వ్యాక్సిన్‌ ఫియర్‌!

ABN , First Publish Date - 2021-03-09T06:54:20+05:30 IST

కరోనా మహమ్మారిని తరిమికొట్టే కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం జిల్లాలో నత్తనడకన సాగుతోంది.

వ్యాక్సిన్‌ ఫియర్‌!

నత్తనడకన కొవిడ్‌ వ్యాక్సినేషన్‌

70 శాతం కూడా పూర్తికాని తొలివిడత లక్ష్యం 

రెండో విడత 50 శాతం కూడా పూర్తికాలేదు 

మూడో విడతలోనూ స్పందన అంతంతే... 


విజయవాడ, ఆంధ్రజ్యోతి : కరోనా మహమ్మారిని తరిమికొట్టే కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం జిల్లాలో నత్తనడకన సాగుతోంది. హెల్త్‌ కేర్‌ వర్కర్లకు తొలివిడతలోనూ, ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లకు మలివిడతలోనూ టీకా ఇచ్చే కార్యక్రమాన్ని పూర్తి చేయాలనేది లక్ష్యం. కానీ, వ్యాక్సిన్‌ పనితీరుపై అపోహలు ఉండటం, వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో కొంతమందికి రియాక్షన్లు వస్తుండటంతో టీకా వేయించుకు నేందుకు ఆరోగ్య సిబ్బంది సైతం భయపడుతు న్నారు. దీంతో జిల్లాలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ఆది నుంచీ అంతంతమాత్రంగానే సాగుతోంది. 


తొలివిడతే పూర్తికాలేదు.. మూడో విడత

జనవరి 16న ప్రారంభమైన తొలివిడత వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో జిల్లావ్యాప్తంగా 36వేల మందికి పైగా హెల్త్‌కేర్‌ వర్కర్లకు టీకా ఇచ్చేందుకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఏర్పాట్లు చేసింది. ఇంతవరకు 70 శాతం కూడా లక్ష్యం పూర్తి కాలేదు. ఇదిలా ఉంటే.. కొవిడ్‌  ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు ఫిబ్రవరి 4 నుంచి రెండో విడత వ్యాక్సినేషన్‌ ప్రారంభమైంది. ఇందులో జిల్లావ్యాప్తంగా 56వేల మందికి పైగా పోలీసులు, మున్సిపల్‌, పంచాయతీరాజ్‌, రెవెన్యూ శాఖల ఉద్యోగులకు, సిబ్బందికి కరోనా టీకా ఇవ్వాలని నిర్ణయించారు. రెండో విడతలో కూడా ఇంతవరకు 50 శాతం పూర్తి కాలేదు. ఈ నెల ఒకటో తేదీ నుంచి మూడో విడత వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. ఇందులో 60 సంవత్సరాలకు పైబడిన వారికి, 45 నుంచి 60 సంవత్సరాల్లోపు వయసుండి బీపీ, షుగర్‌, గుండెజబ్బులు తదితర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి వ్యాక్సిన్‌ ఇస్తున్నారు. మూడో విడత ఐదు లక్షల మందికి పైగానే టీకా ఇవ్వాల్సి ఉంటుంది. హెల్త్‌కేర్‌ వర్కర్లు, ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ తర్వాత మూడో విడత సామాన్యులకు అవకాశం ఇవ్వడంతో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఊపందుకున్నప్పటికీ ఆశించినంత జోరుగా సాగడం లేదు. 


ప్రైవేట్‌, నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లోనూ అంతే

మూడో విడత కొవిడ్‌ వ్యాక్సిన్‌కు డిమాండ్‌ ఎక్కువగా ఉంటుందని భావించిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు టీకా ఇచ్చే కేంద్రాలను  గణనీయంగా పెంచారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో రెండు వ్యాక్సినేషన్‌ సెంటర్ల చొప్పున ఏర్పాటు చేశారు. తర్వాత క్రమంగా పెంచుకుంటూ వస్తున్నారు. శుక్రవారం నుంచి జిల్లావ్యాప్తంగా 23 ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 23 పట్టణ ఆరోగ్య కేంద్రాలతో పాటు జిల్లా, ఏరియా ఆసుపత్రుల్లోనూ కొవిడ్‌ టీకాను ఉచితంగానే ఇస్తున్నారు. ఇవికాకుండా ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లోనూ, మరో 47 ప్రైవేట్‌ ఆసుపత్రుల్లోనూ రూ.250కు వ్యాక్సిన్‌ ఇస్తున్నారు. అయితే, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు ఏపీ మెడికల్‌ కౌన్సిల్‌ ఆమోదించిన రిజిస్టర్డ్‌ మెడికల్‌ ప్రాక్టీషనర్‌ సర్టిఫికెట్‌ తీసుకుని వస్తేనే టీకా వేస్తున్నారు. ఆన్‌లైన్‌లో కొవిన్‌ యాప్‌ లేదా ఆరోగ్య సేతు యాప్‌ లేదా మీ సేవ కేంద్రాల్లో రిజిస్టర్‌ చేయించుకున్నవారికి మాత్రమే టీకాను ఇస్తారు. సామాన్యులకు కొవిడ్‌ టీకా తీసుకోవాలని ఆసక్తి ఉన్నా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియపై అవగాహన లేక మూడో విడత వ్యాక్సినేషన్‌ ప్రక్రియ అంతంతమాత్రంగానే సాగుతోంది.


విస్తృత అవగాహన అవసరం : కలెక్టర్‌ 

వ్యాక్సినేషన్‌పై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉందని కలెక్టర్‌ ఇంతియాజ్‌ చెబుతున్నారు. వ్యాక్సిన్‌పై అపోహలకు తావు లేదని, దేశీయంగా తయారైన వ్యాక్సిన్లు సురక్షితమైనవన్నారు. జిల్లా ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చినందున ప్రతి ఒక్కరూ కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకునేలా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.

Updated Date - 2021-03-09T06:54:20+05:30 IST