టీకా కాటేయకుండా...

ABN , First Publish Date - 2021-01-26T06:41:11+05:30 IST

కొవిడ్‌ వ్యాక్సిన్‌ కోసం అందరూ క్యూలు కడుతున్నారు. త్వరలోనే ఆ క్యూలోకి మనమూ చేరక తప్పదు. ఆలోగా, వ్యాక్సిన్‌ చుట్టూ అలుముకున్న భయాలు, అపోహల మీద అవగాహన పెంచుకుందాం!

టీకా కాటేయకుండా...

కొవిడ్‌ వ్యాక్సిన్‌ కోసం అందరూ క్యూలు కడుతున్నారు. త్వరలోనే ఆ క్యూలోకి మనమూ చేరక తప్పదు. ఆలోగా, వ్యాక్సిన్‌ చుట్టూ అలుముకున్న భయాలు, అపోహల మీద అవగాహన పెంచుకుందాం!


ఇతర టీకాలకు విరామం

కొవిడ్‌ టీకాకు ఇతర టీకాలకు మధ్య కనీసం నాలుగు వారాల ఎడం పాటించాలి. కొవిడ్‌ టీకాకు సంబంధించిన రెండు డోసులు పూర్తయి, నాలుగు వారాలు దాటిన తర్వాతే ఇతరత్రా టీకాలు వేయించుకోవాలి.


కరాటే నేర్చుకున్న అమ్మాయి ఆపద ఎదురైతే ఎలాగైతే పోకిరీల భరతం పడుతుందో, వ్యాక్సిన్‌ వేయించుకున్న వారి రోగనిరోధకశక్తి శరీరంలోని కరోనా వైరస్‌ను అంతే సమర్థంగా చావబాదుతుంది. కొవిడ్‌ - 19ను కలగజేసే కరోనా వైరస్‌ను గుర్తించి, దాంతో పోరాడడం ఎలాగో మన వ్యాధినిరోధకశక్తికి నేర్పించడమే కొవిడ్‌ వ్యాక్సిన్‌ విధి. అయితే ఈ వ్యాక్సిన్‌ పనితీరు గురించి తెలుసుకునే ముందు, మన శరీరంలోని రక్షణ వ్యవస్థ గురించి కొంత తెలుసుకుందాం! ఏదైనా వ్యాధికారక సూక్ష్మక్రిములు శరీరంలోకి ప్రవేశించినప్పుడు మన వ్యాధినిరోధకశక్తి మూడు రకాల తెల్ల సైన్యాలను పోరాటంలోకి దించుతుంది. వీటిలోని మాక్రోఫేజెస్‌ కణసైన్యం సూక్ష్మక్రిములను, చనిపోయిన కణాలను మింగేసి, జీర్ణం చేసుకుని యాంటీజెన్స్‌ అనే విసర్జకాలను వదిలిపెడుతుంది. మన శరీరం వీటిని హానికారకమైనవిగా భావించి, వాటి మీద దాడి కోసం యాంటీబాడీలను ప్రేరేపిస్తుంది. ఇక రెండో రకమైన బి లింఫోసైట్స్‌... రక్షణ కల్పించే తెల్లరక్తకణాలు. ఇవి మాక్రోఫేజెస్‌ మిగిల్చిన సూక్ష్మక్రిముల అవశేషాల మీద దాడి చేస్తాయి. మూడో రకానికి చెందిన టి లింఫోసైట్స్‌ అప్పటికే ఇన్‌ఫెక్ట్‌ అయిపోయిన కణాల మీద దాడి చేసి, సంహరిస్తాయి. 


