బాలాత్రిపురసుందరిగా దుర్గమ్మ

ABN , First Publish Date - 2020-10-19T09:39:17+05:30 IST

బాలాత్రిపురసుందరిగా దుర్గమ్మ

బాలాత్రిపురసుందరిగా  దుర్గమ్మ

(ఆంధ్రజ్యోతి, విజయవాడ)  

ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో రెండో రోజైన ఆదివారం బాలాత్రిపురసుందరీదేవిగా దివ్యమంగళ స్వరూపంతో దుర్గమ్మ భక్తులకు దర్శనమిచ్చింది. బాలగా అమ్మవారు అభయహస్త ముద్రతో భక్తులను కటాక్షించారు. మహామండపం ఆరో అంతస్థులో విశేష కుంకుమార్చన, సువాసినీ పూజలను ఘనంగా నిర్వహించారు. ప్రధాన ఆలయ ప్రాంగణంలో శ్రీచక్ర నవావరణార్చన, యాగశాలలో చండీహోమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. సాయంత్రం గంగా సమేత దుర్గా మల్లేశ్వరస్వామి వార్లకు ఆలయ ప్రాంగణంలో పల్లకీ సేవ నిర్వహించారు. కరోనా భయంలోనూ భక్తులు అమ్మ దర్శనానికి తరలివచ్చారు. 


దసరా ఉత్సవాల్లో రెండోరోజైన ఆదివారం ఉదయం ఐదు గంటల నుంచే భక్తులను దర్శనానికి అనుమతించారు. ఆదివారం సెలవు అయినప్పటికీ కరోనా భయంతో భక్తులు తక్కువ సంఖ్యలోనే అమ్మవారి దర్శనానికి వచ్చారు. క్యూలైన్లలో ఉదయం భక్తులు కనిపించినా.. ఆ తర్వాత నుంచి అంతగా కనిపించలేదు. ఆలయానికి వీఐపీల తాకిడి కూడా లేకపోవడం విశేషం. కాగా భక్తులు భారీగా లేకపోయినా, క్యూలైన్లలోనూ, ప్రధాన ఆలయంలోను భౌతిక దూరం పాటించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. కొవిడ్‌ నిబంధనలను అమలు చేయడంలో ఆలయ అధికారులు, పాలక మండలి సభ్యులు విఫలమవుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. కరోనా భయంతో బందోబస్తు విధుల్లో ఉన్న పోలీసులు, భద్రతా సిబ్బంది కూడా పట్టించుకోవడం లేదు. 


టికెట్ల కరెంటు బుకింగ్‌ కౌంటర్ల దగ్గరా స్పందన తక్కువే 

కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూ రోజుకు పది వేలమంది భక్తులకు మాత్రమే అమ్మవారి దర్శనం కల్పిస్తామని దుర్గగుడి అధికారులు ముందుగానే ప్రకటించారు. నెల రోజులుగా దాదాపు లక్ష వరకు దర్శనం టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచారు. అయితే ఉచితం, రూ.100, రూ.300 టికెట్లు కలిపి సుమారు 75 వేల టికెట్లను మాత్రమే భక్తులు ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్నారు. టికెట్లు బుక్‌ చేసుకున్న భక్తులు కూడా చాలామంది కరోనా భయంతో దర్శనానికి రావడం లేదు. శనివారం మొత్తం 6,776 మంది ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్‌ చేసుకోగా, 5,345 మంది మాత్రమే అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తుల సంఖ్య తగ్గడంతో దేవస్థానం అధికారులు టికెట్ల కరెంట్‌ బుకింగ్‌ కౌంటర్లను ఏర్పాటు చేశారు. కార్పొరేషన్‌ కార్యాలయం సమీపంలోని ఖాళీ స్థలంలోనూ, స్టేట్‌ గెస్ట్‌హౌస్‌ వద్ద, పున్నమిఘాట్‌ వద్ద ప్రత్యేకంగా కరెంటు బుకింగ్‌ కౌంటర్లను ప్రారంభించారు. ఈ కౌంటర్ల వద్ద కూడా పెద్దగా స్పందన కనిపించడం లేదు. 

Updated Date - 2020-10-19T09:39:17+05:30 IST