టీటీడీ ఉద్యోగులకు కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రారంభం

ABN , First Publish Date - 2021-03-05T07:24:50+05:30 IST

టీటీడీ ఉద్యోగులకు కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని గురువారం నుంచి ప్రారంభించారు.

టీటీడీ ఉద్యోగులకు కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రారంభం
టీకా వేయించుకుంటున్న ఉద్యోగి

తిరుమల/తిరుపతి, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): టీటీడీ ఉద్యోగులకు కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని గురువారం నుంచి ప్రారంభించారు. ఈవో జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి ఆదేశాల మేరకు ముందుగా తిరుమలలో విధులు నిర్వహించే ఉద్యోగులకు అశ్విని ఆస్పత్రిలో ఉచితంగా టీకా వేసే ప్రక్రియను ప్రారంభించారు. తొలిరోజు ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న వైద్యులు, నర్సులు, పారా మెడికల్‌ సిబ్బందితోపాటు మీడియా ప్రతినిధులకూ టీకా వేశారు. అలాగే శ్రీవారి ఆలయం, రిసెప్షన్‌, వాటర్‌వర్క్స్‌, ఆరోగ్య విభాగం, భద్రతా విభాగం సిబ్బందికి వ్యాక్సిన్‌ ఇవ్వనున్నారు. రెండో విడతలో 45 ఏళ్లు పైబడిన బీపీ, షుగర్‌ తదితర సమస్యలు ఉన్నవారికి వ్యాక్సిన్‌ ఇస్తారు.  మొదటి డోస్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న 28రోజుల తర్వాత రెండో డోస్‌ ఇస్తారు. జిల్లా ఆరోగ్య విభాగం తిరుమలకు పంపిన కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ 50 వైల్స్‌ను 550 మందికి వేయనున్నారు. ఈ కార్యక్రమంలో అశ్విని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కుసుమకుమారి, వైద్యులు, పారా మెడికల్‌ సిబ్బంది పాల్గొన్నారు. 


నేటి నుంచి సెంట్రల్‌ ఆస్పత్రిలోనూ..

తిరుపతిలోని టీటీడీ ఉద్యోగులకు శుక్రవారం నుంచి పరిపాలన భవనం వెనుక ఉన్న సెంట్రల్‌ ఆస్పత్రిలో టీకా వేయనున్నారు. ఇందుకోసం ఉద్యోగులు ఆధార్‌ కార్డును తీసుకెళ్లాలి. ఆధార్‌, ఫోన్‌ నెంబర్లను నమోదు చేసి వెబ్‌ కెమెరాతో ఫొటో తీసి.. కొవిన్‌ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. ఇలా నమోదు చేసుకున్న వారికి వరుస క్రమంలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ను నర్సింగ్‌ సిబ్బంది వేయనున్నారు. కొవిడ్‌ నిబంధనల నేపథ్యంలో రోజుకు 150 నుంచి 200 మందికి వ్యాక్సిన్‌ వేయటానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. వ్యాక్సిన్‌ వేసుకున్న వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించటానికి వైద్యుల పర్యవేక్షణలో ఉంచటానికి సెంట్రల్‌ ఆస్ప్రతిలో ప్రత్యేకమైన గదిని ఏర్పాటు చేశారు. టీటీడీ ఉద్యోగులకు కొవిడ్‌ వ్యాక్సిన్‌ అందించనున్న నేపథ్యంలో జేఈవో సదా భార్గవి గురువారం సెంట్రల్‌ ఆస్పత్రిని సందర్శించారు. చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ నర్మద, అదనపు ఆరోగ్యాధికారి సునీల్‌కు పలు సూచనలిచ్చారు.

Updated Date - 2021-03-05T07:24:50+05:30 IST