వరద పరీక్ష!

ABN , First Publish Date - 2021-12-05T08:38:05+05:30 IST

అప్పటికే... ఏడు పదుల వయసు! ముఖ్యమంత్రి పదవి చేపట్టి నెల రోజులు కూడా కాలేదు! అంతలోనే... కనీవినీ ఎరుగని రీతిలో వచ్చిన ‘కృష్ణ వరదల’ రూపంలో రోశయ్యకు తొలి పరీక్ష ఎదురైంది.

వరద పరీక్ష!

  • సీఎం అయిన నెలకే కృష్ణా భారీ వరదలు
  • రెండు రోజులు సచివాలయంలోనే రోశయ్య
  • వయోభారం లెక్కచేయకుండా పర్యవేక్షణ


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

అప్పటికే... ఏడు పదుల వయసు! ముఖ్యమంత్రి పదవి చేపట్టి నెల రోజులు కూడా కాలేదు! అంతలోనే... కనీవినీ ఎరుగని రీతిలో వచ్చిన ‘కృష్ణ వరదల’ రూపంలో రోశయ్యకు తొలి  పరీక్ష ఎదురైంది. అయితే, ఆయన తన వయోభారాన్నీ, అనారోగ్యాన్నీ లెక్క చేయలేదు. రెండు రోజులపాటు పూర్తిగా హైదరాబాద్‌లోని సచివాలయంలోనే ఉన్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ... ఇంటి  ముఖం కూడా చూడలేదు. 2009 అక్టోబరు 1 -5వ తేదీ వరకు కనీవినీ ఎరుగని రీతిలో కృష్ణా నదికి వరదలు వచ్చాయి. గరిష్ఠ సామర్థ్యానికి మించి నాలుగైదు రెట్ల వరద శ్రీశైలంలోకి వచ్చింది. ప్రాజెక్టు నిలబడదేమో అనే స్థాయిలో వరద తాకింది. వచ్చిన నీటిని వచ్చినట్లు నాగార్జునసాగర్‌కు.. అక్కడి  నుంచి ప్రకాశం బ్యారేజీ గుండా సముద్రంలోకి వదిలేశారు.


వరద ధాటికి కర్నూలు, మహబూబ్‌నగర్‌, గుంటూరు, నల్లగొండ జిల్లాలు అతలాకుతలమయ్యాయి. ఈ నేపథ్యంలో సహాయ కార్యక్రమాలను నిరంతరం సమీక్షిస్తూ.. వరద నిర్వహణ, అధికారుల మధ్య సమన్వయం చూసేందుకు అక్టోబరు 2, 3 తేదీల్లో పూర్తిగా సచివాలయంలోనే బస చేశారు. సెక్రటేరియట్‌కు పది కిలోమీటర్ల పరిధిలోనే తన నివాసం ఉన్నా..ఆయన సచివాలయాన్ని వీడలేదు. నేటితరం రాజకీయవేత్తలకు ఆదర్శంగా, దిక్సూచిగా నిలిచారు.

Updated Date - 2021-12-05T08:38:05+05:30 IST