అతలాకుతలం!

ABN , First Publish Date - 2020-10-17T09:08:08+05:30 IST

వర్షం కాస్త తగ్గినా వరద కష్టం వెంటాడుతూనే ఉంది. జిల్లాలో పంట పొలాలూ, లోతట్టు ప్రాంతాలూ శుక్రవారం కూడా జలదిగ్బంధంలోనే ..

అతలాకుతలం!

కృష్ణానది నుంచి పెరుగుతున్న వరద 

జల దిగ్బంధంలో3,302 గృహాలు 

419 కిలోమీటర్ల రోడ్లు ధ్వంసం

15,811.4 హెక్టార్లలో వరి, పత్తి, మినుము నీటిపాలు

22 పునరావాస శిబిరాల్లో 5,024 మంది బాధితులు


ఆంద్రజ్యోతి - మచిలీపట్నం : వర్షం కాస్త తగ్గినా వరద కష్టం వెంటాడుతూనే ఉంది. జిల్లాలో పంట పొలాలూ, లోతట్టు ప్రాంతాలూ శుక్రవారం కూడా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. కృష్ణానదికి భారీ ఎత్తున వరదనీరు వస్తుండటంతో 32 గ్రామాలు నీటిలో చిక్కుకుపోయాయి. 8 లక్షల క్యూసెక్కుల నీరు ఎగువ నుంచి ప్రకాశం బ్యారేజీకి చేరే అవకాశం ఉందని కలెక్టర్‌ ఇంతియాజ్‌ తెలిపారు. నదీ పరివాహక ప్రాంతంలో పోలీసులు, రెవెన్యూ, పంచాయతీ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం నాటికి జిల్లాలో 3,302 గృహాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయినట్లు అధికారులు లెక్క తేల్చారు. 155 గృహాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. 112 గృహాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. కొటికలపూడి వాగులో మూడు రోజుల క్రితం గల్లంతైన కొత్తపల్లినవీన్‌ (23) మృతదేహం శుక్రవారం ఇబ్రహీంపట్నానికి ఆరు కిలోమీటర్ల దూరంలో లభ్యమైనట్లు డీఆర్వో వెంకటేశ్వర్లు తెలిపారు.


22 పునరావాస శిబిరాలు 

జిల్లాలో 22 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి, లోతట్టు ప్రాంతాల్లోని 5,025 మందిని వాటిలోకి తరలించారు. భారీ వర్షాల తాకిడికి జిల్లాలో 419 కిలోమీటర్ల మేర 109 రోడ్లు దెబ్బతిన్నట్టు అధికారులు నివేదికలు తయారు చేశారు. కృష్ణానదికి వరద ఊహించని స్థాయిలో వస్తున్నందున తోట్లవల్లూరు వద్ద 30 మందితో కూడిన ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాన్ని,నందిగామ వద్ద 24 మందితో కూడిన బృందాన్ని సహాయక చర్యలకు సిద్ధంగా ఉంచినట్టు డీఆర్వో తెలిపారు.  


15,811 హెక్టార్లలో పంటలు నీటమునక 

జిల్లాలోని 40 మండలాల్లోని 305 రెవెన్యూ గ్రామాల పరిధిలో వరి, పత్తి, చెరకు, మొక్కజొన్న, వేరుశెనగ తదితర పంటలు నీట మునిగినట్టు వ్యవసాయశాఖ జేడీ టి.మోహనరావు శుక్రవారం ప్రభుత్వానికి నివేదిక పంపారు. వీరులపాడు, విజయవాడ రూరల్‌, పెనుగంచిప్రోలు, ఎ-కొండూరు తదితర మండలాల్లో మొదటితీత, కాయ, పిందె, పూత దశలో ఉన్న పత్తి నీటముగినట్లు అఽధికారులు నివేదిక రూపొందించారు. కోడూరు మండలంలో 800 హెక్టార్లకుపైగా వరిపైరు నీట మునిగింది. కృష్ణానదిలో వరద ఉఽధృతి పెరగడంతో లంక గ్రామాల్లోని ఉద్యాన పంటలు దాదాపు నీట మునిగిపోయాయి. వరద తగ్గుముఖం పడితేనే పంట నష్టం అంచనా వేసేందుకు అవకాశం ఉంటుంది. గురువారం నాటికి జిల్లాలో 4,414 హెక్టార్లలో ఉద్యానపంటలు దెబ్బతిన్నట్లు ఆధికారులు లెక్కతేల్చారు.  


కంచికచర్ల/జగ్గయ్యపేట రూరల్‌: జగ్గయ్యపేట నుంచి నాగాయలంక వరకు జిల్లాలో 18 మండలాల్లోని తీర గ్రామాలకు ప్రమాదం పొంచి ఉంది. పులిచింతల జలాశయం నుంచి శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు 8.60 లక్షల క్యూసెక్కులు దిగువకు వదిలారు.  పాలేరు, మునేరు, కట్లేరు, వైరాయేరు, వెలగలేరు, ఇతరత్రా వాగుల నుంచి 50 వేల క్యూసెక్కులకుపైగా నదిలో కలుస్తోంది.  