మొదటిసారి ఓ వ్యక్తికి కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ సోకినప్పుడు, దాని మీద దాడికి శరీరం అన్ని రకాల యుద్ధ సైన్యాలను పోగు చేయడానికి కొన్ని రోజులు లేదా వారాలు పట్టవచ్చు. ఇన్‌ఫెక్షన్‌ తగ్గిపోయిన తర్వాత మన రోగనిరోధకశక్తి, ఆ వ్యాధి నుంచి శరీరాన్ని కాపాడుకున్న చందాన్ని గుర్తుపెట్టుకుంటుంది. రెండోసారి అదే ఇన్‌ఫెక్షన్‌ సోకితే, తక్షణమే గుర్తించి, రంగంలోకి దిగడానికి సిద్ధంగా, మన శరీరం కొన్ని టి లింఫోసైట్స్‌ను అట్టిపెట్టుకుంటుంది. అయితే ఈ కణాలకు ఆ జ్ఞాపకశక్తి ఎంతకాలం వరకూ ఉంటుందనేది కచ్చితంగా చెప్పలేం. కాబట్టి దీర్ఘకాలం పాటు జ్ఞాపకశక్తిని కలిగిఉండే టి లింఫోసైట్స్‌ను శరీరంలో పుట్టించాలి. కొవిడ్‌ వ్యాక్సిన్‌తో ఒరిగే ప్రయోజనం ఇదే! వ్యాక్సిన్‌తో శరీరంలో తయారయ్యే టి లింఫోసైట్స్‌, కరోనా వైరస్‌ను గుర్తించగల దీర్ఘకాల జ్ఞాపకశక్తిని కలిగి ఉంటాయి. 


రెండో డోసు ఎప్పుడు?

మొదటి టీకా తీసుకున్న నాలుగు నుంచి ఆరు వారాల్లోపు రెండవ డోసు కచ్చితంగా తీసుకోవాలి. ఆ సమయంలో మొదటి టీకాతో తలెత్తిన లక్షణాలను తప్పనిసరిగా తెలియజేయాలి. రెండవ డోసు తీసుకోవడం ఒకటి, రెండు రోజులు ఆలస్యమైనా కంగారు పడవలసిన పని లేదు.


టీకా తీసుకున్న తర్వాత ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?

టీకా తీసుకున్న తర్వాత శరీరంలో యాంటీబాడీల తయారీకి కనీసం రెండు వారాల వ్యవధి పడుతుంది. కాబట్టి ఆ లోగా కొవిడ్‌ సోకిన వ్యక్తుల నుంచి వైరస్‌ అంటుకునే అవకాశాలూ లేకపోలేదు. అలాగే టీకా ద్వారా కరోనా నుంచి 90 నుంచి 95ు రక్షణ మాత్రమే దక్కుతుంది. కాబట్టి టీకా తీసుకున్న తర్వాత కూడా టీకాకు మునుపు అనుసరించిన జాగ్రత్తలే కొనసాగించాలి. ముఖానికి మాస్క్‌ ధరించడం, చేతులు తరచుగా శుభ్రం చేసుకోవడం, సామాజిక దూరం పాటించడం తప్పనిసరి.


హెర్డ్‌ఇమ్యూనిటీ సాధించాలంటే?

గతంలో సోకిన ఇన్‌ఫెక్షన్‌ కారణంగా లేదా టీకా వేయించుకోవడం మూలంగా ప్రజల్లో ఇన్‌ఫెక్షన్‌ వ్యాప్తి అదుపులోకి రావడమే ‘హెర్డ్‌ ఇమ్యూనిటీ’. దీన్ని సాధించినప్పుడు కరోనా సోకనివారు, టీకా వేయించుకోని వారికి కూడా రక్షణ దక్కుతుంది. ఇలా రక్షణ చర్యలు చేపట్టని కొందరు ఉన్నా, అందరికీ రక్షణ దక్కేలా చేయగలిగేదే హెర్డ్‌ ఇమ్యూనిటీ. 


అలర్జీలు, వాడుతున్న మందులు, రుగ్మతల గురించి తెలపాలా?

వ్యాక్సిన్‌కు ముందు తమకున్న అలర్జీల గురించి (ఫుడ్‌, లేదా డ్రగ్‌ అలర్జీ) తెలపాలి. ఆ సమయంలో జ్వరం ఉన్నా, రక్తం పలుచన చేసే మందులు వాడుతున్నా, రక్తస్రావ సమస్యలు ఉన్నా, వ్యాధినిరోధకశక్తిని సన్నగిల్లేలా చేసే మందులు వాడుతున్నా.. ఆ వివరాలను తెలపాలి. 


