కరోనా టీకా వేయించుకున్న వలంటీర్‌ మృతి

ABN , First Publish Date - 2021-03-08T05:27:30+05:30 IST

కరోనా వ్యాక్సిన్‌ వేయించుకున్న ఓ వలంటీర్‌ మృతి చెందాడు. ఈ సంఘటన మార్టూరు మండలం నాగరాజుపల్లిలో ఆదివారం వెలుగు చూసింది. ఆయన మృతికి వ్యాక్సిన్‌ కారణం కాదని వైద్యాధికారులు చెప్తుండగా, తమ కుమారుడుకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవని అతని తల్లిదండ్రులు అంటున్నారు.

కరోనా టీకా వేయించుకున్న వలంటీర్‌ మృతి
దాసరి అజయ్‌కుమార్‌ (ఫైల్‌)

వికటించడంతోనే అంటున్న తల్లిదండ్రులు 

అనారోగ్య సమస్యలున్నాయంటున్న వైద్యాధికారులు

నాగరాజుపల్లిలో ఘటన 

మార్టూరు, మార్చి 7 :  కరోనా వ్యాక్సిన్‌ వేయించుకున్న ఓ వలంటీర్‌ మృతి చెందాడు. ఈ సంఘటన మార్టూరు మండలం నాగరాజుపల్లిలో ఆదివారం వెలుగు చూసింది. ఆయన మృతికి వ్యాక్సిన్‌ కారణం కాదని వైద్యాధికారులు చెప్తుండగా, తమ కుమారుడుకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవని అతని తల్లిదండ్రులు అంటున్నారు. అందిన సమాచారం మేరకు.. నాగరాజుపల్లి గ్రామ వలంటీర్‌గా పని చేస్తున్న దాసరి అజయ్‌కుమార్‌ (21) మార్టూరు కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో గతనెల 24న కరోనా వ్యాక్సిన్‌ వేయించుకున్నాడు. 25న స్వల్ప అస్వస్థతకు గురయ్యాడు. జ్వరం, ఒంటినొప్పులతో బాధపడిన ఆయన మరుసటిరోజు కోలుకున్నాడు. ఈనెల 1,2 తేదీలలో గ్రామంలో పింఛన్లు పంపిణీ చేశాడు. మరలా 4వతేదీ జ్వరం రావడంతో మార్టూరులోని కమ్యూనిటీ హెల్త్‌ సెంటరులో వైద్యం చేయించుకొని ఇంటికి వెళ్లాడు. జ్వరం తగ్గకపోవడం, విరోచనాలు కూడా అవుతుండటంతో 5న చిలకలూరిపేటలో ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేయించుకొన్నాడు. అక్కడి వైద్యుల సలహామేరకు గుంటూరు వెళ్లి ఓ కార్పొరేట్‌ వైద్యశాలలో చేరాడు. చికిత్స పొందుతూ ఆదివారం వేకువజామున మృతిచెందాడు. ఆయన భౌతికకాయాన్ని తల్లిదండ్రులు శ్రీను, శివ  నాగరాజుపల్లికి తీసుకొచ్చి అంత్యక్రియలు చేశారు. 


అధికారుల ఆరా

సమాచారం తెలుసుకున్న ఎంపీడీవో శ్యాంప్రసాద్‌, ఈవోఆర్డీ జె.సురేష్‌, ద్రోణాదుల పీహెచ్‌సీ వైద్యాధికారి కవితఅనసూయ మృతుడి ఇంటికి వచ్చి సంఘటనపై ఆరా తీశారు. ఆయన తల్లిదండ్రులతో మాట్లాడగా తమ కుమారుడికి ఇప్పటి వరకూ ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని, వ్యాక్సిన్‌ వికటించడంతోనే మృతి చెందాడని విలపించారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహిస్తే కారణం తెలుస్తుందని అధికారులు చెప్పినప్పటికీ  అంగీకరించలేదు. మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించారు. 


మృతికి కారణం వ్యాక్సిన్‌ కాదు 

 మాధవీలత, డిప్యూటీ డీఎంహెచ్‌వో, ఒంగోలు

వలంటీర్‌ అజయ్‌కుమార్‌ మృతికి కరోనా వ్యాక్సిన్‌ కారణం కాదని డిప్యూటీ డీఎంహెచ్‌వో మాధవీలత స్పష్టం చేశారు. ఆమె అధికారులతో కలిసి  మార్టూరులో విలేకరులతో మాట్లాడారు. అజయ్‌కుమార్‌ చికిత్స పొందిన గుంటూరులోని రమేష్‌ ఆసుపత్రికి చెందిన వైద్యులతో మాట్లాడామన్నారు. అతనికి కామెర్ల కారణంగా లివర్‌ ఫెయిల్‌ కావడంతోపాటు, ఇతరత్రా కారణాలతో గుండెపోటుకు గురై మృతి చెందాడని వారు చెప్పారని తెలిపారు. గుంటూరు నుంచి రిపోర్టులు వచ్చిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడవుతాయన్నారు. 


Updated Date - 2021-03-08T05:27:30+05:30 IST