ప్రైవేట్‌లోనూ కొవిడ్‌ చికిత్సలు

ABN , First Publish Date - 2021-04-16T05:17:47+05:30 IST

ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో కూడా ఇక నుంచి కొవిడ్‌ 19 చికిత్సలకు అనుమతులు ఇచ్చినట్లు జిల్లా వైద్య అధికారి నరేందర్‌ రాథోడ్‌ తెలిపారు. ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో కరోనా నిబంధనలు పాటిస్తూ చికిత్సలు చేయవచ్చన్నారు. గురువారం తన కార్యాలయంలో ప్రైవేట్‌ ఆసుపత్రుల డాక్టర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో రిజిస్ట్రర్‌ అయిన ప్రైవేట్‌ ఆసుపత్రులు పది పడకలు పైబడి ఉన్న ఆసుపత్రులన్నింటికీ ఈ అనుమతులు ఇచ్చినట్లు ఆయన తెలిపారు.

ప్రైవేట్‌లోనూ కొవిడ్‌ చికిత్సలు
ప్రైవేట్‌ వైద్యులతో మాట్లాడుతున్న డీఎంఅండ్‌హెచ్‌వో

ఆదిలాబాద్‌అర్బన్‌, ఏప్రిల్‌ 15: ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో కూడా ఇక నుంచి కొవిడ్‌ 19 చికిత్సలకు అనుమతులు ఇచ్చినట్లు జిల్లా వైద్య అధికారి నరేందర్‌ రాథోడ్‌ తెలిపారు. ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో కరోనా నిబంధనలు పాటిస్తూ చికిత్సలు చేయవచ్చన్నారు. గురువారం తన కార్యాలయంలో ప్రైవేట్‌ ఆసుపత్రుల డాక్టర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో రిజిస్ట్రర్‌ అయిన ప్రైవేట్‌ ఆసుపత్రులు పది పడకలు పైబడి ఉన్న ఆసుపత్రులన్నింటికీ ఈ అనుమతులు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం కరోనా వ్యాధిగ్రస్థులకు కొన్ని నిబంధనలు విధించిందని ప్రైవేట్‌ డాక్టర్లు అధిక ఫీజు వసూలు చేయకూడదని ప్రభుత్వం గుర్తించిన ధరలను మాత్రమే వసూలు చేయాలన్నారు. కొవిడ్‌ 19 వైరస్‌ను అడ్డు పెట్టుకొని నిబంధనలు అతిక్రమించి అధిక ఫీజులు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. రోగికి ఐసోలేషన్‌లో సాధారణ చికిత్సలు జరిపితే రూ.4వేలు, ఐసీయూలో ఉంచి చికిత్సలు జరిపితే రూ.7,500, ఐసీయూ, వెంటిలెటర్స్‌ ఉపయోగించి చికిత్సలు నిర్వహిస్తే రూ.9వేల చొప్పున వసూలు చేసుకోవచ్చని ఆయన చెప్పారు. ప్రైవేట్‌ వైద్యులు 3 రకాల రుసుమును వసూలు చేసుకోవచ్చని ఆయన సూచించారు. ఎప్పటికప్పుడు కోవిడ్‌ పరీక్షలు నిర్వహించి ప్రతి రోజూ పరీక్షల వివరాలు, చేరికల వివరాలు వెనువెంటనే అధికారులకు తెలియజేయాలని, ప్రత్యేక రిజిస్ట్రర్లు మెంటనెన్స్‌ చేయాలని ఆయన చెప్పారు. ఆర్టీపీసీఆర్‌ ద్వారా పరీక్షలు నిర్వహిస్తే దాని రుసుము రూ.2,200, ఇంటి వద్ద పరీక్షలు నిర్వహిస్తే రూ.2,800 మాత్రమే వసూలు చేయాలని అంతకు పైబడి వసూలు చేయరాదని ఆయన అన్నారు. ప్రైవేట్‌లో వైద్యులు ఎలాంటి అక్రమాలకు పాల్పడినా ప్రజలు వెంటనే తమకు సమాచారం ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో అడిషనల్‌ డీఎంఅండ్‌హెచ్‌వో సాధన,  జిల్లాలోని పలువురు ప్రైవేట్‌ వైద్యులు తదితరులు పాల్గొన్నారు.

ఫ్రంట్‌లైన్‌, హెల్త్‌కేర్‌ వర్కర్లకు వ్యాక్సిన్‌..

 ప్రభుత్వ ఆదేశాల మేరకు 18 సంవత్సరాల నుంచి 45సంవత్సరాలు నిండిన ఫ్రంట్‌ లైన్‌ వర్కర్స్‌, హెల్త్‌కేర్‌ వర్కర్లందరికి కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఇవ్వనున్నట్లు జిల్లా వైద్యాధికారి డీఎంఅండ్‌హెచ్‌వో నరేందర్‌రాథోడ్‌ తెలిపారు. గురువారం సాయం త్రం తన చాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ  ప్రభుత్వం నుంచి అందరికి ఇంజక్షన్‌ ఇవ్వాలని ఆదేశాలు లేవని, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లయిన గ్రామ పంచాయతీల్లో పనిచేసే వర్కర్లు, సిబ్బంది, మున్సి పాలిటీలో పనిచేసే సిబ్బంది, వర్కర్లు, పోలీసులు తదితర అత్యవసర పనిచేసే ఉద్యోగులు హెల్త్‌కేర్‌ వర్కర్లయిన హెల్త్‌ అసిస్టెంట్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు, సూపర్‌వైజర్లు ఈ వ్యాక్సినేషన్‌కు అర్హులని ఆయన పేర్కొన్నారు. ఆదిలాబాద్‌ పరిసర ప్రాంతమైన పెన్‌గంగా, ఘన్‌పూర్‌, లక్ష్మింపూర్‌ తదితర నాలుగు సరిహద్దుల్లో చెక్‌పోస్టుల వద్ద పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. జిల్లాకు చెందిన ప్రజలు కొవిడ్‌ వైరస్‌ పట్ల జాగ్రత్తగా ఉండాలని పక్క రాష్ర్టాలకు వెళ్లడం, రావడం మానుకోవాలని ఆయన సూచించారు. పక్క రాష్ట్రంలో కరోనా వైరస్‌ అతివేగంగా విజృంభిస్తుందని దానిని జిల్లాకు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. ఈ సమావేశంలో డీఐవో శ్రీకాంత్‌, జిల్లా అధికారులు శ్రీనివాస్‌, నవ్యసువిద తదితరులున్నారు. 

Updated Date - 2021-04-16T05:17:47+05:30 IST