Chitrajyothy Logo
Advertisement
Published: Fri, 03 Jun 2022 17:48:14 IST

పొలిటికల్‌ ఫిల్మోగ్రఫీ ‘Eenadu’: అభ్యుదయానికి, రాజకీయానికి మధ్య సంఘర్షణ

twitter-iconwatsapp-iconfb-icon

‘హర్‌ నైట్స్‌’ (Her Nights) (‘ఆమె యవ్వన రాత్రులు’) చిత్రంతో సంచలనం సృష్టించిన దర్శకుడు ఐ.వి.శశి (IV Sasi). ఆయన మలయాళంలో రూపొందించిన రాజకీయ చిత్రం ‘ఈనాడ్‌’ (Ee Nadu) (ఈ దేశం). మలయాళంలో ఈ సినిమాకు హిట్‌ టాక్‌  రావడంతో హీరో కృష్ణ (Krishna) దృష్టికి వచ్చి చిత్రం చూశారు. లో బడ్జెట్‌లో తీసిన చిన్న సినిమా. అయినా అందులోని పాయింట్‌ కృష్ణకు బాగా నచ్చింది. తెలుగులో తీస్తే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. అయితే  తను చేయదగ్గ పాత్ర ఏదీ ఆ  సినిమాలో లేకపోవడంతో హీరోగా ఎవరిని పెట్టాలా? అని ఆలోచించి,  చివరకు ‘ముత్యాలముగ్గు’ (Mutyala Muggu) శ్రీధర్‌తో ‘ఈనాడ్‌’ను తెలుగులో రీమేక్‌ చేయాలని  నిర్ణయించారు కృష్ణ. నటుడిగా తనకు ఎన్నో హిట్స్‌ ఇచ్చిన పి. సాంబశివరావు (P Sambasiva Rao)కు దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. అప్పటికే ‘చలిచీమలు’, ‘కలియుగ  మహాభారతం’, మరో మలుపు’, ‘ఈ చరిత్ర ఏ సిరాతో’ వంటి చిత్రాలతో అభ్యుదయ రచయితలుగా పేరు తెచ్చుకొన్న  పరుచూరి సోదరులను (Paruchuri Brothers) మాటలు రాయడానికి ఎన్నుకొన్నారు. ఆ పని ప్రారంభించే ముందు ‘ఈనాడ్‌’ చిత్రాన్ని ఒకసారి చూడమని కృష్ణ వారిద్దరికీ చెప్పారు. సినిమా చూశాక వారిద్దరి మదిలో వేరే ఆలోచన వచ్చింది. ఇందులో హీరోగా శ్రీధర్‌ (Sreedhar)కు బదులు కృష్ణ నటిస్తే బాగుంటుందనిపించి, ఆ విషయమే ఆయనతో  చెప్పారు. ‘అదేమిటీ.. ఆ సినిమాలో హీరో  వృద్ధుడు. హీరోయిన్ లేదు. పాటలు లేవు. నేను వేస్తే బాగుంటుందా?’ అని అడిగారు కృష్ణ. ‘మీరు చేస్తేనే బాగుంటుంది. మీ బాడీ లాంగ్వేజ్‌కి  తగినట్లుగా మార్పులు చేస్తాం సార్‌’ అని పరుచూరి సోదరులు చెప్పగానే కృష్ణ సరేనన్నారు.


మార్పులు చేశారిలా..

‘ఈనాడ్‌’లో హీరో వయసు 50 ఏళ్లు. అందుకే మొదట కృష్ణ వయసుకు తగ్గట్లుగా ఆ పాత్రను మార్చారు. ఒక అభ్యుదయవాదికీ, రాజకీయ నాయకునికీ మధ్య జరిగే సంఘర్షణ ఈ చిత్ర కథాంశం. ఆ రెండు పాత్రలకూ బంధుత్వం ఉన్నట్లు తెలుగు వెర్షన్‌లో మార్చారు. హీరోకి ఒక అక్క ఉన్నట్టూ, ఆమె భర్త రాజకీయ నాయకుడనీ  కథలో కీలక మార్పు చేశారు. కథావస్తువును మార్చకుండా ఇతివృత్తపరంగా ఇలా అనేక మార్పులు, చేర్పులు చేశారు. తను నటించే 200వ సినిమా కథ కోసం కృష్ణ  వెదుకుతున్న సమయమది. ఎన్నో కథలు అనుకున్నా.. అవేమీ సంతృప్తికరంగా రాని తరుణంలో ‘ఈనాడ్‌’లో పరుచూరి సోదరులు చేసిన మార్పులు నచ్చి, ఆ కథతోనే తన 200వ సినిమా తీయాలని కృష్ణ నిర్ణయించుకొన్నారు. అయితే, రెగ్యులర్‌ సినిమాల ధోరణిలో హీరో పాత్రకు డ్యూయెట్లు, హీరోయిన్.. ఏమీ లేకుండా కృష్ణ సూచనపై సమాజం కోసం జీవితాన్ని త్యాగం చేసిన అల్లూరి సీతారామరాజులా హీరో పాత్రను తీర్చిదిద్దారు పరుచూరి సోదరులు. ఆ పాత్ర పేరు కూడా రామరాజు (Ramaraju) అనే పెట్టారు. 

