ఇదేం తీరు..?

ABN , First Publish Date - 2022-07-07T05:12:40+05:30 IST

ప్రకాశం బ్యారేజిని దాటాక కృష్ణానది నీరు చివరకు కలిసేది సముద్రంలోనే. గతంలో కృష్ణానదికి నీటి కరవు రావటం, ఎగువ జలాశయాల నుంచి విభజన హక్కుల ప్రకారం దిగువకు రావలసిన నీటిని తెలంగాణ ప్రభుత్వం కుట్రలతో ఆపివేస్తుండటంతో గోదావరి జలాల మళ్లింపుకోసం పట్టిసీమను తీసుకొచ్చారు.

ఇదేం తీరు..?
కృష్ణానదిపైఓలేరు దగ్గర నదిపై నిర్మించిదలిచిన రెండో ఆనకట్ట ప్రదేశం

  ప్రకాశం బ్యారేజి దిగువ ఆనకట్టలను ఆపాలట!

తెలంగాణ ప్రభుత్వం అడ్డగోలు వాదనలు

తాజాగా కేఆర్‌ఎంబీకి తెలంగాణ ఈఎన్‌సీ లేఖ

కనీసం ప్రశ్నించని మన సర్కారు

రాష్ట్ర ప్రభుత్వ చేతకానితనమే ఇందుకు కారణమని ఆరోపణలు 

వృథా జలాల సద్వినియోగం నేరమా!

 ప్రతిపక్షాల మండిపాటు 

  

  కృష్ణానదీ యాజమాన్య బోర్డు నిబంధనలను, విభజన చట్టాన్ని తుంగలోతొక్కి కృష్ణానదిపై అడ్డ గోలుగా నిర్మాణాలు చేపడుతున్న తెలంగాణ సర్కారు... మన రాష్ట్రం లోని నిర్మాణాలను అడ్డుకునేందుకు కుయుక్తులు పన్నుతోంది. వృఽథాగా సముద్రంలో కలసిపోతున్న నీటిని సద్వినియోగం చేసుకునేందుకు ఏపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు అడ్డు తగులుతోంది. ప్రకాశం బ్యారేజి దిగువున తాగు, సాగునీటి అవసరాల కోసం రెండుచోట్ల బ్యారేజీల నిర్మాణానికి గత తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనికి నిధులుకూడా కేటాయించింది. అయితే దీనివల్ల తెలంగాణ ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేకపోయి నా, దిగువున మరే రాష్ట్రాలు లేకున్నా  వాటిని అడ్డుకునేందుకు ప్రయత్నా లు చేస్తోంది. తాజాగా కృష్ణానదీ యాజమాన్య బోర్డుకు లేఖ కూడా రాసింది. ఈ ప్రయత్నాలను వైసీపీ సర్కారుకూడా కనీసం ప్రశ్నించే స్థితిలో లేకపోవటంపై విపక్షాలు, రైతు సంఘాలు మండిపడుతున్నాయి.  



