ప్రాజెక్టులు, బుల్లెట్‌ ట్రైన్‌ గుజరాత్‌, ముంబైకేనా?

ABN , First Publish Date - 2021-01-24T08:16:21+05:30 IST

‘‘వ్యాపార, వాణిజ్య, నైపుణ్య రంగాలు సహా అన్ని రంగాల్లోనూ.. సంక్షేమ పథకాల అమలులోనూ తెలంగాణ రాష్ట్రం మొదటి మూడు స్థానాల్లో ఉంటుంది.. కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చే బుల్లెట్‌

ప్రాజెక్టులు, బుల్లెట్‌ ట్రైన్‌ గుజరాత్‌, ముంబైకేనా?

ఆత్మనిర్భర్‌ భారత్‌తో ఎవరికి ఉపయోగం జరిగింది? 

దక్షిణాది రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం చిన్నచూపు 

80 సీట్లు ఉంటే రాజ్యమేలేందుకు సిద్ధమవుతున్నారు 

ఫ్యాప్సీలో ఎక్స్‌లెన్స్‌ అవార్డుల ప్రదానోత్సవంలో కేటీఆర్‌


హైదరాబాద్‌ సిటీ/ మంగళ్‌హాట్‌, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): ‘‘వ్యాపార, వాణిజ్య, నైపుణ్య రంగాలు సహా అన్ని రంగాల్లోనూ.. సంక్షేమ పథకాల అమలులోనూ తెలంగాణ రాష్ట్రం మొదటి మూడు స్థానాల్లో ఉంటుంది.. కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చే బుల్లెట్‌ ట్రైన్‌, హై స్పీడ్‌ ప్రాజెక్టులన్నీ గుజరాత్‌, ఢిల్లీ, ముంబై ప్రాంతాలకే పరిమితమవుతాయి. ఆత్మనిర్భర్‌ వల్ల ఎవరికి లబ్ధి చేకూరిందో తెలీదు. రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీ ఏమైందో తెలియదు.’’ అని రాష్ట్ర పరిశ్రమలు, మునిసిపల్‌, పట్టణాభివృద్ది శాఖ మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాల పట్ల కేంద్రం చిన్నచూపు చూస్తోందని, కేంద్రం పథకాలు దక్షిణాదికి రావడం లేదని విమర్శించారు.


ప్రధాని మోదీ చెబుతున్న ‘సబ్‌కా సాత్‌... సబ్‌కా వికాస్‌’ ఎక్కడుంది? ప్రశ్నించారు. హైదరాబాద్‌ నుంచి నాగ్‌పూర్‌, హైదరాబాద్‌ నుంచి రామగుండం, వరంగల్‌, బెంగళూర్‌ రూట్‌లలో పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ది ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలంగాణ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (ఎఫ్‌టీసీసీఐ) ఆధ్వర్యంలో రెడ్‌హిల్స్‌లోని ఫ్యాఫ్సీ భవన్‌లో నిర్వహించిన ఎఫ్‌టీసీసీఐ ఎక్సలెన్సీ అవార్డుల ప్రదానోత్సవానికి ముఖ్య అతిథిగా మంత్రి కేటీఆర్‌, గౌరవ అతిథిగా ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్‌ రంజన్‌లు హాజరయ్యారు. 


ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడారు. ‘‘ఆత్మ నిర్భర్‌ భారత్‌ వల్ల ఎవరికి లబ్ధి చేకూరిందో నాకైతే తెలియదు. మాటలు చెప్పారు కానీ ఏమీ చేయలేదు. ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దాలని, రాష్ట్రానికి ప్రాజెక్టులు, పరిశ్రమలను కేటాయించాలని ఎన్నోసార్లు కేంద్రానికి లేఖలు రాశాం.. రాస్తూనే ఉన్నాం’’ అని వ్యాఖ్యానించారు. 80 సీట్లు ఉంటే రాజ్యమేలుదామని అనుకుంటున్నారన్న కేటీఆర్‌, 17 సీట్లు ఉన్నాయి కాబట్టి సరిపోయింది అని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా వేదికమీద ఉన్న ఎఫ్‌టీసీసీఐ మాజీ అద్యక్షుడు రవీంద్రమోదీని ఉద్దేశించి ‘మీ అన్నయ్య మోదీకి చెప్పండి’ అంటూ చలోక్తి విసరడంతో సభలో నవ్వులు విరిశాయి.


అభివృద్ధిలో ముందుంటున్న రాష్ట్రాలను పోత్సాహించాలని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మాలా సీతారామన్‌ను కేటీఆర్‌ కోరారు. కాగా పారిశ్రామిక ప్రోత్సాహకాలను ఇవ్వాల్సి ఉందని, గత మార్చిలో ఇందుకోసం రూ. 1500 కోట్లను బడ్జెట్‌లో కేటాయించామని, లాక్‌డౌన్‌తో పాటు పలు ఆర్థిక సమస్యల కారణంగా ఇవ్వలేదన్నారు. వచ్చే వార్షిక సంవత్సరంలో ఇన్‌పుట్‌ సబ్సిడీలు విడుదల చేస్తామన్నారు. అనంతరం మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా ఎక్సిలెన్స్‌ ఇన్‌ ఇండస్ట్రీయల్‌ ప్రొడక్షన్‌లో మిశ్రమ ధాతు నిగం లిమిటేడ్‌తో పాటు మరో 18 కంపెనీలకు ఎక్సలెన్సీ అవార్డులను అందజేశారు. అవార్డు కమిటీ సభ్యులకు మెమోంటోలతో సత్కరించారు. 

Updated Date - 2021-01-24T08:16:21+05:30 IST