రావిరాలను చుట్టిముట్టిన వరద

జగ్గయ్యపేట మండలం రావిరాల జలదిగ్బంధంలో చిక్కుకుంది. నాలుగువైపులా వరదనీరు చుట్టుముట్టింది. రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రమాదం పొంచి ఉండటంతో ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయభాను, నందిగామ డీఎస్పీ జీవీ రమణమూర్తి, ఇతర అధికారులు వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. 


మూసుకుపోయిన దారులు

జగ్గయ్యపేట మండలం ముక్త్యాల కోటిలింగాల క్షేత్రం వద్ద చంద్రమ్మ కయ్య ఉప్పొంగుతోంది. రోడ్డుపైకి పది అడుగుల ఎత్తున వరద నీరు ప్రవహిస్తోంది. పాలేరు వంతెనపై వరద నీరు పొంగుతోంది. ఫలితంగా జగ్గయ్యపేట నుంచి ముక్త్యాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బండిపాలెం నుంచి వేదాద్రి వెళ్లే మార్గం కూడా మూసుకుపోయింది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేదాద్రి దేవాలయాన్ని తాకుతూ నది పరవళ్లు తొక్కుతోంది. చందర్లపాడు మండలం ఉస్తేపల్లిని వరద చుట్టిముట్టింది.  


కంచికచర్ల/చందర్లపాడు : కంచికచర్ల మండలం గనిఆత్కూరు లంక భూమిలోని వారందరినీ సురక్షిత ప్రాంతానికి తీసుకొచ్చారు. చందర్లపాడు మండలం రామన్నపేట, పొక్కునూరు, కొడవటికల్లు, కాసరబాద, పోపూరు, కంచికచర్ల మండలం చెవిటికల్లు, గనిఆత్కూరు, మున్నలూరు, జగ్గయ్యపేట మండలం ముక్త్యాల, వేదాద్రి, రావిరాల గ్రామాలకు చెందిన వేలాది ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. 


చల్లపల్లి : కృష్ణానది తీర గ్రామాల్లోని వాణిజ్య పంటలు నీట మునిగాయి. లచ్చిగానిలంకను వరద ముంచెత్తింది. ఆముదార్లంకలోని పంట పొలాలు పూర్తిగా నీటమునిగాయి. మండల పరిధిలోని కరకట్ట దిగువనున్న నడకుదురు, నాదెళ్లవారిపాలెం, రాముడుపాలెం, నిమ్మగడ్డ, వెలువోలు గ్రామాల్లో వాణిజ్య పంటలు నీటిలోనే ఉన్నాయి. అరటి, బొప్పాయి, పసుపు, కంద, కూరగాయల పంటలు చేతికి అందకుండాపోయాయి.  


ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్‌

కంచికచర్ల రూరల్‌: ఎగువ నుంచి వరద నీరు భారీగా వస్తుందని కృష్ణానది పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ ఇంతియాజ్‌ పేర్కొన్నారు. మండలంలోని చెవిటికల్లు గ్రామంలోని లక్ష్మయ్య వాగు ఉధృతిని శుక్రవారం ఆయన పరిశీలించారు. నాగార్జున సాగర్‌, పులిచింతల ప్రాజెక్టుల నుంచి 9 లక్షల క్యూసెక్కులకుపైగా, కీసర నుంచి 50 వేల క్యూసెక్కులకుపైగా వరద నీరు వస్తోందన్నారు. లంక గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు సూచించారు.  


బాధితులను ఆదుకోవాలి : బుద్ధప్రసాద్‌

మోపిదేవి : వరదల కారణంగా నష్టపోయిన బాధిత ప్రజలను, రైతులను అన్ని విధాలుగా ఆదుకోవాలని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌... ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శుక్రవారం వరద ప్రభావిత గ్రామాలైన బొబ్బర్లంక, కె.కొత్తపాలెంలలో ఆయన పర్యటించి బాధితులను పరామర్శించారు. ఆయన వెంట మండల టీడీపీ అధ్యక్షుడు నడకుదుటి జనార్థనరావు, మత్తి రామ్‌ప్రసాద్‌, కోనేరు వెంకట బసవసుబ్బారావు, చందన రంగారావు ఉన్నారు. 


పూర్తిస్థాయిలో సహాయక చర్యలు : జేసీ

తోట్లవల్లూరు: కృష్ణానది వరద బాధితుల కోసం పూర్తిస్థాయిలో సహాయక చర్యలు చేపట్టాలని జాయింట్‌ కలెక్టర్‌ (ఆసరా మరియు సంక్షేమం) మోహన్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో శుక్రవారం వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. అనంతరం తోట్లవల్లూరు జడ్పీ హైస్కూల్లోని పునరావాస కేంద్రంలో తుమ్మలపచ్చికలంక వరద బాధితులను కలిశారు. వంటలను రుచి చూశారు. అనంతరం తోట్లవల్లూరు రేవులో వరద ఉధృతిని పరిశీలించారు.   

Updated Date - 2020-10-17T09:08:08+05:30 IST