‘ఎర్ర’ దోపిడీకి చెక్‌!

ABN , First Publish Date - 2020-05-22T10:24:48+05:30 IST

ఎర్రమట్టి అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. కొంతకాలంగా కోవూరు..

‘ఎర్ర’ దోపిడీకి చెక్‌!

కోవూరు నియోజకవర్గంలో ఎర్రమట్టి స్మగ్లింగ్‌

సీజేఎఫ్‌ఎస్‌, ప్రభుత్వ భూముల్లో ఇష్టానుసారం తవ్వకాలు

స్క్వాడ్‌ల తనిఖీల్లో వెలుగులోకి.. 

8 టిప్పర్లు, ఒక ఎక్స్‌కవేటర్‌ సీజ్‌

కొడవలూరులో 15 మందిపై కేసు

ఎఫ్‌ఐఆర్‌లో అధికార పార్టీ ముఖ్య నేత పేరు?

మాఫీకి అప్పుడే రాజకీయ ఒత్తిళ్లు


నెల్లూరు(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఎర్రమట్టి అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. కొంతకాలంగా కోవూరు నియోజకవర్గం పరిధిలోని తలమంచి, రేగడిచిలక, ఎల్లయ్యపాళెం పరిధిలోని సీజేఎఫ్‌ఎస్‌, ప్రభుత్వ భూముల నుంచి ఎర్రమట్టి తరలుతుండటంపై పోలీసులు దృష్టి సారించారు. గురువారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఎల్లయ్యపాళెం వద్ద  ఎర్రమట్టిని తరలిస్తున్న 8 టిప్పర్లు, ఒక ఎక్స్‌కవేటర్‌ను సీజ్‌ చేశారు. దీనిపై కొడవలూరు పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నెం.215-2020 కింద మొత్తం 15 మందిపై కేసు నమోదు చేశారు. సర్వేపల్లికి చెందిన శ్రీను, పవన్‌ కల్యాణ్‌ గణపతి, సర్వేపల్లి కృష్ణ, అల్లూరు శ్రీనివాసులు, షేక్‌ మాసూం, మస్తాన్‌ పల్లల, బాబు మలింగ, కప్పట్రాళ్ల సురేష్‌, సునీల్‌ కౌసురి, రాజేష్‌, బాబి, సురేష్‌రెడ్డి, వీరి అమరేంద్ర, నిరంజన్‌రెడ్డి, వీరి చలపతిలపై ఐపీసీ 379 సెక్షన్‌ కింద కేసులు నమోదు చేశారు.


కేసు మాఫీకి యత్నం?

ఈ కేసు మాఫీ కోసం పెద్ద ఎత్తున రాజకీయ పైరవీలు జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ స్మగ్లింగ్‌ వెనుక అధికార పార్టీకి చెందిన నాయకులు ఉన్నారని ఆరోపణలు ఉన్నాయి. చాలా కాలంగా ఈ ప్రాంతం నుంచి కోట్లాది రూపాయలు విలువచేసే ఎర్రమట్టి అక్రమంగా తరలుతోంది. ఈ స్మగ్లింగ్‌ వెనుక రాజకీయ నేతల అండదండలు ఉండటంతో అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తూ వచ్చారు. అయితే ఇసుక, గ్రావెల్‌ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడానికి జిల్లా అధికారులు ప్రత్యేక స్క్వాడ్లు ఏర్పాటు చేయడంతో ఈ అక్రమ దందాకు చెక్‌ పడింది.


ఈ కేసును మాఫీ చేయడానికి పోలీసులపై పెద్ద ఎత్తున రాజకీయ ఒత్తిళ్లు జరిగినట్లు సమాచారం. ఈ కేసులోని 15 మంది నిందితుల్లో అధికార పార్టీకి చెందిన ఒక ముఖ్యనాయకుడి పేరు కూడా ఉందని సమాచారం. ఆ క్రమంలోనే ఈ కేసు పూర్వాపరాలను వివరించడానికి పోలీసు అధికారులు ఇష్టపడనట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ఆంధ్రజ్యోతి ప్రయత్నించగా పోలీసు అధికారుల నుంచి సరైన సమాధానం అందలేదు. 

Updated Date - 2020-05-22T10:24:48+05:30 IST