కేఆర్‌ఎంబీ దూకుడు

ABN , First Publish Date - 2022-05-25T09:28:52+05:30 IST

శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుల్లో జలవిద్యుత్తు, రూల్‌కర్వ్‌, మిగులు జలాల అంశాన్ని తేల్చడానికి వేసిన రిజర్వాయర్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ(ఆర్‌ఎంసీ) సమావేశాలు జూన్‌ 15 తర్వాతే నిర్వహించాలన్న తెలంగాణ విజ్ఞప్తిని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) మళ్లీ గట్టున పెట్టింది.

కేఆర్‌ఎంబీ దూకుడు

  • జూన్‌ 15 తర్వాతే సమావేశం అంటున్న తెలంగాణ
  • ఈ నెల 30 లేదా 31న నిర్వహిస్తామని బోర్డు లేఖ

హైదరాబాద్‌, మే 24(ఆంధ్రజ్యోతి): శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుల్లో జలవిద్యుత్తు, రూల్‌కర్వ్‌, మిగులు జలాల అంశాన్ని తేల్చడానికి వేసిన రిజర్వాయర్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ(ఆర్‌ఎంసీ) సమావేశాలు జూన్‌ 15 తర్వాతే నిర్వహించాలన్న తెలంగాణ విజ్ఞప్తిని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) మళ్లీ గట్టున పెట్టింది. తెలంగాణ గైర్హాజరైనా, సమావేశాన్ని వాయిదా వేయాలని కోరినా కేఆర్‌ఎంబీ ఈ నెల 20నే సమావేశం నిర్వహించింది. తాజాగా ఈ నెల 30 లేదా 31న సమావేశం నిర్వహించనున్నట్లు తెలుగు రాష్ట్రాలకు లేఖ రాసింది. వానాకాలం సీజన్‌ సన్నద్ధత పనుల్లో బిజీగా ఉన్నందున సమావేశాన్ని వాయిదా వేయాలని తెలంగాణ ఈఎన్‌సీ సి.మురళీధర్‌రావు ఈ నెల 19న బోర్డుకు లేఖ రాశారు. కేఆర్‌ఎంబీ.. జలవిద్యుత్తు ఉత్పాదనపై 15 రోజుల్లో, రూల్‌కర్వ్‌, మిగులు జలాలపై నెల రోజుల్లోగా నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. జలవిద్యుత్తుపై నిర్ధేశించుకున్న గడువు కూడా జూన్‌ 5కల్లా ముగియనుంది. దాంతో తెలంగాణ హాజరుతో సంబంధం లేకుండా జలవిద్యుత్తుపై నివేదికను సిద్ధం చేసే యోచనలో ఆర్‌ఎంసీ ఉన్నట్లు తెలుస్తోంది. 

 

కేజీబీవో దాటిన ‘మొడికుంట’ డీపీఆర్‌

గోదావరి బేసిన్‌లో నిర్మించ తలపెట్టిన మొడికుంట వాగు ప్రాజెక్టు అనుమతి కోసం కృష్ణా, గోదావరి బేసిన్‌ ఆర్గనైజేషన్‌(కేజీబీవో)లో తెలంగాణ సమర్పించిన డీపీఆర్‌(సమగ్ర ప్రాజెక్టు నివేదిక) ఢిల్లీకి చేరింది. 13,590 ఎకరాలకు నీరందించేలా 2.14 టీఎంసీలతో మొడికుంట వాగు ప్రాజెక్టును రూ.700 కోట్లతో ప్రతిపాదించిన విషయం విదితమే. ఈ ప్రాజెక్టును అనుమతిలేని జాబితాలో కేంద్రం చేర్చడంతో రాష్ట్ర ప్రభుత్వం గతేడాది సెప్టెంబరులోనే దీన్ని కేజీబీవోలో సమర్పించింది. సుదీర్ఘ పరిశీలనల తర్వాత కేజీబీవో ఈ డీపీఆర్‌ను క్లియర్‌ చేసింది. సీడబ్ల్యూసీలో పరిశీలన తర్వాత ఇది గోదావరి నదీ యాజమాన్య బోర్డు(జీఆర్‌ఎంబీ) సాంకేతిక అనుమతి/పరిశీలనకు రానుంది. 


కృష్ణా ప్రాజెక్టులకు స్వల్పంగా వరద

కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులకు స్వల్పంగా వరద వచ్చి చేరుతోంది. తుంగభద్ర జలాశయానికి మంగళవారం 25,901 క్యూసెక్కుల వరద వచ్చింది. 100 టీఎంసీల సామర్థ్యం కలిగిన ప్రాజెక్టులో 33.37 టీఎంసీల నీరు ఉంది. కర్ణాటకలోని నారాయణపూర్‌ ప్రాజెక్టుకు 4,956 క్యూసెక్కులు, జూరాలకు 3,523 క్యూసెక్కులు, సుంకేసులకు 4,500 క్యూసెక్కులు, శ్రీశైలానికి 4,675 క్యూసెక్కులు, సాగర్‌కు 2,848 క్యూసెక్కులు, పులిచింతలకు 400 క్యూసెక్కుల వరద వచ్చింది. 

Updated Date - 2022-05-25T09:28:52+05:30 IST