Abn logo
Jun 20 2021 @ 23:58PM

చెల‘ఘాట్‌’మేల..?

ఆకతాయిలకు కేంద్రంగా కృష్ణానదీ పరివాహక ప్రాంతం

ఘాట్లలో అల్లరిమూకల అసాంఘిక కార్యకలాపాలు 

భద్రత లేకపోవడంతో బరితెగింపు

శాఖల మధ్య సమన్వయలోపంతో భయంకరంగా ఘాట్లు

సీతానగరం రైల్వేబ్రిడ్జి వద్ద యువతిపై గ్యాంగ్‌రేప్‌


విజయవాడ, ఆంధ్రజ్యోతి: అందమైన అలల గలగలలు... ఆహ్లాదకరమైన చిరుగాలులు.. పండు వెన్నెల్లో మెరిసే ఇసుక తిన్నెలతో ప్రతి ఒక్కరినీ పరవశింపజేసే కృష్ణానదీ తీరం.. చీకట్లో మాత్రం ప్రమాదాలకు కారణమవుతోంది. అడ్డూ అదుపూ లేని అల్లరిమూకలు, దోచుకుతినే దోపిడీ గ్యాంగ్‌లు, మత్తు పానియాల్లో మునిగితేలే మోసగాళ్లు, చిల్లర దొంగలకు తీరం ఆవాసంగా మారింది. కీలకమైన అతిపెద్ద ఘాట్లలో భద్రత అంతంతమాత్రంగానే ఉండటం, ప్రభుత్వ అధికారుల మధ్య సమన్వయలోపం, కనీసం లైట్లు కూడా లేకపోవడం.. వెరసి.. పవిత్ర స్థలం అపవిత్రంగా మారుతోంది. 


నగరంలోని స్నానఘాట్ల వద్ద భద్రత ప్రశ్నార్థకమైంది. సీతానగరం వైపు రైలు బ్రిడ్జికి దిగువన శనివారం రాత్రి ఓ యువతిపై జరిగిన అత్యాచారంతో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. కృష్ణా పుష్కరాల సమయంలో ఇటు విజయవాడ వైపున, అటు సీతానగరం వైపున భారీగా ఘాట్లను నిర్మించారు. నగరంలో పండిట్‌ నెహ్రూ బస్‌స్టేషన్‌ నుంచి ఘాట్లను ఏర్పాటు చేశారు. ఫెర్రి వద్ద పవిత్ర సంగమం, పున్నమి ఘాట్‌, పద్మావతి ఘాట్‌, కృష్ణవేణి ఘాట్‌ వద్దకు సందర్శకులు, ప్రేమికులు అధికంగా వస్తుంటారు. ఎక్కువసేపు గడుపుతుంటారు. ఇందులో పున్నమిఘాట్‌, దుర్గాఘాట్‌ మాత్రమే భద్రతపరంగా బాగున్నాయి. మిగతా ఘాట్లలో చీకటి పడితే అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. 


చీకటి పడితే చిందులే..

