కమలనాథుల కుయుక్తులను తిప్పికొట్టండి

ABN , First Publish Date - 2022-03-09T17:25:56+05:30 IST

బళ్లారి నగర పాలికె మేయర్‌ ఎన్నికల్లో కమలనాథులు చేసే ప్రలోభాలు, రాజకీయ కుయుక్తులను కాంగ్రెస్‌ పార్టీ కార్పొరేటర్లు ఐక్యమత్యంగా తిప్పి కొట్టాలని కర్ణాటక ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (కేపీసీసీ) అధ్యక్షుడు డీకే

కమలనాథుల కుయుక్తులను తిప్పికొట్టండి

                 - కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌


బళ్లారి(కర్ణాటక): బళ్లారి నగర పాలికె మేయర్‌ ఎన్నికల్లో కమలనాథులు చేసే ప్రలోభాలు, రాజకీయ కుయుక్తులను కాంగ్రెస్‌ పార్టీ కార్పొరేటర్లు ఐక్యమత్యంగా తిప్పి కొట్టాలని కర్ణాటక ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (కేపీసీసీ) అధ్యక్షుడు డీకే శివకుమార్‌ సూచించారు. మేయర్‌, ఉప మేయర్‌ ఎన్నిక విషయంలో మంగళవారం బెంగళూరు కేపీసీసీ కార్యాలయంలో డీకే శివకుమార్‌ నేతృత్వంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాజ్యసభ సభ్యుడు నాసీర్‌ హుసేన్‌, ఎమ్మెల్సీ అల్లం వీరభద్రప్ప, బళ్లారి రూరల్‌ ఎమ్మెల్యే జీ నాగేంద్ర, మాజీ ఎంపీ ఉగ్రప్ప, బుడా మాజీ అధ్యక్షుడు జేఎస్‌ ఆంజనేయులు, మాజీ మేయర్‌ గుర్రం రమణ, మాజీ ఎమ్మెల్యే అనిల్‌లాడ్‌, కార్పొరేటర్లు గుమ్మనూరు జగన్‌, బీఆర్‌ఎల్‌ శ్రీనివాస్‌, ముల్లంగి నందీష్‌ బాబు, విక్కి, గాదెప్ప, రాజేశ్వరితో పాటు మొత్తం కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలుపొందిన 21 మంది కార్పొరేటర్లు, నలుగురు స్వతంత్రులు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా డీకే శివకుమార్‌ కార్పొరేటర్ల అభిప్రాయాలు తెలపాలని కోరారు. బీజేపీ నాయకులు కొందరు కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలుపొందిన కార్పొరేటర్లు తమ పార్టీలో చేరితే ఒక్కొక్కరికి రూ. 1.5 కోట్ల డబ్బులు, ఇన్నొవా కారు, ఒక సైటు ఇస్తామని చెప్పినట్లు డీకేతో వి వరించారు. అనంతరం డీకే శివకుమార్‌ మాట్లాడుతూ పార్టీకి ద్రోహం చేసి బీజేపీలో చేరొద్దని, తల్లికి ద్రోహం చేసినవారవుతారని పేర్కొన్నారు. మేయర్‌, ఉపమేయర్‌ అభ్యర్థుల ఎంపిక కోసం బళ్లారికి కమిటీని పంపుతామన్నారు. యూటీ ఖాదర్‌, ఇతర కొంత మంది కాంగ్రెస్‌ నాయకులతో కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. మేయర్‌ పదవి జనరల్‌ మహిళకు రిజర్వు కావడంతో 8 మంది మహిళా కార్పొరేటర్లు తమ పేర్లను పరిశీలించాలని కోరారు. సమావేశానికి 35వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన మించు శ్రీనివాస్‌ అలియాస్‌ మించు శీనా గైర్హాజరయ్యారు. స్వతంత్ర అభ్యర్థులు మొత్తం ఐదుగురు ఉంటే వీరిలో నలుగురు హజరు కాగా మించు శీనా హాజరు కాలేదు. కాంగ్రెస్‌ నేత నారా సూర్యనారాయణరెడ్డి తనయుడు నారా భరత్‌రెడ్డికి మించు శీనా ముఖ్య అనుచరుల్లో ఒక్కడు. టికెట్‌ రాకపోయినా స్వతంత్రుడిగా నిలిపి సర్వశక్తులూ ఒడ్డి గెలిపించుకున్నారు. 

Updated Date - 2022-03-09T17:25:56+05:30 IST