భీమవరం: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సోమవారం జరిగిన అల్లూరి సీతారామరాజు 125 జయంత్యుత్సవాల్లో పాల్గొవడానికి వచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అల్లూరి కుటుంబ సభ్యులను పరామర్శించి వారుసులను సత్కరించారు. అంతేకాదు సమరయోధుల కుటుంబాలను స్మరిస్తూ సభకు తీసుకొచ్చిన ప్రసిద్ధ సమరయోధులు తాడేపల్లిగూడేనికి చెందిన పసల కృష్ణమూర్తి, అంజలక్ష్మీ దంపతుల కుమార్తె కృష్ణభారతి (90) కాళ్లకు నమస్కారం చేసి తన దేశభక్తిని మరోసారి చాటారు. 1921లో సహాయ నిరాకరణ ఉద్యమంలో కృష్ణమూర్తి దంపతులు కీలకపాత్ర పోషించారు. ఆ సమయంలో అంజలక్ష్మి తంజావూరు జైలులో కృష్ణభారతికి జన్మనిచ్చారు. దీంతో కృష్ణుడు మాదిరిగా జైలులో పుట్టినందుకు కృష్ణ అని, దేశం కోసం అరెస్టు అయినందువల్ల భారతి అని కలిపి కృష్ణభారతిగా పేరు పెట్టారు. తల్లిదండ్రుల జాతీయ భావాలను పుణికి పుచ్చుకున్న కృష్ణభారతిని వేదిక వద్దకు తీసుకొచ్చారు. ఆమె కుటుంబ చరిత్రను వేదికపై వివరించారు. దీంతో ప్రధాని మోదీ ఆమె కాళ్లకు నమస్కరించారు.