ఘాట్ల వద్ద, నదీ పరివాహక ప్రాంతంలో చిల్లర గ్యాంగ్‌లు బాగా సంచరిస్తున్నాయి. బ్యారేజీకి దిగువన ఉన్న ప్రాంతమంతా ఇసుకతో కనిపిస్తుంది. ఎవరెవరో నది మధ్యలో కూర్చుని కార్యకలాపాలు నిర్వహిస్తుంటారు. ఇక ఘాట్ల మీద పోలీసు పహారా ఉండదు. వరదలు లేని సమయంలో బీట్‌ పోలీసులు ఒకటి, రెండు రౌండ్లు వేసి స్టేషన్లకు వెళ్లిపోతారు. బీట్‌ కానిస్టేబుళ్లు రౌండ్లు వేసే సమయంలో చీకట్లోకి పారిపోయే అల్లరిమూకలు తర్వాత మళ్లీ అక్కడికి చేరుకుంటాయి. గంజాయి, బ్లేడ్‌ బ్యాచ్‌లకు ఇవి కేంద్రాలుగా మారుతున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు వారంతా ఇక్కడే గడుపుతున్నారు. పరిస్థితులు వారికి అనుకూలంగా ఉన్నప్పుడు పడగ విప్పుతున్నారు. సీతానగరం వైపున రైలు వంతెన కింద సరిగ్గా ఇదే జరిగింది. శనివారం రాత్రి తొమ్మిది గంటల వరకు ఘాట్‌ మెట్ల మీద కూర్చున్న యువతి, ఆమెకు కాబోయే భర్త రైలుబ్రిడ్జి కిందకు వెళ్లారు. అక్కడ ఎలాంటి లైట్లు లేవు. పైగా ఘాట్ల వద్ద నుంచి చూసినా అక్కడ ఎవరున్నారో కనిపించే అవకాశం లేదు. అప్పటికే అక్కడ కాపు కాసిన బ్లేడ్‌ బ్యాచ్‌ (ముగ్గురు) యువతికి కాబోయే భర్తపై దాడి చేసి తాళ్లతో కట్టేశారు. తర్వాత యువతిపై అత్యాచారం చేశారు. ఈ ఘటన ఇటు విజయవాడలోనూ, అటు సీతానగరంలోనూ సంచలనం కలిగించింది.  


నిర్వహణ లేదు.. నిఘా లేదు..

నదిని ఆనుకుని నిర్మించిన ఘాట్లతో పాటు ముందుభాగాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని గత తెలుగుదేశం ప్రభుత్వం భావిం చింది. పుష్కరాలు పూర్తయ్యాక ఆ నిర్వహణను గాలికి వదిలేశారు. దుర్గాఘాట్‌ దుర్గగుడి అధికారుల చేతిలో ఉండగా, పున్నమి ఘాట్‌ను పర్యాటక శాఖ అధికారులు నిర్వహిస్తున్నారు. ఈ రెండు మినహా పవిత్ర సంగమం, పద్మావతి, కృష్ణవేణి ఘాట్లవైపు అధికారులు కన్నెత్తి చూడటం మానేశారు. ఇటు వీఎంసీ, అటు ఇరిగేషన్‌  పట్టించు కోవడం మానేయడంతో అల్లరిమూకలు యథేచ్ఛగా సంచరిస్తున్నాయి. ఆకతాయిలు అర్ధరాత్రులు తిరుగుతున్నారు.


ఇలా చేస్తే..

నదిని ఆనుకుని నిర్మించిన ఘాట్లను పర్యాటకంగా అభివృద్ధి చేయడంతో పాటు నిఘాను పెంచాలి. నిర్వహణ బాధ్యతను ఎవరు నిర్వర్తించాలన్న దానిపై ఆయా శాఖల మధ్య ఏకాభిప్రాయం కుదరాలి. దానికి తగిన సమన్వయం ఉండాలి. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసినా, ఘాట్ల నిర్వహణ ఎవరి బాధ్యత అన్నది తేలాలి. ఇక్కడి పారిశుధ్య పనులను ప్రైవేట్‌ సంస్థకు అప్పగించడమా లేక వీఎంసీతో చేయడమా అనే విషయంలో స్పష్టత అవసరం. దీనితో పాటు ఈ ఘాట్ల వద్ద ఆధునిక పరిజ్ఞానంతో కూడిన సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా ఇరిగేషన్‌, వీఎంసీ, పర్యాటక, పోలీస్‌, దుర్గగుడి అధికారులు సమన్వయంతో వ్యవహరించి ప్రణాళికలను తయారు చేయాలి. 


ఇవి కూడా చదవండిImage Caption

ప్రియుడ్ని తాళ్లతో కట్టేసి.. ప్రియురాలిపై..