Advertisement

సీసీటీవీ ఫుటేజ్ ఇంకా రాలేదు.. మోహన్‌బాబు నాకు మిత్రుడే: ‘మా’ ఎన్నికల అధికారి

రీసెంట్‌గా జరిగిన ‘మా’ ఎన్నికల వ్యవహారంపై ప్రకాశ్ రాజ్ ప్యానల్ సీరియస్‌గానే మూవ్ అవుతుంది. తమ ప్యానల్‌లో గెలిచిన వారంతా రాజీనామాలు చేయడమే కాకుండా.. తాజాగా పోలింగ్ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన సీసీ టీవీ ఫుటేజ్ కావాలని ఎన్నికల అధికారికి ప్రకాశ్‌ రాజ్ లెటర్ రాసిన విషయం తెలిసిందే. ఈ లెటర్‌పై ‘మా’ ఎన్నికల అధికారి కృష్ణమోహన్ ఏబీఎన్‌ ఎక్స్‌క్లూజివ్‌లో వివరణ ఇచ్చారు. 


ఆయన మాట్లాడుతూ.. ‘‘ఎన్ని సీసీ కెమెరాలు పెట్టారనేది నాకు నెంబర్ ఐడియా లేదు కానీ.. ఎన్నికలకు సీసీ కెమెరాలు పెట్టడం మాత్రం జరిగింది. ప్రకాశ్ రాజ్‌గారు ఈ రోజు రాసిన లెటర్‌లో సీసీ టీవీ ఫుటేజ్ కావాలని అడిగారు. ‘లా’ ప్రకారం ఆయన అడిగింది ఇవ్వడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. ఇంకా సీసీటీవీ ఫుటేజ్ నా దగ్గరకు రాలేదు. ‘మా’ ఆఫీస్‌కు ఫోన్ చేసి అడిగితే.. సీసీటీవీ ఫుటేజ్ తీసినవారు ఇంకా ఇవ్వలేదని చెప్పారు. వాళ్ల ఫోన్ నెంబర్ తీసుకుని ఫోన్ చేశా. ఈ రోజు సాయంత్రం లేదంటే రేపు(శుక్రవారం) మార్నింగ్ ఇస్తామని అన్నారు. కాబట్టి.. ఇంకో 24 గంటల్లో అది నా దగ్గరకు వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా అది సేఫ్‌గా ఉందని చెప్పగలను.


నేను మోహన్ బాబుగారికి సన్నిహితుడిని. అది నిజమే. కానీ, మోహన్‌బాబుతో సాన్నిహిత్యానికి.. నా వృత్తిపరంగా నేను చేసే పనులకు ఎటువంటి సంబంధం లేదు. నేను చాలా పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాను. మోహన్‌బాబుగారు రౌడీయిజం చేశారనేది చాలా తప్పు. అలాంటిదేమీ జరగలేదు. చిన్న చిన్న సంఘటనలు జరిగితే వెంటనే నేను మాట్లాడి సాల్వ్ చేయడం జరిగింది. మోహన్ బాబుతో సాన్నిహిత్యం ఉందని.. నేను కావాలని ఏదో చేశానని అనుకోవడం చాలా తప్పు.

బయటి వ్యక్తులు పోలింగ్ లోపలికి వచ్చారా? లేదా? అనేది చెప్పడానికి నేనింకా ఫుటేజ్ చూడలేదు. చాలా మంది వచ్చారు. ఓటర్లు, కంటెస్టెంట్స్, డిఆర్‌సీ మెంబర్స్, వాలంటీర్లు, బాడీగార్డ్స్.. ఓవరాల్‌గా పోలింగ్ సమయంలో 1000 మంది హోల్ స్కూలంతా ఉన్నారు. వారె ఎవరెవరు? అనేది గుర్తు పెట్టుకోవడం చాలా కష్టం. కానీ బయటి వ్యక్తులు వచ్చారనే విషయాన్ని నేను ఇప్పుడే చెప్పలేను. అలా జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాం. అలాగే ఎవరూ ఎవరినీ బెదిరించలేదు. బెదిరించి ఎవరూ ఓట్లు వేయించుకోలేదు. అవన్నీ నిరాధారమైన ఆరోపణలు. ప్రకాశ్ రాజ్ ప్యానల్‌పై దాడి చేశారా? లేదా? అనేది సీసీటీవీ ఫుటేజ్ చూస్తే కానీ చెప్పలేను. అయితే నా నోటీస్‌కు మాత్రం ఏవీ రాలేదు. రెండు చిన్న చిన్న సంఘటనలు జరిగాయి. వెంటనే ఇరు ప్యానల్స్ వారిని పిలిచి మాట్లాడి సరిచేశాను. నెట్టుకోవడం, తిట్టుకోవడం వంటి సంఘటనలు మినహా.. హింసకు ప్రేరేపించే సంఘటనలు మాత్రం జరగలేదు. ఎలక్షన్స్ రూల్స్ కట్టుదిట్టంగా పాటించాము.


పోస్టల్ బ్యాలెట్స్ విషయంలో కూడా చాలా ఆరోపణలు వచ్చాయి. వాళ్లు ఎన్ని ఆరోపణలు చేసుకున్నా.. అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నా. మా ఎన్నికలకు సంబంధించి ఇప్పటి వరకు 10 సార్లు నేను ఎలక్షన్స్ నిర్వహించాను. లాయర్‌గా నాకు ఎంతో అనుభవం ఉంది. నా వరకు నేను ఈ ఎన్నికలను చాలా పారదర్శకంగా నిర్వహించాను. రాజీనామాల విషయానికి వస్తే.. ఇప్పటి వరకు ఈటీవీ ప్రభాకర్ రాజీనామా ఒక్కటే నా దగ్గరకు వచ్చింది. ప్రకాశ్ రాజ్ ‘మా’ సభ్యత్వానికి చేసిన రాజీనామా కూడా వచ్చింది. అంతే తప్ప ఇతరులవి ఏవీ ఇంకా నా వద్దకుగానీ, విష్ణు వద్దకు గానీ రాలేదు. ఈ రాజీనామాల వ్యవహారంపై ఎగ్జిక్యూటివ్ మీటింగ్ జరిగిన తర్వాతే ఆమోదించడమా? లేదా? అనేది తెలుస్తుంది. ఈ ఎన్నికలపై అవతల ప్యానల్ కోర్టుకు వెళ్లే ఉద్దేశం ఉన్నా.. విష్ణు చార్జ్ తీసుకోవడంతోనే ఎన్నికల ప్రాసెస్ అంతా పూర్తయింది. కోర్టు కూడా ఏమీ చేయలేదు..’’ అని తెలిపారు.

Advertisement
Advertisement