కష్టపడితేనే క్రియా సిద్ధి

ABN , First Publish Date - 2020-08-10T09:06:52+05:30 IST

సిద్ధపురంలో త్రికాలవేది అనే మహర్షి ఉండేవాడు. కృషిహితుడు, దేవహితుడు, జ్ఞానహితుడు అని ఆయనకు ముగ్గురు శిష్యులు. విద్యాభ్యాసం పూర్తయ్యాక ముగ్గురూ ఇళ్లకు వెళ్లబోతూ..

కష్టపడితేనే క్రియా సిద్ధి

సిద్ధపురంలో త్రికాలవేది అనే మహర్షి ఉండేవాడు. కృషిహితుడు, దేవహితుడు, జ్ఞానహితుడు అని ఆయనకు ముగ్గురు శిష్యులు. విద్యాభ్యాసం పూర్తయ్యాక ముగ్గురూ ఇళ్లకు వెళ్లబోతూ.. ‘గురువర్యా, దేవుడు త్వరగా ప్రత్యక్షమై, మా కోరికలను నెరవేర్చే మంత్రాన్ని ఉపదేశించండి’ అని అడిగారు. గురువు నవ్వి, వారికి ఒక మంత్రాన్ని ఉపదేశించాడు. ‘‘ఇక్కడి నుండి ఐదు యోజనాల దూరంలో ఉన్న అడవిలోని శిథిల సిద్ధాయతనంలో ఈ మంత్రాన్ని ఒక రోజంతా పఠిస్తూ శివార్చన చేయండి. మీకు శివానుగ్రహం లభిస్తుంది’’ అని చెప్పాడు త్రికాలవేది. వారు ఆయన చెప్పిన విధంగా చేసి.. శివుని దర్శనం కాగానే తమకు ఏం కావాలో కోరుకున్నారు. కృషిహితునికి కళాత్మకంగా పని చేయడం ఇష్టం. అందుకని తాను ఏం చేసినా దాన్ని ప్రజలు మెచ్చి, అడిగినంత సొమ్ము ఇచ్చి, ఆ వస్తువులను కొనుక్కోవాలని కోరాడు. దేవహితునికి పాడటం అంటే ఇష్టం.


కాబట్టి, తాను ఎలా పాడినా ప్రజలు మెచ్చి, తనకు భూరి సన్మానాలు చేయాలని వేడుకున్నాడు. జ్ఞానహితునికి కేవలం మాటలు చెప్పి ధనం సంపాదించాలని కోరిక. కాబట్టి శివుణ్ని అదే కోరుకున్నాడు. అందుకు శివుడు.. ‘‘అలాగే! మీరు కోరిన విధంగానే జరుగుతుంది. అయితే అందుకు మీరు రోజూ నేను చెప్పినట్లు కొంతసేపు చేయాలి. అలా చేసినంత కాలం మీ కోరికలు తీరుతాయి. ఏ రోజు నేను చెప్పినట్లు చెయ్యరో ఆ రోజు మీకు లబ్ధి ఉండదు. మళ్లీ మర్నాడు నే చెప్పినట్టు చేస్తే మీ కోరికలు నెరవేరుతాయి’’ అని చెప్పాడు. వారు అందుకు సరేనని బయటకు రాగానే.. ఒక సాధువు కనిపించి ‘‘మీరు త్రికాలవేది శిష్యులా?’’ అని అడిగాడు. శివ వరప్రసాద గర్వంతో ఉన్న ముగ్గురు శిష్యులూ ఆ సాధువుని ఎగాదిగా చూసి అవునని చెప్పారు. వారి వాలకాన్ని చూసిన ఆ సాధువు.. నర్మగర్భంగా నవ్వి, ‘పునర్దర్శన ప్రాప్తిరస్తు’ అని అక్కణ్నుంచీ వెళ్లిపోయాడు. శివుడు చెప్పిన ప్రకారం.. కృషిహితుడు రోజూ కొబ్బరాకులతో ఒక చిన్న బొమ్మను అల్లేవాడు. ఆ బొమ్మ ఆ రోజు కావాల్సిన కళాఖండాన్ని సిద్ధం చేస్తే.. దాన్ని అమ్మి సొమ్ము చేసుకునేవాడు. దైవహితుడు రోజూ నాలుగు గంటల పాటు శివ పంచాక్షరి జపం చేసేవాడు.


అలా చేస్తే అతనికో కొత్త రాగాన్ని ఆలపించే శక్తి వచ్చి.. ప్రజలంతా ఆ గానానికి ముగ్ధులై ఎన్నో కానుకలను ఇస్తున్నారు. ఇక జ్ఞానహితునికి శివుడు ఒక రాగి రేకు ఇచ్చాడు. అది ఖాళీగానే ఉంటుంది. కానీ, ఉదయం శివపూజ చేయగానే అందులో ఒక కొత్త విషయం గోచరిస్తుంది. దాన్ని చదివి చెప్తే ప్రజలంతా జ్ఞానహితుని మాటలకు సమ్మోహితులు అవుతున్నారు. ఇలా ముగ్గురూ త్వరలోనే ధనవంతులయ్యారు. కానీ వారికి భోగ భాగ్యాలలో తేలియాడటంలో శివుడు చెప్పిన పనులు చేయటానికి సమయం సరిపోవట్లేదు. ఆ పనులు చేస్తే ధన సంపాదనకు, దాన్ని అనుభవించడానికి సమయం సరిపోవట్లేదు. ఆరు నెలలు తిరిగేసరికి ఈ సంఘర్షణ భరించలేక గురువు వద్దకు వెళ్లిజరిగినదంతా చెప్పారు. అప్పుడు గురువు ఆ సాధువును కలుసుకోమన్నాడు. ఆ సాధువు వారి కష్టాలను విని.. ‘‘ఆ కొలనులో ముమ్మారు మునిగి వచ్చి శివుని ముందు మోకరిల్లి ‘నీ మంత్రాలను నీకే సమర్పిస్తున్నాం’ అని చెప్పి రండి’’ అన్నాడు. వాళ్లు అలా చేసి వచ్చాక.. ‘‘మీరు ఈ ఆరు నెలల కాలంలో ఈ మంత్రం వల్ల సంపాదించిన విద్యలు మీకు బతకడానికి ఉపయోగపడతాయి. కష్టపడకుండా సుఖాలు రావు. కష్టపడటమే క్రియా సిద్ధికి దగ్గర దారి అని తెలుసుకోండి’’ అని చెప్పాడు. వాళ్లు ఆ సాధువుకు నమస్కరించి కొత్త జీవితాన్ని ప్రారంభించారు. కాబట్టి.. నాటికీ నేటికీ.. ఏ కాలంలోనైనా, ఏ జీవనవిధానంలోనైనా ‘కష్టే ఫలీ’ అనేదే వాస్తవం. కష్టపడకుండా సుఖాలు రావు. వచ్చినా కలకాలం నిలవవు.


ఆచార్య రాణి సదాశివ మూర్తి 

Updated Date - 2020-08-10T09:06:52+05:30 IST