కృష్ణమ్మ ఉరుకులు

ABN , First Publish Date - 2022-08-12T06:38:25+05:30 IST

కృష్ణమ్మ ఉరుకులు

కృష్ణమ్మ ఉరుకులు
ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి

ప్రకాశం బ్యారేజీకి భారీగా వస్తున్న వరద

4.50 లక్షల క్యూసెక్కులు రాక

సముద్రంలోకి లక్షా 6 వేల 370 క్యూసెక్కులు విడుదల

పులిచింతల వద్ద భారీ వరద ప్రవాహం


విజయవాడ, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి) : నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో ప్రకాశం బ్యారేజీకి కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. ప్రస్తుతం బ్యారేజీ రెండు వైపులా నిండుకుండను తలపిస్తోంది. ఈ ఖరీఫ్‌లో అత్యధికంగా ఇన్‌ఫ్లో నమోదుకావడం ఇదే ప్రథమం. బ్యారేజీకి శుక్రవారం ఉదయం నాటికి 4.50 లక్షల ఇన్‌ఫ్లో ఉంటుందని అంచనా వేశారు. దీనికి సంబంధించిన సమాచారం జిల్లా జలవనరుల శాఖ అధికారులకు అందింది. పులిచింతల ప్రాజెక్టు 17 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయడంతో గురువారం మధ్యాహ్నానికి ప్రకాశం బ్యారేజీకి నీరు చేరింది. ప్రస్తుతం బ్యారేజీ 70 గేట్లను పైకెత్తారు. 60 గేట్లను రెండు అడుగుల మేర, పది గేట్లను అడుగు మేర ఎత్తారు. ఎగువ నుంచి మొత్తం లక్షా33వేల925 క్యూసెక్కుల నీరు వస్తోంది. ఇందులో నుంచి లక్షా6వేల370 క్యూసెక్కులు సముద్రంలోకి వదులుతున్నారు. పులిచింతల నుంచి లక్షా9వేల93 క్యూసెక్కులు, పాలేరు నుంచి 5,283 క్యూసెక్కులు, కీసర నుంచి 19,550 క్యూసెక్కుల నీరు వస్తోంది. కాల్వలకు 12,539 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. కేఈబీకి 1,407, బందరు కాల్వకు 1,155, ఏలూరు కాల్వకు 1,457, రైవస్‌ కాల్వకు 3,910, కృష్ణా పశ్చిమ కాల్వకు 4,610 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. వరద ప్రవాహం దిగువ ఎంతగా ఉన్నా ముంపు ప్రభావం ఉండదని అధికారులు చెబుతున్నారు. 2.5 కిలోమీటర్ల మేర నది పరివాహక ప్రాంతంలో రిటైనింగ్‌ వాల్‌ను నిర్మించారు. ఈ వాల్‌ లేకపోతే కృష్ణలంక, రాణిగారితోట, తారకరామానగర్‌, రణదివేనగర్‌, భూపేష్‌నగర్‌గుప్తా నగర్‌ ప్రాంతాలు నీటి మునిగిపోయేవి. 


పులిచింతలకు భారీగా..

కంచికచర్ల : నాగార్జున సాగర్‌ నుంచి పులిచింతలకు భారీగా వరద చేరింది. రిజర్వాయర్‌ గరిష్ట నీటి సామర్థ్యం 53.34 మీటర్లు కాగా, గురువారం సాయంత్రానికి 50.80 మీటర్లకు చేరింది. నీటి నిల్వ గరిష్ట సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా, 40 టీఎంసీలకు పైగా చేరింది. గురువారం మధ్యాహ్నం సమయంలో సాగర్‌ నుంచి 4.50 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వచ్చింది. సాయంత్రం 5.30 గంటల సమయంలో పులిచింతల ప్రాజెక్టు 17 గేట్లు ఎత్తి 4,37,551 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. సీపేజీ ద్వారా మరో ఆరువేల క్యూసెక్కులు వదులుతున్నారు. మొత్తం పులిచింతల నుంచి 4,43,551 క్యూసెక్కులు ప్రకాశం బ్యారేజీకి చేరుతున్నాయి. కాగా, జగ్గయ్యపేట, చందర్లపాడు, కంచికచర్ల, ఇబ్రహీంపట్నం మండలాల్లోని తీర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ అధికారులు సూచిస్తున్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు అందుబాటులో ఉండాలని, ముందు జాగ్రత్తగా లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా యంత్రాంగం ఆదేశించింది. 

Updated Date - 2022-08-12T06:38:25+05:30 IST