వ్యాక్సిన్‌ వేయించుకున్న తర్వాత...

కరోనా సోకినా, సోకకపోయినా... ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేయించుకోవలసిందే! 


వ్యాక్సిన్‌ వేయించుకున్న వెంటనే ఏం చేయాలి?

వ్యాక్సిన్‌ వేయించుకున్న తర్వాత కనీసం అరగంట నుంచి గంట పాటు ఆస్పత్రిలోనే ఉండాలి. ఆ సమయంలో ఆరోగ్యపరంగా ఏ స్వల్ప అసౌకర్యానికి గురైనా వెంటనే వైద్యుల దృష్టికి తీసుకువెళ్లాలి.


వ్యాక్సిన్‌ తర్వాత ఎలాంటి దుష్ప్రభావాలు కలిగే అవకాశం ఉంటుంది?

వ్యాక్సిన్‌ వేయించుకున్న ఒకటి రెండు రోజుల వ్యవధిలో టీకా వేయించుకున్న ప్రదేశంలో నొప్పి, వాపు, దురద తలెత్తవచ్చు. చల్లని వస్త్రంతో పట్టు వేస్తే ఇవి అదుపులోకి వస్తాయి. అలసట, తలనొప్పి, చలి జ్వరం, కీళ్లనొప్పులు, తలతిరుగుడు, వాంతులు లాంటి లక్షణాలూ కనిపించే వీలుంది. ఈ కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ను కూడా తలపిస్తాయి. అయితే ఇవి ఒకటి రెండు రోజుల్లో తగ్గకపోతే వైద్యులను కలవాలి.


ఏ లక్షణాలు అలక్ష్యం చేయకూడదు?

టీకా తీసుకున్న తర్వాత ఆకలి తగ్గడం, కడుపులో నొప్పి, లింఫ్‌గ్రంధుల వాపు, విపరీతంగా చమటలు పట్టడం, చర్మంపై దురద, దద్దుర్లు మొదలైన లక్షణాలు తలెత్తితే ఆలస్యం చేయకుండా వైద్యులను కలవాలి.


వీరికి టీకా వద్దు!

కొవ్యాక్సిన్‌: భారత్‌ బయోటెక్‌ కొవ్యాక్సిన్‌ టీకాకు సంబంధించి కొన్ని సూచనలు చేసింది. అలర్జీలు, జ్వరం, రక్తస్రావ సమస్యలు ఉన్నవారు, కొన్ని మందుల కారణంగా వ్యాధినిరోధకశక్తి బలహీనపడినవారు (కేన్సర్‌ చికిత్స తీసుకుంటున్నవారు, అవయమ మార్పిడి చేయించుకుని ఇమ్యునో సప్రెసెంట్స్‌ తీసుకుంటున్నవారు), గర్భిణులు, పిల్లలకు పాలిచ్చే తల్లులు ఈ వ్యాక్సిన్‌ తీసుకోకూడదు.


కొవిషీల్డ్‌: సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా కూడా కొవిషీల్ట్‌ వ్యాక్సిన్‌కు సంబంధించి కొన్ని సూచనలు చేసింది. కొవిషీల్డ్‌ మొదటి డోస్‌తో తీవ్రమైన అలర్జీ తలెత్తినవారు రెండో డోసు తీసుకోకూడదని సీరం ఇన్‌స్టిట్యూట్‌ స్పష్టం చేసింది. అలాగే వాక్సిన్‌ తీసుకునేముందు గర్భిణులు, పాలిచ్చే తల్లులు ఆ విషయాన్ని వైద్య నిపుణుల దృష్టికి తీసుకువెళ్లాలని చెబుతోంది. 

Updated Date - 2021-01-26T06:41:11+05:30 IST