపడుతోందని, రోడ్ల విస్తరణకు, స్కైవేల నిర్మాణానికి స్థలం ఇవ్వకుండా ప్రజలకు అసౌకర్యం కలిగిస్తోందని ఆరోపించారు. డిఫెన్స్‌ భూములకు ప్రత్యామ్నాయ స్థలాలు ఇస్తామన్నా కేంద్ర ప్రభుత్వం అంగీకరించడం లేదని అన్నారు. ఇప్పటికే వందల సార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేశామని, చేయగలిగితే రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని, అభివృద్ధిలో అడ్డంకులు సృష్టించవద్దని ఆయన కోరారు. 


ఆర్‌ఓబీ, ఆర్‌యూబీల నిర్మాణానికి సహకరించండి

గ్రేటర్‌లో రైల్వే క్రాసింగ్‌ల వద్ద నిర్మించనున్న ఆర్‌ఓబీ, ఆర్‌యూబీల నిర్మాణాలకు సహకరించాలని, ప్రతిపాదనలకు త్వరగా అనుమతులివ్వాల ని దక్షిణ మధ్య రైల్వే శాఖను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ కోరారు. రైల్వే, పురపాలక శాఖ, జీహెచ్‌ఎంసీ, రెవెన్యూశాఖ ఉన్నతాధికారులతో మంత్రి శనివారం సమీ క్షా సమావేశం నిర్వహించారు. దశాబ్దాల క్రితం నిర్మించిన రాంగోపాల్‌పేట అండర్‌ బ్రిడ్జిని యుద్ధప్రాతిపదికన విస్తరించాల్సిన అవసరముందన్నారు. మంత్రి సూచనపై దక్షిణ మధ్య రైల్వే అధికారులు సానుకూలంగా స్పందించారు. సంపూర్ణంగా సహకరిస్తామని పేర్కొన్నారు. తుది అనుమతులు రాగానే సనత్‌నగర్‌- బాలానగర్‌ అండర్‌ పాస్‌ నిర్మాణం వేగంగా పూర్తి చేస్తామని రైల్వే అధికారులు పేర్కొన్నారు.


నగరంలో వరద ప్రవాహ వ్యవస్థ మెరుగుదలకు రూ.858 కోట్లతో ఎస్‌ఎన్‌డీపీలో భాగంగా దశల వారీగా నాలాల విస్తరణ, పునరుద్ధరణ  పనులు చేపడుతున్నట్టు కేటీఆర్‌ తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో మేయర్‌ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ శ్రీలతారెడ్డి, కంటోన్మెంట్‌ సీఈవో అజిత్‌రెడ్డి, రాష్ట్ర బేవరేజ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ గజ్జల నాగేష్‌, టీఆర్‌ఎస్‌ మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం ఇన్‌చార్జి మర్రి రాజశేఖరరెడ్డి, కంటోన్మెంట్‌ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జక్కుల మహేశ్వర్‌రెడ్డి, బోయినపల్లి మార్కెట్‌ మాజీ చైర్మన్లు టి.ఎన్‌.శ్రీనివాస్‌, ముప్పిడి గోపాల్‌, బోర్డు మాజీ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2022-02-13T14:57:08+05:30 IST