బీసీల ద్రోహి కృష్ణయ్య

ABN , First Publish Date - 2022-05-20T08:41:27+05:30 IST

వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా ఆర్‌ కృష్ణయ్యకు అవకాశం ఇవ్వడంపై రాష్ట్ర వ్యాప్తంగా పలు బీసీ సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి.

బీసీల ద్రోహి కృష్ణయ్య

వైసీపీతో జతకట్టడం సిగ్గుచేటు..

ఆంధ్ర బీసీలు దద్దమ్మలు కారు

కేసీఆర్‌తో జగన్‌ చీకటి ఒప్పందం..

సంఘాల నేతల మండిపాటు


గుంటూరు, విజయవాడ (కృష్ణలంక), భీమవరం టౌన్‌, మే 19: వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా ఆర్‌ కృష్ణయ్యకు అవకాశం ఇవ్వడంపై రాష్ట్ర వ్యాప్తంగా పలు బీసీ సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. ఆయనకు అవకాశం ఇవ్వడమంటే ఆంధ్ర బీసీలను అవమానించడమేనంటూ పలువురు నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్ణయాన్ని ఉపసంహరించుకోకుంటే వైసీపీలో బీసీలు మిగలరని తేల్చి చెప్పారు. గురువారం పలువురు నేతలు మీడియాతో మాట్లాడారు. ‘‘దశాబ్దాలుగా కృష్ణయ్య బీసీలకు రాజ్యాధికార బాట గురించి చెప్తున్నారు. నేడు దానిని వదిలి రాష్ట్రంలో వైసీపీతో జత కట్టడం సిగ్గుచేటు. ఆయనకు రాజ్యసభ స్థానం ఖరారు కావడంతో బీసీలకు రాజ్యాధికారం సాధించే లక్ష్యం నుంచి కృష్ణయ్య వైదొలిగిపోయినట్లే’’ అని ఆంధ్రప్రదేశ్‌ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు గుంటూరులో విమర్శించారు. రాజకీయాలకు అతీతం... బీసీ సంక్షేమ సంఘం అని చెప్పుకుంటూనే వివిధ రాజకీయ పార్టీలతో కృష్ణయ్య ప్రయాణాన్ని వివరించారు. బీసీలకు అసలు రాజ్యాధికారమే అవసరం లేదంటూ... బీసీల ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టారని మండిపడ్డారు. జూన్‌లో విజయవాడలో ఏపీ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విస్తృత రాజకీయ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. బీసీల ద్రోహి ఆర్‌.కృష్ణయ్యకు ఆంధ్రలో రాజ్యసభ సీటును సీఎం జగన్‌రెడ్డి ప్రకటించడం విడ్డూరంగా ఉందని జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు డేరంగుల ఉదయ్‌కిరణ్‌ ఓ ప్రకటనలో దుయ్యబట్టారు. ఆంధ్రలో కృష్ణయ్య పెత్తనం నడవనివ్వబోమని స్పష్టం చేశారు. ఆయన స్థానంలో ఆంధ్రకు చెందిన ఏ బీసీకి స్థానం కల్పించినా తాము ఆనందపడేవారమని, ఈ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో బీసీలు వైసీపీకి ఓటెయ్యరని స్పష్టం చేశారు. ఆంధ్ర బీసీలు దద్దమ్మలు, చేతకాని వారని జగన్‌ భావిస్తే భవిష్యత్తులో వారి సత్తా ఏమిటో చూపిస్తారని అన్నారు.


సీఎం సేవకులకే సీట్లు: రంగుల గోపీ శ్రీనివాస్‌ 

‘కేసీఆర్‌తో జగన్‌ కుదుర్చుకున్న చీకటి ఒప్పందంలో భాగంగానే రాజ్యసభ సీట్లు బహుమతిగా ఇచ్చారు. సీట్లు ఇచ్చిన వారిలో ఒక వ్యక్తి జగన్‌ ఆక్రమ ఆస్తుల లెక్కలు రాసే వారుకాగా... మరొకరు జైలుకు వెళ్తే బెయిల్‌ తీసుకొచ్చేవారు. మరో వ్యక్తి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి సేవకుడిగా పనిచేస్తూ తెలంగాణలో జగన్‌ ఆస్తులను కాపాడే వ్యక్తి’ అని  బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రంగుల గోపీ శ్రీనివాస్‌ భీమవరంలో మండిపడ్డారు. 

Updated Date - 2022-05-20T08:41:27+05:30 IST