పొలిటికల్‌ ఫిల్మోగ్రఫీ Eenadu: అభ్యుదయానికి, రాజకీయానికి మధ్య సంఘర్షణ

‘ఈనాడు’ (Eenadu) టైటిల్‌ వెనక..

ఈ సినిమా టైటిల్‌ గురించి చర్చ జరిగినప్పుడు.. నాటి  సమాజంలో జరిగే సంఘటనలు చిత్రంలో కనిపిస్తాయి కనుక తెలుగులో కూడా ‘ఈనాడు’ అనే టైటిల్‌ బాగుంటుందని అనుకొన్నారు. అప్పటికే ఆ పేరుతో ఓ దినపత్రిక ఉండడంతో అందరికీ టైటిల్‌ బాగా కనెక్ట్‌ అయింది. ఎన్నికలు గుమ్మం దగ్గర నిలిచిన సమయాన.. రాజకీయ కథావస్తువుతో వచ్చే సినిమాలకు సాధారణంగా ప్రేక్షకుల స్పందన బాగానే ఉంటుంది. అందులోనూ  కుళ్లిపోయిన రాజకీయాలపై విసుర్లతో, ప్రజల నాడిని స్పృశిస్తూ తీసిన సినిమా కావడంతో 1982 డిసెంబర్‌ 17న విడుదలైన ‘ఈనాడు’కు ప్రేక్షకుల స్పందన చాలా బాగుంది. చిత్రంలోని ఇతర ముఖ్య పాత్రలను జగ్గయ్య, రావు గోపాలరావు, సత్యనారాయణ, చంద్ర మోహన్, గుమ్మడి, శ్రీధర్‌, గిరిబాబు, సుధాకర్‌, అల్లు రామలింగయ్య, జమున, కృష్ణకుమారి, రాధిక, శ్యామలగౌరి తదితరులు పోషించారు. 


సైకిల్‌ పాట (Cycle Song) అలా హెల్ప్‌ అయింది

ఈ సినిమాలో ‘రండీ కదలిరండి!. రండీ కలసిరండి’ అనే పాట మొత్తం కృష్ణ, ఇతరులు సైకిళ్లు తొక్కుతూ కనిపిస్తారు. ‘ఈనాడు’ సినిమా విడుదలకు ముందే కృష్ణ అభిమాన నటుడు ఎన్టీఆర్‌ (NTR) ‘తెలుగుదేశం’ (Telugu Desam) పార్టీని నెలకొల్పారు. ఆ పార్టీ ఎన్నికల గుర్తుగా ‘సైకిల్‌’ను కేటాయించారు. ‘ఈనాడు’ చిత్రం విడుదలయ్యాక ఈ పాటను చూసిన వాళ్ళంతా.. ఎన్టీఆర్‌కు మద్దతుగా కృష్ణ ఈ పాటను చిత్రీకరించారేమోనని అనుకున్నారు కూడా! ‘మేం కావాలని చేసిన పని కాదిది. అనుకోకుండా అలా కుదిరిందంతే.’ అని చెప్పారు చిత్ర దర్శకుడు సాంబశివరావు. 


‘ఈనాడు’ విడుదలైన రెండు వారాల అనంతరం జరిగిన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) శాసనసభ ఎన్నికల్లో ‘తెలుగుదేశం’ పార్టీ ఘనవిజయం సాధించింది. ఈ విజయానికి కారకుడైన ఎన్టీఆర్‌ను అభినందిస్తూ ఈ సందర్భంగా హీరో కృష్ణ దినపత్రికల్లో ఇచ్చిన ప్రకటన ఆ రోజుల్లో అందరి దృష్టినీ ఆకర్షించింది. 

-వినాయకరావు

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement