ఆదర్శప్రాయమైన జీవితం ఎలా ఉండాలి?

ABN , First Publish Date - 2022-08-17T04:25:58+05:30 IST

రాంచీ: భగవానుడైన శ్రీకృష్ణుని జననాన్ని సూచించే జన్మాష్టమి పవిత్ర దినాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన భక్తులు అనేక పద్ధతుల్లో వేడుకగా జరుపుకొంటారు.

ఆదర్శప్రాయమైన జీవితం ఎలా ఉండాలి?

రాంచీ: భగవానుడైన శ్రీకృష్ణుని జననాన్ని సూచించే జన్మాష్టమి పవిత్ర దినాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన భక్తులు అనేక పద్ధతుల్లో వేడుకగా జరుపుకొంటారు. ఆయన ప్రధానంగా దివ్య ప్రేమావతారునిగా ప్రజల చేత భావింపబడినా, యోగము, భక్తి, వేదాంతాలకు సంబంధించిన ఉత్కృష్ట సత్యాలను ఆయన అర్జునుడికి బోధించినందున ఎందరో భక్తుల హృదయాలలో ఆయన యోగేశ్వరునిగా, అంటే 'యోగానికి ప్రభువు' గా, ప్రత్యేక స్థానాన్ని పొంది ఉన్నాడు. అర్జునుడిని ఆయన ఒక ఆదర్శ యోగిగా (ధ్యానయోగానికి సంబంధించిన శాస్త్రీయ ప్రక్రియలను ఆచరిస్తూ) ఉండమని ప్రేరేపిస్తూ, శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు: “క్రమశిక్షణ ద్వారా శరీరాన్ని అదుపు చేసుకునే తపస్వుల కన్న, జ్ఞానమార్గాన్ని అనుసరించేవారికన్న, కర్మమార్గాన్నవలంబించేవారికన్న, యోగిని ఉన్నతుడుగా భావిస్తున్నారు. కాబట్టి ఓ అర్జునా, నువ్వు యోగివి అవు!” (VI:46)


ఈ మహోన్నత అవతారపురుషుడితో మన మనస్సులను, హృదయాలను అనుసంధానించుకొనే అవకాశాన్ని మనకు జన్మాష్టమి అందిస్తుంది. ఏడాదిలోని ఈ సమయంలో యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా సభ్యులు యోగేశ్వరుడైన శ్రీకృష్ణుని గౌరవసూచకంగా దాదాపు ఎనిమిది గంటలపాటు ప్రత్యేకమైన దీర్ఘధ్యానం చేసేందుకు సమావేశమౌతారు. 


ఒకయోగి ఆత్మకథ రచయితగా ప్రపంచ ప్రఖ్యాతులైన పరమహంస యోగానంద భారతీయులకు అత్యంత ప్రియమైన ధార్మిక గ్రంథమైన భగవద్గీతకు తాను చేసిన విలక్షణ వ్యాఖ్యానం "గాడ్ టాక్స్ విత్ అర్జున" లో కృష్ణ భగవానుని సందేశాన్ని దాని గాఢమైన పరిపూర్ణతతోనూ, స్పష్టతతోనూ మనకు అందించారు. ఇది కృష్ణ భగవానుడు (పరమాత్మకు ప్రతీక), ఆయన శిష్యుడైన అర్జునుడికి (ఆదర్శ శిష్యునిలోని జీవాత్మకు ప్రతీక) మధ్య జరిగిన సంభాషణ: వాటి అన్వయింపులో అన్ని కాలాల్లోనూ సత్యాన్వేషకులకు ఆధ్యాత్మిక మార్గదర్శకత్వాన్ని అందించే బోధనలివి. 


యోగానంద బోధనల్లో ప్రధాన మౌలికాంశం ఒక సంపూర్ణమైన ధ్యాన ప్రక్రియా విధానం: క్రియాయోగ ధ్యాన విజ్ఞానం. మనలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని మేల్కొలిపి, దైవసాక్షాత్కార ప్రసాదిత ఆంతరిక పరమానందాన్ని అందించే శక్తివంతమైన విధానాలను ప్రాచీనమైన ఈ ఆత్మవిజ్ఞాన శాస్త్రం మనకు అందిస్తుంది. యోగానందగారు ఇలా అన్నారు: “భగవద్గీత అధ్యాయాలు IV:29, V:27-28 లలో ప్రస్తావించిన, కృష్ణుడు అర్జునునికి బోధించిన క్రియాయోగ శాస్త్రం యోగ ధ్యానానికి సంబంధించిన అత్యున్నతమైన ఆధ్యాత్మిక శాస్త్రం. భౌతికవాద కాలాల్లో మరుగుపరచబడిన అనశ్వరమైన ఈ యోగశాస్త్రం మహావతార బాబాజీ చేత పునరుద్ధరించబడి YSS/SRF గురువులచే బోధించబడుతోంది.”


