ఆస్తి పన్ను పెంపును తిప్పికొట్టిన విపక్షం

ABN , First Publish Date - 2021-07-27T04:38:27+05:30 IST

కరోనాతో ప్రజలు అవస్థలు పడుతున్న నేపథ్యంలో పన్నుల పెంపుపై విపక్షాలు నిరసన వ్యక్తం చేయడంతో మున్సిపల్‌ ప్రత్యేక సమావేశం ఈ అంశాన్ని వాయిదా వేసింది.

ఆస్తి పన్ను పెంపును తిప్పికొట్టిన విపక్షం
సమావేశంలో మాట్లాడుతున్న సభ్యులు

కొవ్వూరు, జూలై 26 : కరోనాతో ప్రజలు అవస్థలు పడుతున్న నేపథ్యంలో పన్నుల పెంపుపై విపక్షాలు నిరసన వ్యక్తం చేయడంతో మున్సిపల్‌ ప్రత్యేక సమావేశం ఈ అంశాన్ని వాయిదా వేసింది. కొవ్వూరు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బావన రత్నకుమారి అధ్యక్షతన కౌన్సిల్‌ ప్రత్యేక సమావేశం సోమవారం నిర్వహించారు. టీడీపీ కౌన్సిలర్‌ సూరపనేని సూర్యభాస్కర రామ్మోహన్‌ మాట్లాడుతూ మున్సిపాల్టీ ఆదాయం పెంచుకోడానికి ప్రజలపై భారం మోపడం సరి కాదన్నారు. పన్నుల పెంపును తెలుగుదేశం పార్టీ తరపున వ్యతిరేకిస్తున్నామని, పన్నుల పెంపు వాయిదా వేయాలని సమావేశాన్ని కోరారు. బీజేపీ కౌన్సిలర్‌ పిల్లలమర్రి మురళీకృష్ణ మాట్లాడుతూ రెండేళ్లుగా ప్రజలు కరోనాతో అల్లాడుతున్నారు. ఈ తరుణంలో చెత్తపై పన్ను, ఆస్తి పన్ను పెంపుదల భావ్యం కాదని, తమ పార్టీ తరపున కూడా పన్ను పెంపును వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. ఆస్తిపన్ను పెంపుదలను వ్యతిరేకిస్తూ కౌన్సిల్‌ తీర్మానించి ప్రభుత్వానికి పంపించాలని ఆయన కోరారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బావన రత్నకుమారి, కమిషనర్‌ కేటీ.సుధాకర్‌ మాట్లాడుతూ మున్సిపాల్టీ కాంట్రాక్టు వర్కర్లకు జీతాలు చెల్లించలేని పరిస్థితిలో ఉందని, ఆర్థిక పరిపుష్టిపై సభ్యులు దృష్టి సారించాలన్నారు. ఆస్తి పన్ను రివిజన్‌పై నెలాఖరులోగా కౌన్సిల్‌ ఆమోదించి తీర్మానం పంపించాల్సి ఉంద న్నారు. దీనితో ఆదాయం పెంపు పేరుతో ప్రజలపై భారం మోపడం తగదని విపక్షాలు పట్టుబట్టాయి. విపక్షాల డిమాండ్‌ మేరకు ఆస్తిపన్ను పెంపుదల అంశాన్ని వాయిదా వేస్తునట్లు చైర్‌పర్సన్‌ బావన రత్నకుమారి తెలిపారు.


మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బావన రత్నకుమారి అధ్యక్షతన ముగ్గురు కో–ఆప్షన్‌ సభ్యులను మంత్రి తానేటి వనిత సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సభ్యులందరూ సమష్టిగా పట్టణాభివృద్ధికి కృషిచేయాలని మంత్రి వనిత సూచించారు. జనరల్‌ కేటగిరి నుంచి ఏలూరి వీరవెంకటరావు, ముస్లిం మైనార్టీ నుంచి షేక్‌ అహ్మద్‌ ఆలీ, క్రిస్టియన్‌ మైనార్టీ మహిళా కేటగిరి నుంచి కందుకూరి నిరోషా ఎంపికయ్యారు.

Updated Date - 2021-07-27T04:38:27+05:30 IST