తెనాలి, జూలై 6(ఆంధ్రజ్యోతి): ప్రకాశం బ్యారేజిని దాటాక కృష్ణానది నీరు చివరకు కలిసేది సముద్రంలోనే. గతంలో కృష్ణానదికి నీటి కరవు రావటం, ఎగువ జలాశయాల నుంచి విభజన హక్కుల ప్రకారం దిగువకు రావలసిన నీటిని తెలంగాణ ప్రభుత్వం కుట్రలతో ఆపివేస్తుండటంతో గోదావరి జలాల మళ్లింపుకోసం పట్టిసీమను తీసుకొచ్చారు. ఇదంతా ఒక సమస్య అయితే, బ్యారేజికి దిగువున ఆనకట్టల నిర్మాణ ఆవశ్యకతకు మరో కారణముంది. గత కొన్ని దశాబ్దాలుగా బ్యారేజి దిగువున కనీసం ఒక్కచోటయినా ఆనకట్టలాగా నిర్మించాలని తీరవాసులు మొరపెట్టుకుంటూనే వచ్చారు. అయితే ఈ మూడు దశాబ్దాల కాలంలోనే భూగర్భజలాల పరిస్థితి దారుణంగా తయారైంది. గతంలో సముద్రం పక్కనే ఉన్న లంకెవానిదిబ్బ, రాజుకాల్వ వరకు భూగర్భంలో మంచినీరే ఉంటే, ఇప్పుడు అక్కడి నుంచి ఎగువకు 60 కిలోమీటర్ల వరకు నీటి తీరు మారిపోయింది. కృష్ణానదికి వరదలు తగ్గటం, నీటి అవసరాలు పెరగటంతో భూగర్భ జలాలు అడుగంటుతూ వచ్చాయి. వాటి స్థానాన్ని క్రమంగా సముద్ర జలాలు ఆక్రమించుకుంటూ చొచ్చుకు రావటంతో రేపల్లె మండలం పెనుమూడి వరకు ఉండే ఉప్పునీరు కాస్తా కొల్లూరు మండలం వరకు చొచ్చుకొచ్చాయి. దీంతో లంక గ్రామాల్లో సాగు, తాగునీటికోసం రూ.వందల కోట్లు ఖర్చుచేసి పోతార్లంక పథకాన్ని తీసుకొచ్చారు. అయినా ఆశించిన ఫలితాలు రాకపోవటంతో ఈ డ్యామ్‌ల నిర్మాణం ఆలోచన చేశారు. అరిష్టాలు అధికమించి చివరకు బ్యారేజిల నిర్మాణం చేపట్టేందుకు అన్ని అనుమతులను పొందారు. కానీ నిర్మాణం విషయంపై రెండేళ్లుగా కదలికే లేదు. అయినా తెలంగాణ ప్రభుత్వం కొత్తగా లొల్లి సృష్టించటంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. బ్యారేజిలు నిర్మించలేదనే విమర్శలు రాకుండా ఉండేందుకు, తెలంగాణ ప్రభుత్వం అడ్డుకుందనే వాదన వినిపించేందుకు మన సర్కారే కొత్త వాదనను తెరపైకి తెచ్చిందంటూ మాజీమంత్రి నక్కా ఆనందబాబు, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌లు విమర్శిస్తున్నారు. నాగార్జునసాగర్‌ దిగువు నుంచి ఎన్ని నిర్మాణాలు చేపట్టినా తెలంగాణ ప్రభుత్వానికే కాకుండా, మరే రాష్ట్రానికి నష్టం లేదు. అసలు వారికి సంబంధమే లేని విషయంపై అడ్డుతగలటం విడ్డూరమే.


ప్రతిపాదనలివీ..

ప్రకాశం బ్యారేజి దిగువున 92 కిలోమీటర్ల వరకు నది ప్రవహిస్తుంది. ఆపైన సముద్రంలో కలిసిపోతుంది. కృష్ణానదికి వరదలు వచ్చిన సమయంలో అదనపు నీటిని నిల్వ ఉంచుకునేందుకు సాగర్‌ దిగువున పులిచింతల, తర్వాత ప్రకాశం బ్యారేజి మాత్రమే ఉన్నాయి. పులిచింతలలో 40 టీఎంసీలు, బ్యారేజి దగ్గర కేవలం 3 టీఎంసీల నీటినే నిల్వఉంచే అవకాశం ఉంది. ఇవికాక మరో 10 టీఎంసీలను రెండు ఆనకట్టలు నిర్మించి నిల్వ ఉంచేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీనికోసం బ్యారేజి దిగువున 12వ కి.మీ. దగ్గర ప్రాతూరు-చోడవరం మధ్య, 62వ కి.మీటరు దగ్గర  పెనుమూడి-అవనిగడ్డ మధ్య బ్యారేజిలు నిర్మిచాలని నిర్ణయించారు. వీటికోసం రూ.2,565 కోట్లను ఖర్చు చెయ్యాలని భావించారు. ప్రాతూరు-చోడవరం దగ్గర 4.5 టీఎంసీలు, పెనుమూడి- అవనిగడ్డ దగ్గర 5.5 టీఎంసీల నీరు నిల్వ ఉంచవచ్చని అంచనా వేశారు. అయితే ఇక్కడ ఎంత నీరు నిల్వఉన్నా, వాటిని కాల్వలకు మళ్లించే పరిస్థితిలేదు. కేవలం తాగునీటికోసం పంప్‌ చేసుకోవటమే మార్గం. దీనివల్లకూడా తెలంగాణ ప్రభుత్వానికి ఆక్షేపణ ఉండదు. అన్నిటికంటే నీరు నిల్వ ఉండటంవల్ల కృష్ణా తీరంలోని గ్రామాల్లో భూగర్భ జాలాల వృద్ధితో పాటు, ఉప్పునీటి సమస్య తీరుతుంది. భవిష్యత్‌లో రెండు జిల్లాల్లోని కొల్లూరు- ఘంటశాల మండలాలను ఉప్పునీరు దాటి పైకి చొచ్చుకొచ్చే ప్రమాదంకూడా తప్పుతుంది. నదీ యాజమాన్య బోర్డు నిబంధనల ప్రకారం కృష్ణానదిలోని నీటిని మొదట తాగునీటి అవసరాలకు వినియోగించాలని వాదనలకు దిగుతున్న తెలంగాణ సర్కారు ఇక్కడి ప్రజలు గొంతెండి, ఉప్పునీరు తాగాలనే ఆలోచనతో ఉందా అంటూ స్థానిక రైతులు మండిపడుతున్నారు.



