పనులను త్వరితగతిన పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2021-04-23T05:58:46+05:30 IST

పనులను త్వరితగతిన పూర్తి చేయాలి

పనులను త్వరితగతిన పూర్తి చేయాలి

- ములుగు కలెక్టర్‌ కృష్ణఆదిత్య 

ములుగు కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 22 : జిల్లాస్థాయి కమిటీ నిర్ణయం మేరకు ప్రతిపాదించిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌.కృష్ణఆదిత్య సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో జిల్లాస్థాయి కమిటీ, ఫారెస్ట్‌ ప్రొటెక్షన్‌ కమిటీ సమావేశం జరగగా ఆయన పాల్గొని మాట్లాడారు. అన్ని మండలాల్లోని ఎంపీడీవోలు చేసిన ప్రతిపని రికార్డెడ్‌గా ఉండాలని అన్నారు. పల్లెప్రకృతి వనాల్లోని మొక్కల సర్వేవాల్‌ రేటు పెం చేలా చూడాలన్నారు. హరితహారంలో భాగంగా వచ్చే వర్షాకాలానికి ప్రణాళికలు రూపొందించాలని సంబంధిత అధికారులకు సూచించారు. మండలాలు, గ్రామాలవారీగా అవెన్యూ ప్లాంటేషన్‌, ఇంటింటికీ ఆరు మొక్కలు ఇచ్చేవిధంగా ప్రణాళిక రూపొందించి ముం దు ప్రణాళికలు తయారు చేయాలని అన్నారు. నాటిన ప్రతి మొక్కకు జియో ట్యాగింగ్‌ తప్పనిసరి అని, జిల్లాలోని రైతుల అభీష్టం మేరకు ఆయిల్‌ఫామ్‌, మామిడిఫామ్‌ అందించేందుకు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. స్వచ్ఛభారత్‌ మిషన్‌లో భాగంగా జిల్లాలో ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న వ్యక్తిగత మరుగుదొడ్లను పూర్తిచేయాలని, కొత్తవాటిని గుర్తించి నివేదికలు పూర్తి చేయాలని అన్నారు. జిల్లాలోని ప్రజలు, కంటైన్మెంట్‌ జోన్‌లో విధులు నిర్వర్తించే అధికారులు కొవిడ్‌ నిబంధనలు పాటించాలని, వ్యాక్సినేషన్‌ టార్గెట్‌ పూర్తి చేయాలని, ఇందుకోసం ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాక్సిన్‌ వేసుకున్న వారిలో కరోనా తగ్గుముఖం పట్టినట్లు గమనిస్తున్నామని, ప్రతి ఒక్కరూ నిబంధనల మేరకు వ్యాక్సిన్‌ వేసుకోవాలని కలెక్టర్‌ సూచించారు. జిల్లా అటవీశాఖ అధికారి ప్రదీ్‌పకుమార్‌శెట్టి మాట్లాడుతూ ఫారెస్టు, రెవెన్యూ అధికారులు  పరస్పర సహకారంతో పనులు చేపట్టాలని అన్నారు. అదనపు కలెక్టర్‌ ఆదర్శ్‌సురభి మాట్లాడుతూ కరోనా నియంత్రణలో భాగంగా మాస్కు ధరించనివారికి రూ.1000 జరిమానా విధించే అధికారం పంచాయతీ సెక్రటరీకి ఉందని, జరిమానా వేయడం ముఖ్య ఉద్దేశం కాదని, కరోనా నుంచి ప్రజలను రక్షించడంలో భాగమని అన్నారు. ఈ సమావేశంలో ఏటూరునాగారం ఐటీడీఏ పీవో హన్మంత్‌ కె జెండగే, డీఆర్వో రమాదేవి, ఎంపీడీవోలు, ఫారెస్టు రేంజ్‌, డివిజనల్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-23T05:58:46+05:30 IST