సాగర్‌కు.. వరద

ABN , First Publish Date - 2022-08-06T05:18:03+05:30 IST

భారీ వర్షాలతో కృష్ణమ్మ పోటెత్తి ప్రవహిస్తోంది. నాగార్జున సాగర్‌ జలాశయానికి కృష్ణమ్మ బిరబిరా పరుగులు తీస్తూ ప్రవహిస్తోంది.

సాగర్‌కు.. వరద
సాగర్‌ జలాశయం

జలాశయానికి పోటెత్తుతోన్న కృష్ణమ్మ 

మరో ఆరు రోజులు కొనసాగితే నిండుకుండలా

శ్రీశైలం జలశయం నుంచి దిగువకు నీరు విడుదల 

590 అడుగులకు 566 అడుగులకు చేరిన నీటి నిల్వ

నరసరావుపేట, విజయపురిసౌత్‌, ఆగస్టు 5: భారీ వర్షాలతో కృష్ణమ్మ పోటెత్తి ప్రవహిస్తోంది. నాగార్జున సాగర్‌ జలాశయానికి కృష్ణమ్మ బిరబిరా పరుగులు తీస్తూ ప్రవహిస్తోంది. కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ ముందుకు సాగుతోంది. జలాశయాలకు వరద నీరు పోటెత్తుతున్నది. దీంతో జలాశయాలు నిండుకుండల్లా మారుతున్నాయి. గంటగంటకు నీటి మట్టాలు పెరుగుతూ ఉన్నాయి. శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.  దీంతో నాగార్జునసాగర్‌కు కూడా వరద నీరు భారీగా వస్తున్నది. సాగర్‌కు కూడా వరద నీరు పోటెత్తుతుంది. రిజర్వాయర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా శుక్రవారానికి అది 565.50 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి సాగర్‌ జలాశయానికి 2,02,810 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ఇదే స్థాయిలో వరద ప్రవాహం మరో ఆరు రోజులు కొనసాగితే సాగర్‌లో పూర్తి స్థాయికి నీటి మట్టం చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. సాగర్‌ జలాశయం పూర్తి స్థాయి సామర్థ్యం 312.05 టీఎంసీలు కాగా శుక్రవారం సాయంత్రం 245.35 టీఎంసీలకు చేరింది. రానున్న వారం రోజుల్లో గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. వరుసగా నాలుగో ఏడాది కూడా జలాశయం నిండే అవకాశాలున్నాయి.  

సాగర్‌ వైపు కృష్ణమ్మ పరవళ్లు

 సాగర్‌కు ఎగువ ప్రాజెక్టులైన శ్రీశైలం, హంద్రీ, సుంకేశుల, జూరాల ప్రాజెక్ట్‌లు పూర్తిస్థాయి నీటి సామర్థ్యాన్ని సంతరించుకున్నాయి. దీంతో వరద ప్రవాహాన్ని సాగర్‌కు విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి వరద ప్రవాహం భారీగా పెరగడంతో శ్రీశైలం జలాశయం ఐదు క్రస్ట్‌గేట్ల ద్వారా నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు. దీంతో  సాగర్‌ వైపు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది. సాగర్‌ కుడి కాలువ ద్వారా 1961 క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా 2660, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 1800 మొత్తంగా 6421 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం  885 అడుగులు కాగా ప్రస్తుతం 884.80 అడుగులు ఉంది. పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 214.84 టీఎంసీలు ఉంది. జూరాల నుంచి శ్రీశైలానికి 74,005 క్యూసెక్కులు, రోజా నుంచి 78,584 క్యూసెక్కులు మొత్తంగా 1,52,589 క్యూసెక్కులు నీరు శ్రీశైలానికి వచ్చి చేరుతోంది. 


నీటి నిల్వలు ఇలా.. 

జలాశయం         పూర్తి సామర్థ్యం     ప్రస్తుత నీటి నిల్వ  వస్తున్న నీరు  విడుదల చేస్తున్న నీరు

                      (టీఎంసీలు)             (టీఎంసీలు)      (క్యూసెక్కులు)    (క్యూసెక్కులు)           

శ్రీశైలం               215.81                   213.88         2,35,874      2,02,768

నాగార్జున సాగర్‌      312.05                   243.72        1,32,000       5,959

Updated Date - 2022-08-06T05:18:03+05:30 IST