ఆదర్శప్రాయమైన జీవితం ఎలా ఉండాలి? ఈ ఆధునిక యుగానికే కాక ఏ కాలానికైనా తగిన పరిపూర్ణ సమాధానం కృష్ణ భగవానుడు ప్రసాదించారు: అదే కర్తవ్య పాలన, వైరాగ్యం, దైవసాక్షాత్కారం కోసం ధ్యానంతో కూడిన యోగం. ఈ యుక్తమైన మధ్యేమార్గం ప్రపంచంలో తీరిక లేకుండా ఉన్న వ్యక్తికీ, ఉన్నత ఆధ్యాత్మికాభిలాష కలిగిన వ్యక్తికీ కూడా అనుకూలమైనదని యోగానంద తన భగవద్గీత వ్యాఖ్యానానికి పరిచయంలో వివరించారు. 


YSS/SRF అధ్యక్షులైన స్వామి చిదానందగిరి తన జన్మాష్టమి సందేశంలో యోగదా భక్తులకు ఇలా తెలిపారు: "శ్రీకృష్ణుని రూపంలో వ్యక్తమైన అనంత పరమాత్మ తన శిష్యుడైన అర్జునుడిని ఆధ్యాత్మిక మరియు భౌతిక విజయం వైపు ఎలా నడిపించాడో, అలాగే మనము — మన ఆత్మ లోతుల్లో దాగి ఉన్న దివ్య లక్షణాలను, శక్తులను వ్యక్తపరిచేలా — దైవసాక్షాత్కారం సాధించే వరకూ, మన నిత్య జీవితపు కురుక్షేత్ర యుద్ధంలో ఆయన మనకూ దారి చూపిస్తాడని భగవద్గీత మనకు హామీ ఇస్తుంది.” 


అర్జునుడికి కృష్ణ భగవానుడు ఎలా సహాయం చేశాడో, అలాగే ఆయన మనలో ప్రతీ ఒక్కరిలో ఆత్మకూ, అహంకారానికి మధ్య జరిగే ఆంతరిక కురుక్షేత్ర యుద్ధంలో మనకు సహాయం చేస్తాడు. భగవద్గీతలో ఆయన అందించిన కాలాతీత జ్ఞానం ఏం చెపుతుందంటే, ఆత్మ విముక్తి సాధించాలంటే గాఢమైన ధ్యానంలో భగవంతుడితో అనుసంధానం పొందడం, మనం చేసే ప్రతీ పనీ ఈశ్వరార్పితంగా చేయడం కన్న మించిన మార్గం మరొకటి లేదు అని. 


భగవద్గీతకు తాను వ్రాసిన వ్యాఖ్యానంలో "ఏ భక్తుడైతే, ఆదర్శ శిష్యుడికి సంపూర్ణ ప్రతిరూపంగా నిలచిన అర్జునుడిని ఆదర్శంగా భావిస్తూ, తాను చేయవలసిన కర్తవ్యాన్ని నిష్కామంగా నిర్వహిస్తూ, క్రియాయోగం వంటి ప్రక్రియ ద్వారా తన ధ్యానయోగాన్ని పరిపూర్ణం చేసుకుంటాడో, ఆ భక్తుడు అర్జునుడిలాగే భగవంతుడి ఆశీస్సులను, మార్గదర్శకత్వాన్ని అందుకొని ఆత్మసాక్షాత్కారం అనే విజయాన్ని సాధిస్తాడు." అని చెప్పిన యోగానంద బోధనను మనం ఆచరిద్దామని ఈ జన్మాష్టమి నాడు నిర్ణయించుకొందాము. అదనపు సమాచారం కోసం: yssofindia.org

Updated Date - 2022-08-17T04:25:58+05:30 IST