ప్రభుత్వం స్పందించేనా!

తెలంగాణ దాటిపోయి దిగువకు వచ్చిన కృష్ణానదిపై తమకు హక్కుందన్నట్టు కేఆర్‌ఎంబీ ఎదుట వాదనలకు దిగటంపై ప్రభుత్వం స్పందన కరువయింది. కొన్ని రోజుల క్రితమే తెలంగాణ ప్రభుత్వంలో నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ నదీ యాజమాన్య బోర్డుకు లేఖ రాయటంపై వివాదం మొదలయింది. కృష్ణానదిపై ఏపీ ప్రభుత్వం విభజన చట్టం ప్రకారం ఎపెక్స్‌ కౌన్సిల్‌, కేఆర్‌ఎంబీల అనుమతి లేకుండా దిగువున బ్యారేజిలు నిర్మాస్తున్నారని వాటిని అడ్డుకోవాలనేది లేఖ సారాంశం. అయితే ఈ లేఖ కేఆర్‌ఎంబీ నుంచి మన నీటిపారుదల శాఖకు చేరాల్సిఉంది. అయితే లేఖ రాసిన వార్తలు బయటకు వచ్చాకకూడా మన ప్రభుత్వం దీనిపై ఇంతవరకు స్పందించలేదనేది విపక్షాల వాదన. సమర్ధంగా అడ్డుకోలేకపోవటం, కేసీఆర్‌ ప్రభుత్వానికి దాసోహం అన్నట్టు వ్యవహరించటం వల్లే ఆ ప్రభుత్వం మనపై అడ్డగోలుగా విరుచుకుపడుతోందని, దీనిని సమర్ధంగా ఎందుకు తిప్పికొట్టలేకపోతున్నారంటూ గతంలో డెల్టా పరిరక్షణ సమితిని ఏర్పాటుచేసిన కృష్ణా జలాల హక్కుకోసం పోరాడిన మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ ప్రశ్నించారు. ఒకవేళ బోర్డు ఆపితే కేవలం మన ప్రాంత రైతులకే కాకుండా, జనానికి కూడా తాగునీటి కష్టాలను తీసుకొస్తారనే ఆందోళనను రైతు సంఘం నాయకుడు శివసాంబిరెడ్డి వ్యక్తం చేశారు.


లేఖ అందాక మా వాదన వినిపిస్తాం

తెలంగాణ ప్రభుత్వంలోని అధికారులు బోర్డుకు లేఖ రాసిన విషయం తెలిసింది. అయితే బోర్డు నుంచి మనకూ ఆ ప్రతి రావలసి ఉంది. బోర్డు మన వాదనలను వినిపించాలని కోరుతుంది. అప్పుడు మన నిర్మాణాల వల్ల తెలంగాణ ప్రభుత్వానికి వచ్చే ఇబ్బందులేంటో ప్రశ్నిస్తాం, బ్యారేజిల నిర్మాణం ఆవశ్యకత మనకు ఎంతుందనేది వినిపిస్తాం, వారి నిరాధార వాదనలను తిప్పికొడతాం. డెల్టా రైతులు ఆందోళన పడాల్సిన పనిలేదు. బ్యారేజీలను ప్రభుత్వం నిర్మించి తీరుతుంది. ఈమేరకు దీనిపై స్పష్టమైన ఆదేశాలున్నాయి. 

- తిరుమలరావు, ఎస్‌ఈ, నీటిపారుదల శాఖ, విజయవాడ

 

Updated Date - 2022-07-07T05:12:40+05:30 IST