కష్టపరిహారం

ABN , First Publish Date - 2020-10-19T09:42:58+05:30 IST

కష్టపరిహారం

కష్టపరిహారం

మచిలీపట్నం, ఆంధ్రజ్యోతి :వాయుగుండంతో పాటు కృష్ణానదికి వరద రూపంలో వచ్చిన విపత్తు పంటలను నిట్టనిలువునా ముంచేసింది. ఊహించని ఉపద్రవంతో కళ్లెదుటే పంటలు కోల్పోయిన రైతులను ఆదుకునే సయయం ఆసన్నమైంది.  పాలకులు, జిల్లాస్థాయి అధికారులు స్పందించాల్సి అవసరం ఏర్పడింది. చేతికందే దశలో ఉన్న పంటలు కోల్పోయిన రైతులు తక్షణమే పంటలు వేసుకునేందుకు  నష్టపరిహారం, పంట బీమా సొమ్మును సకాలంలో ఇప్పించాల్సిన బాధ్యత కలెక్టర్‌పై ఉంది.  ఈ ఏడాది వరి, పత్తి, మినుము, వేరుశెనగ, కూరగాయల తోటలు, కంద, పసుపు, మిర్చి, అరటి, చెరకు తదితర పంటలకు రైతులు రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టారు. వరి కోత, పత్తి మొదటితీత దశకు వచ్చాయి. ఫలసాయం అందే తరుణానికి పంటలు నీటిలో మునిగిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. పంటనష్టం అంచనాలు తయారుచేసే సమయంలో అధికారులు సక్రమంగా లెక్కలు తీస్తారా, లేక మమ అనిపిస్తారా అనే అనుమానాలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి. 


34వేల హెక్టార్లలో పంటలకు నష్టం

ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా సుమారు 10వేల హెక్టార్లలో వరి, పత్తి, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. ప్రస్తుత వాయుగుండం కారణంగా 16వేల హెక్టార్లలో వరి, పత్తి, చెరకు, వేరుశెనగ పంటలు, 7వేల హెక్టార్లకు పైగా ఉద్యాన పంటలతో పాటు మొత్తం 34వేల హెక్టార్ల వరకు పంట నీటమునిగి దెబ్బతిన్నట్లు అధికారులు ఇప్పటికే ప్రభుత్వానికి ప్రాథమిక అంచనాతో నివేదికలను పంపారు. 


పంట బీమా వచ్చేనా?

వరద తగ్గుముఖం పట్టిన తరువాత పంటనష్టం వివరాలు సేకరిస్తే మంచిది. రైతులు బ్యాంకుల్లో పంటరుణం తీసుకునే సమయంలోనే ఆయా పంటలకు బీమా సొమ్మును మినహాయించుకుంటారు. ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన పథకం ద్వారా ఈ సొమ్మును మినహాయించుకుంటారు. గత ఏడాది వరకు ఏజెన్సీ ద్వారా పంటబీమా సొమ్మును కట్టించుకోగా, ఈ ఏడాది  వ్యవసాయ శాఖ పర్యవేక్షణలోనే చెల్లింపు ప్రక్రియ జరిగింది. సొమ్ము చెల్లించినా ఈ-క్రాప్‌ బుకింగ్‌లో వివరాలు నమోదై ఉంటేనే పంటబీమా వస్తుందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. అయితే, వివిధ కారణాలతో జిల్లాలో ఈ-క్రాప్‌ బుకింగ్‌ పూర్తిస్థాయిలో జరగలేదు. అసైన్డ్‌ భూములకు సంబంధించి ఈ-క్రాప్‌ నమోదు జరగని పరిస్థితి ఉంది. కౌలు రైతులకు పంటబీమా, నష్టపరిహారం ఇస్తారా,  లేదా అనేది అనుమానమే. ఏడాది కాలంలో  వరి, ఇతర పంటలతో పాటు ఉద్యాన పంటలకు సుమారు రూ.9 కోట్లకుపైగానే పంట నష్టపరిహారం అందాల్సి ఉంది. సాధారణంగా పంటబీమా రావాలంటే మూడేళ్లుగా నమోదైన వర్షపాతం, వివిధ పంటల్లో వచ్చిన దిగుబడులను పరిగణనలోకి తీసుకుంటారు. ఈ ఏడాది పంటకోత ప్రయోగాలు చేసిన అనంతరం వచ్చిన నివేదికల ఆధారంగా  పంటబీమా వచ్చేది, లేనిదీ తెలుస్తుందని వ్యవసాయశాఖ అధికారులు అంటున్నారు. జిల్లాస్థాయి అధికారులు ఇన్సూరెన్స్‌ కంపెనీ అధికారులతో పదేపదే సంప్రదింపులు జరిపితేనే పంటబీమా వచ్చే అవకాశాలున్నాయని రైతులు చెప్పుకొంటున్నారు.

Updated Date - 2020-10-19T09:42:58+05:30 IST