నాటుసారా తాగి ఇద్దరి మృతి

ABN , First Publish Date - 2020-09-25T11:04:58+05:30 IST

విశాఖపట్నం జిల్లా కొయ్యూరు మండలం కినపర్తి శివారు భీమవరంలో నాటుసారా తాగి గురువారం ఉదయం ఇద్దరు మృతిచెందారు.

నాటుసారా తాగి ఇద్దరి మృతి

మృతుల్లో ఒకరి భార్య...

సారాలో క్రిమిసంహారక మందును కలిపిందని తల్లి ఆరోపణ


కొయ్యూరు, సెప్టెంబరు 24: విశాఖపట్నం జిల్లా కొయ్యూరు మండలం కినపర్తి శివారు భీమవరంలో నాటుసారా తాగి గురువారం ఉదయం ఇద్దరు మృతిచెందారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన జనుమూరి బాలరాజు (30) ఉదయం ఏడు గంటల సమయంలో బుధవారం రాత్రి తెచ్చుకున్న సారా తాగేందుకు ఉపక్రమించాడు. అదే సమయంలో వ్యవసాయ పనులకు వెళుతున్న పైల వెంకటసత్యనాయుడు (45)ను పిలిచి కొంత సారా ఇచ్చాడు. ఇద్దరూ తాగిన అనంతరం ఎవరిదారిన వారు వెళ్లిపోయారు. బాలరాజు తన ఇంటికి ఎదురుగా వున్న జీడితోటలోకి వెళ్లి వచ్చి అస్వస్థతకు గురయ్యాడు. అతడి భార్య మల్లయ్యమ్మ పరిస్థితిని గమనించి బంధువులను పిలవగా హుటాహుటిన ఆటోలో తీసుకుని కృష్ణాదేవిపేట పీహెచ్‌సీకి బయలుదేరారు.


మార్గమధ్యంలో అటవీ చెక్‌పోస్టు వద్ద వెంకటసత్యనాయుడు చూసి...ఏమైందని అడిగాడు. వారు విషయం చెప్పడంతో అదే సారా తాను కూడా తాగానని చెప్పి ఆటో ఎక్కాడు. అతడు కూడా అస్వస్థతకు గురయ్యాడు. బాధితులిద్దరికీ కృష్ణాదేవిపేట పీహెచ్‌సీలో ప్రాథమిక వైద్యం అందజేసిన వైద్యులు...పరిస్థితి విషమంగా వుండడంతో అంబులెన్స్‌లో నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి పంపించారు. నర్సీపట్నం సమీపంలోని చీడిగుమ్మల చేరుకునేసరికి బాలరాజు మృతిచెందాడు. వెంకటసత్యనాయుడు ఏరియా ఆస్పత్రిలో వైద్య సేవలు పొందుతూ మృతిచెందాడు. కొయ్యూరు సీఐ వెంకటరమణ, ఎస్‌ఐ నాగేంద్ర సంఘటనా గ్రామాన్ని సందర్శించి...ఇద్దరి మృతిపై ఆరా తీశారు. బాలరాజుకు ఇద్దరు పిల్లలు. కాగా వెంకటసత్యనాయుడు  స్వస్థలం గొలుగొండ మండలం కృష్ణాదేవిపేట. భీమవరంలో వున్న సొంత భూమిలో వ్యవసాయం చేసుకుంటూ అక్కడే ఉంటున్నాడు. భార్య, పిల్లలు కృష్ణాదేవిపేటలో ఉంటారు. 


బాలరాజు భార్య సారాలో క్రిమిసంహారక మందు కలిపిందని ఆరోపణ

బాలరాజు తెచ్చుకున్న నాటుసారాలో అతడి భార్య మల్లయ్యమ్మ క్రిమిసంహారక మందును కలిపిందని అతడి తల్లి రాజులమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే తన భర్తను తాను ఎందుకు చంపుకుంటానని మల్లయ్యమ్మ రోదిస్తూ చెబుతున్నది. వారు నాటుసారా కారణంగానే మృతిచెందారా?..లేక క్రిమిసంహారక మందు కలిసిందా? అనే విషయం తేలాల్సి ఉంది. 

Updated Date - 2020-09-25T11:04:58+05:30 IST