Abn logo
Sep 28 2021 @ 02:51AM

టీకాకు సూది లేదు!

  • 25 రోజుల క్రితమే సరఫరా నిలిపేసిన కేంద్రం
  • 0.5 సిరంజీలు లేక రాష్ట్ర వ్యాప్తంగా గందరగోళం
  • రాష్ర్టాలే కొనుక్కోవాలని ఆదేశాలు
  • తాత్కాలిక ఏర్పాట్లలో ఆరోగ్యశాఖ విఫలం
  • 3 ఎంఎల్‌ సిరంజీతో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌
  • వీటితో అధిక డోస్‌.. సర్వత్రా ఆందోళన
  • సెకండ్‌ డోస్‌ వేయకపోయినా రిజిస్ట్రేషన్లు!
  • ఆరోగ్యశాఖ నుంచి జిల్లాలకు ఆదేశం
  • అంటే వ్యాక్సిన్‌ వేయకపోయినా వేసినట్లే!
  • ప్రమాద తీవ్రతను గుర్తించని ప్రభుత్వం


అమరావతి, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు అతి పెద్ద అడ్డంకి వచ్చిపడింది. వ్యాక్సినేషన్‌కు అత్యంత అవసరమైన 0.5 ఎంఎల్‌ సిరంజీల కొరత ఏర్పడింది. గత నెల వరకూ వ్యాక్సిన్‌తో పాటు సిరంజీలను కూడా కేంద్ర ప్రభుత్వమే సరఫరా చేసేది. దేశ వ్యాప్తంగా కొరత ఏర్పడడంతో కేంద్రం అకస్మాత్తుగా రాష్ట్రాలకు వాటి సరఫరాను నిలిపేసింది. వాటిని రాష్ట్రాలే కొనుగోలు చేసుకోవాలని అన్ని రాష్ట్రాలకూ ఈ నెల మొదటి వారంలోనే లేఖలు రాసింది. ఇప్పటికి 25 రోజులవుతున్నా వ్యాక్సినేషన్‌కు అవసరమైన సిరంజీల కొనుగోలులో ఆరోగ్యశాఖ పూర్తిగా విఫలమయింది. ఈ నెల 13న 0.5 ఎంఎల్‌ సిరంజీలు సప్లయి చేయాలని పంపిణీదారులకు ఏపీఎంఎ్‌సఐడీసీ పీవో ఆర్డర్లు ఇచ్చినప్పటికీ, ఇప్పటికే బిల్లులు పెం డింగ్‌లో ఉండడంతో సప్లయిర్స్‌ కొంత మేరకు వెనక్కినట్లు తెలిసింది. మరోవైపు దేశ వ్యాప్తంగా నెలకొన్న కొరత దృష్ట్యా కూడా సమయానికి సరఫరా చేయలేకపోయారు. 


ప్రక్రియ నిలిచిపోకూడదని..!

సిరంజీల కొరతతో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నిలిచిపోకూడదన్న ఉద్దేశంతో 1 ఎంఎల్‌ సిరంజీలతో వ్యాక్సినేషన్‌ చేయాలని  ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు జిల్లాలను ఆదేశించారు. దీంతో జిల్లాల్లో 1 ఎంఎల్‌ సిరంజీలతోనే వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. ఇప్పుడు అవికూడా నిండుకున్నాయి. దీంతో 3 ఎంఎల్‌ సిరంజీలతో వ్యాక్సినేషన్‌ నిర్వహించాలంటూ శుక్రవారం ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. 1ఎంఎల్‌తో వ్యాక్సినేషన్‌ చేసినప్పుడు ఒకరికి ఎక్కువ.. ఒకరికి తక్కువ డోస్‌ పడింది. ఇప్పుడు 3 ఎంఎల్‌ సిరంజీల్లోకి 0.5 ఎంఎల్‌ వ్యాక్సిన్‌ ఎలా నింపాలన్నది ప్రశ్నార్థకంగా మారింది. దీనివల్ల  అయితే ఎక్కువ... లేకపోతే తక్కువ డోస్‌ పడే ప్రమాదం ఉంది. దీంతో వ్యాక్సినేటర్లు ఇబ్బందులు పడుతున్నారు. 


సెకండ్‌ డోస్‌కు రిజిస్ర్టేషన్లు!

రాష్ట్రంలో 3.47 కోట్ల మందికి వ్యాక్సిన్‌ వేయాల్సి ఉంది. ఇప్పటి వరకూ 2.61 కోట్ల మందికి మొదటి డోస్‌ పూర్తయింది. ఇందులో 1.26 కోట్ల మందికి మాత్రమే సెకండ్‌ డోస్‌ వేశారు. మొదటి డోస్‌కు, రెండో డోస్‌కు మధ్య 50 శాతం వ్యత్యాసం ఉంది. ఈ వ్యత్యాసంపై సీఎం జగన్‌ ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను ప్రశ్నించారు. సెకండ్‌ డోస్‌ వ్యాక్సినేషన్‌ను పెంచాలని ఆదేశించారు. దీంతో అధికారులు కొత్త పంథాను ఎంచుకున్నారు. సెకండ్‌ డోస్‌ పర్సంటేజీ పెంచేందుకు కొత్త మార్గాలు ఆలోచిస్తున్నారు. అందులో భాగంగా మొదటి డోస్‌ వేయించుకున్న వారికి రెండో డోస్‌ వేయకపోయినా ఫర్వాలేదు రిజిస్ట్రేషన్‌ చేసేయండి అంటూ జిల్లా ఉన్నతాధికారులను ఆదేశించారు. ముఖ్యంగా గుంటూరు, కృష్ణా, విశాఖపట్నం, చిత్తూరు జిల్లాల అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చారు. 


వ్యాక్సిన్‌ వేయకపోయినా వేసినట్లే!

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా అధికారులు రంగంలోకి దిగారు. లబ్ధిదారులకు సమాచారం ఇవ్వకుండానే రిజిస్ట్రేషన్‌ చేసేస్తున్నారు. రెండో డోస్‌ వేయకపోయినా.. రిజిస్ర్టేషన్‌ చేసేస్తున్నారు కనుక, ఆ డోస్‌ కూడా వేసినట్లే నమోదవుతుంది. భవిష్యత్తులో రెండో డోస్‌ వేయించుకోవాల్సి వచ్చినప్పుడు రిజిస్ర్టేషన్‌కు వీలుకాదు. దీంతో కొన్ని జిల్లాల్లో లబ్ధిదారులు పీహెచ్‌సీలకు వెళ్లి వైద్య సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. శనివారం ఉదయం రాష్ట్ర వ్యాప్తంగా పది పీహెచ్‌సీల్లో ఇలాంటి సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఆదివారం కూడా ఇదే పద్ధతిలో రిజిస్ట్రేషన్‌ చేయాలంటూ సిబ్బందికి ఆదేశాలు వెళ్లాయి. ఏడు గంటలకు రిజిస్ట్రేషన్‌ ప్రారంభించి.. 9 గంటలకు పూర్తి చేయాలని, ఆ తర్వాత వచ్చిన వారికే వ్యాక్సిన్‌ వేయాలంటూ ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు వెళ్తున్నాయి. ప్రమాద తీవ్రతను ప్రభుత్వం గుర్తించకపోతే.. చివరికి ఎక్కడికి దారితీస్తుందోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.