ఐసోలేషన్‌ కోచ్‌లు రెడీ!

ABN , First Publish Date - 2020-04-03T09:26:38+05:30 IST

కోవిడ్‌-19 రోగులకు అత్యవసర పరిస్థితుల్లో చికిత్స అందించటానికి వీలుగా విజయవాడ రైల్వేడివిజన్‌ అధికారులు 30 కోచ్‌లను ఐసోలేషన్‌ వార్డులుగా సిద్ధం చేశారు.

ఐసోలేషన్‌ కోచ్‌లు రెడీ!

30 స్లీపర్‌కోచ్‌లను ఐసోలేషన్‌ వార్డులుగా తీర్చిదిద్దిన విజయవాడ రైల్వే 

విజయవాడ - 10, మచిలీపట్నం - 5, నర్సాపూర్‌ - 5, కాకినాడ - 10 

కోచ్‌లో 9 క్యాబిన్లు.. క్యాబిన్‌కు ఇద్దరు రోగులు 


ఆంధ్రజ్యోతి, విజయవాడ : కోవిడ్‌-19 రోగులకు అత్యవసర పరిస్థితుల్లో చికిత్స అందించటానికి వీలుగా విజయవాడ రైల్వేడివిజన్‌ అధికారులు 30 కోచ్‌లను ఐసోలేషన్‌ వార్డులుగా సిద్ధం చేశారు. ఇంటిగ్రేటెడ్‌ కోచ్‌ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్‌) ఇచ్చిన ప్లాన్‌ ప్రకారం విజయవాడ కోచింగ్‌ డిపోలోనూ, డివిజన్‌ పరిధిలోని మరికొన్ని కోచింగ్‌ డిపోల్లోనూ యుద్ధ ప్రాతిపదికన ఇవి రూపుదిద్దుకున్నాయి. డివిజన్‌  పరిధిలోని విజయవాడలో-10, మచిలీపట్నంలో-5, నర్సాపూర్‌లో-5,  కాకినాడలో-10 చొప్పున కోచ్‌లను కేటాయించారు. ఈ ఐసోలేషన్‌ స్లీపర్‌ కోచ్‌లను కృష్ణా,  ఉభయ గోదావరి జిల్లాల యంత్రాంగాలు ఉపయోగించుకోవచ్చు. ఈ కోచ్‌లను రోగులకు అవసరమైన సౌకర్యాలతో తీర్చిదిద్దారు. కోచ్‌లో ప్రతి క్యాబిన్‌లోనూ రెండు అప్పర్‌ బెర్తులు, రెండు లోయర్‌ బెర్తులు ఉంటాయి. రోగులకు  సౌకర్యంగా లోయర్‌ బెర్తులను మాత్రమే ఉపయోగించుకోవాల్సి ఉంటుంది.


ఒక కోచ్‌కు 9 క్యాబిన్లు ఉంటాయి. అంటే ఒక్కో కోచ్‌లో 18 మంది రోగులకు చికిత్స అందించవచ్చు. ఈ లెక్కన మొత్తం 30 కోచ్‌లకు కలిపి మొత్తం 380 మంది రోగులకు చికిత్స అందించవచ్చు. రోగుల కోసం ఐసోలేషన్‌ కోచ్‌లలో అనేక సదుపాయాలను కల్పించారు. కోచ్‌లోని ప్రతి క్యాబిన్‌లో బెర్తుల పక్కనే రెండు ఆక్సిజన్‌ సిలిండర్లను ఏర్పాటు చేశారు. క్యాబిన్‌ స్కీన్‌ను మూసివేసేందుకు వీలుగా పారదర్శకంగా ఉండేలా ప్లాస్టిక్‌ షీట్లను ఉపయోగించారు. ప్రతి కోచ్‌కూ నాలుగు మరుగుదొడ్లు ఉంటాయి. మరుగుదొడ్లలో నేల మెత్తగా ఉండటానికి పీవీసీ మెటీరియల్‌తో కూడిన షీట్‌ను వేయించారు. బాత్‌రూమ్‌ల్లో బకెట్‌, మగ్గు, సోప్‌ ఉంచారు.


పొడవాటి ట్యాప్‌ను, ఒక హ్యాండ్‌ షవర్‌ను ఏర్పాటు చేశారు. ప్రతి బెర్తుకూ ఒక బాటిల్‌ హోల్డర్‌ సదుపాయాన్ని, త్రీ పెగ్‌ కోట్‌ హుక్స్‌ రెండింటిని ఏర్పాటు చేశారు. కిటికీల నుంచి దోమలు రాకుండా దోమతెర ఏర్పాటు చేశారు. ప్రతి క్యాబిన్‌లో మూడు డస్ట్‌బిన్‌లు, వీటిలో బయోడీ గ్రేడబుల్‌ డిస్పోజబుల్‌ గార్బేజ్‌ బ్యాగ్‌లను ఉంచారు. రోగులు తమ ల్యాప్‌ట్యాప్‌లు, సెల్‌ఫోన్లను చార్జింగ్‌ చేసుకోవటానికి వీలుగా చార్జింగ్‌ సాకెట్స్‌ ఏర్పాటు చేశారు. కోచ్‌లో ఫస్ట్‌ క్యాబిన్‌ భాగాన్ని పారామెడికల్‌ ఏరియా, స్టోర్‌ ఏరియాలుగా ఉపయోగించుకోవచ్చు.

Updated Date - 2020-04-03T09:26:38+05:30 IST