పోడు భూముల సమస్యను పరిష్కరించాం

ABN , First Publish Date - 2020-07-08T10:30:19+05:30 IST

దశాబ్దాల తరబడి అపరిష్కృతంగా ఉన్న పోడు భూముల సమస్యకు పరిష్కారం చూపామని పురపాలక, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు ..

పోడు భూముల సమస్యను పరిష్కరించాం

రంగంపేటలో 281 ఎకరాల భూమిపై హక్కులు

 అడవులను నరికితే గాలి కొనుక్కోవాల్సిందే

పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు

వీర్నపల్లిలో గిరిజనుల పోడు భూములకు పట్టాల పంపిణీ


(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల): దశాబ్దాల తరబడి అపరిష్కృతంగా ఉన్న  పోడు భూముల సమస్యకు పరిష్కారం చూపామని పురపాలక, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం రంగంపేటలో గిరిజనులు సాగు చేస్తున్న 281 ఎకరాల పోడుభూములకు పట్టాలు పంపిణీ చేశారు. కంచర్లలో 33/11 సబ్‌స్టేషన్‌కు శంకుస్థాపన చేశారు. గర్జనపల్లిలో రైతువేధిక భవనానికి భూమిపూజ నిర్వహించారు. మద్దిమల్ల గుగులోతు తండావద్ద వీర్నపల్లి బ్రిడ్జి, మద్దిమల్ల సోమారంపేట రోడ్డులో బ్రిడ్జి, వన్‌పల్లి నుంచి చీమన్‌పల్లి రోడ్డులో బ్రిడ్జి, వన్‌పల్లి నుంచి శాంతినగర్‌ బ్రిడ్జిని ప్రారంభించారు.  హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా  మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ  పరిపాలన సౌలభ్యంకోసం చిన్న జిల్లాలు, రెవెన్యూ డివిజన్‌లు, పంచాయతీలు ఏర్పాటు చేసుకున్నామన్నారు.


అందులో భాగంగా ఏర్పాటు చేసుకున్న వీర్నపల్లి మండలాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానన్నారు. ఇక్కడికి వస్తుంటే కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా మలక్‌పేట, సింగసముద్రం నుంచి వెళ్తున్న కాలువలు కనిపిస్తున్నాయని, పైప్‌లైన్‌లు చూస్తుంటే సంతోషంగా ఉందని అన్నారు. వీర్నపల్లి మండలంలోని ప్రతీ ఎకరాకు సాగునీరందిస్తామన్నారు.  ఫ్రీఫైబర్‌ కేబుల్‌ వేస్తున్నారని, ఇంటింటికీ  ఇంటర్నెట్‌  రాబోతోందని అన్నారు. కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతల పథకాలతో ప్రతీ నీటి బొట్టును సద్వినియోగం చేసుకుంటున్నామన్నారు. వీర్నపల్లి మండలంలో ఒకప్పుడు కారు వెళ్లే పరిస్థితి లేదని, గతంలో తాను ద్విచక్రవాహనంపై వెళ్లి చెరువులు పరిశీలించానని గుర్తు చేశారు. ఇప్పుడు బ్రహ్మాండమైన రోడ్లు వచ్చాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంకల్పంతో  3,400 తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేశారన్నారు.  వీర్నపల్లిలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, ఇతర సమస్యలను పరిష్కరిస్తానన్నారు.


 బ్రహ్మాంగారు తన కాలజ్ఞానంలో తాగునీళ్లు కొనుక్కుంటారంటే అందరు నవ్వారని, ఇప్పుడు అది వాస్తవ రూపం దాల్చిందని అన్నారు. అడవులను ఇష్టారీతిగా నరికితే గాలిని కూడా కొనుగోలు చేసే పరిస్థితి వస్తుందన్నారు. హరితహారంలో విరివిగా మొక్కలు నాటాలని అన్నారు.  అధికారులు, ఎంతో కసరత్తు చేసి దశాబ్దాల తరబడి అపరిష్కృతంగా ఉన్న రంగంపేట అటవీ భూ సమస్యలను పరిష్కరించారని, 307 మందికి 281 ఎకరాల భూమిపై యజమాన్యల హక్కులను కల్పించారని అన్నారు. 


కరోనా సమయంలోనూ పట్టాలను అందించేంది గిరిజనుల్లో చిరునవ్వులు చూడడానికేనని, అందుకోసమే వచ్చానని అన్నారు.  రైతును రాజును చేయడమే ముఖ్యమంత్రి కేసీఆర్‌ లక్ష్యమన్నారు. వ్యవసాయాన్ని పండుగగా మార్చేందుకు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో 24 గంటల ఉచిత కరెంట్‌ ఇస్తున్నామన్నారు.  అంతేకాంకుండా రైతుబంధుతోపాటు  రైతు చనిపోతే బాధిత కుటుంబం వీధిన పడవద్దని రూ.5 లక్షల బీమా అందిస్తున్నట్లు తెలిపారు.  గిరిజనులే పాలన చేసుకునే విధంగా 500 జనాభా ఉన్న ప్రతీ తండాను ముఖ్యమంత్రి గ్రామ పంచాయతీగా మార్చారన్నారు. 3,400 తండాలు పంచాయతీలుగా మారాయని, గిరిజనులే సర్పంచులు, వార్డుమెంబర్లుగా ఉన్నారని తెలిపారు. జిల్లాలు 10 నుంచి 30కి, రెవెన్యూ డివిజన్లు 30 నుంచి 73కు పెరగడంతోపాటు  మండలాలు, గ్రామ పంచాయతీలూ పెరిగాయన్నారు.


కరోనా సంక్షోభంలోనూ సంక్షేమం మరువకుండా రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమ చేసినట్లు చెప్పారు. వ్యవసాయ రంగంలోనూ కొత్త పుంతలు తొక్కుతూ అక్కరకు రాని పంటలు కాకుండా లాభదాయకమైన పంటలను సాగు చేస్తున్నారన్నారు. ప్రస్తుతం  ఎలాంటి ఎన్నికలూ లేవని, రాజకీయ లాభాపేక్ష లేకుండా భవిష్యత్‌ తరాలు బాగుండాలన్న ఆలోచనలతో ముఖ్యమంత్రి ప్రణాళికలు రూపొందిస్తున్నారన్నారు.   సంక్షేమం, అభివృద్ధికే ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందన్నారు. గ్రామీణ రహదారులు, వంతెనల విషయంలో గణనీయమైన పురోగతి సాధించామన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు, జిల్లా కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌, ఆర్డీవో శ్రీనివాసరావు, వీర్నపల్లి జడ్పీటీసీ గుగులోతు కళావతి, ఎంపీపీ మాలోతు బూల, మాజీ జడ్పీటీసీ ఆగయ్య, రంగంపేట సర్పంచ్‌ నందగిరి లింగం, ఎంపీటీసి రేణుక, ఎర్రగడ్డ సర్పంచ్‌జగ్‌మాల్‌, గర్జనపల్లి సర్పంచ్‌కరుణ, వన్‌పల్లి సర్పంచ్‌ లత, శాంతినగర్‌ సర్పంచ్‌ మల్లేశం, ఎంపీటీసీలు బానోతు తేజ పద్మ, కంచర్ల సర్పంచ్‌ రజిత, ఎంసీటీసీ అరుణ్‌కుమార్‌, మద్దిమల్ల సర్పంచ్‌ జవహర్‌లాల్‌, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-08T10:30:19+05:30 IST