Abn logo
Oct 28 2020 @ 01:25AM

కృష్ణ ఇంట... దసరా సందడి!

Kaakateeya

హీరో కృష్ణ చాలా కాలం తర్వాత సినీ రంగ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. విజయ దశమి సందర్భంగా ఆయన చేతులు మీదుగా ఓ స్టూడియో, ఓ సినిమా ప్రారంభం అయ్యాయి. కృష్ణ ఇంటి ఆవరణలో ఈ రెండు కార్యక్రమాలు జరగడం విశేషం.


విజయకృష్ణ గ్రీన్‌ స్టూడియోస్‌ ప్రారంభం

‘మీనా’, ‘హేమా హేమీలు’, ‘అంతంకాదిది ఆరంభం’ వంటి విజయవంతమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించిన సంస్థ శ్రీ విజయకృష్ణ మూవీస్‌. దీనిని 1972లో కృష్ణ, విజయనిర్మల ప్రారంభించారు. ఈ సంస్థను ‘విజయకృష్ణ గ్రీన్‌ స్టూడియోస్‌ ప్రై.లి.’ పేరుతో డా. వీకే నరేశ్‌, ఆయన తనయుడు నవీన్‌ విజయకృష్ణ రీలాంచ్‌ చేశారు. ఈ సంస్థ కార్యాలయాన్ని కృష్ణ రిబ్బన్‌ కట్‌ చేసి ప్రారంభించారు. ఛైర్మన్‌ ఛాంబర్‌, కాన్ఫిరెన్స్‌ హాల్‌ను హీరో సుధీర్‌ బాబు ప్రారంభించారు. అడ్మిన్‌, రిసెప్షన్‌ బ్లాక్స్‌ను విజయ నిర్మల తమ్ముళ్లు రవికుమార్‌, రామనాథ్‌ ప్రారంభించారు. నవీన్‌ విజయకృష్ణ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు బంధుమిత్రులు పాల్గొన్నారు.

శరణ్‌ని ఆదరించండి  

‘‘మా కుటుంబం నుంచి వచ్చిన చాలామంది ఆర్టిస్టులను ప్రేక్షకులు ఆదరించారు. అలాగే, మా కుటుంబ సభ్యుడు శరణ్‌ని ఆదరించి, అభిమానించాలని కోరుకుంటున్నా. హీరోగా వస్తున్న అతనికి నా అభినందనలు’’ అని కృష్ణ అన్నారు. కృష్ణ-విజయనిర్మల కుటుంబం నుంచి శరణ్‌ ‘ది లైట్‌’ కుమార్‌ హీరోగా పరిచయమవుతున్న చిత్రం విజయదశమి సందర్భంగా సోమవారం ప్రారంభమైంది. పూజా కార్యక్రమాల అనంతరం దర్శకుడిగా పరిచయమవుతున్న రామచంద్ర వట్టికూటి, నిర్మాతలు శ్రీలత బి. వెంకట్‌, వెంకట్‌ బులేమనికి సుధీర్‌ బాబు, ప్రియా దంపతులు స్ర్కిప్ట్‌ అందించారు. శరణ్‌, ‘జెమినీ’ సురేశ్‌ మీద చిత్రీకరించిన తొలి సన్నివేశానికి కృష్ణ గౌరవ దర్శకత్వం వహించారు. సుధీర్‌బాబు, నవీన్‌ విజయకృష్ణ కెమెరా స్విఛ్చాన్‌ చేయగా, వీకే నరేశ్‌ క్లాప్‌ ఇచ్చారు. ‘‘రామచంద్ర నాకు బాగా తెలుసు. మంచి రైటర్‌. తను పెద్ద దర్శకుడిగా, నా కజిన్‌ రాజు కుమారుడు శరణ్‌ పెద్ద హీరోగా ఎదగాలని కోరుకుంటున్నా’’ అని నరేశ్‌ అన్నారు. ‘‘నవంబర్‌ నెలాఖరున చిత్రీకరణ ప్రారంభించి జనవరికి చిత్రాన్ని పూర్తి చేస్తాం’’ అని నిర్మాతలు తెలిపారు. శరణ్‌కి నటి జయసుధ, హీరో సాయితేజ్‌ అభినందనలు తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: డా. చల్లా భాగ్యలక్ష్మి, పాటలు: సురేశ్‌ గంగుల, ఛాయాగ్రహణం: భరద్వాజ్‌, సంగీతం: రఘురామ్‌.

Advertisement
Advertisement