8,966 మందికి కొవిడ్‌ అనుమానిత లక్షణాలు

ABN , First Publish Date - 2022-01-29T05:28:37+05:30 IST

8,966 మందికి కొవిడ్‌ అనుమానిత లక్షణాలు

8,966 మందికి కొవిడ్‌ అనుమానిత లక్షణాలు


  •  జ్వరం, జలుబు, దగ్గు తలనొప్పి పీడితులే అధికం
  • శరీర నొప్పులతో బాధపడుతున్న వారూ ఉన్నారు
  •  ఫీవర్‌ సర్వేలో వెలుగు చూసిన అనారోగ్య లక్షణాలు 
  • 19 పీహెచ్‌సీల పరిధిలో సర్వే పూర్తి
  •  మరో 4 పీహెచ్‌సీ పరిధిలో కొనసాగింపు
  •  నేటితో జిల్లాలో సర్వే ముగిసే అవకాశం


వికారాబాద్‌, జనవరి 28 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : వికారాబాద్‌ జిల్లాలో ఫీవర్‌ సర్వే ముగింపు దశకు చేరుకుంది. ఫీవర్‌ సర్వేలో చాలా వరకు ప్రజలు జ్వరం, జలుబు, దగ్గు, తల, శరీర నొప్పులతో బాధపడుతున్నట్లు సర్వే బృందాలు గుర్తించాయి. కొవిడ్‌ మూడో దశ వ్యాప్తి వేగంగా కొనసాగడంతో రాష్ట్ర ప్రభుత్వం ఫీవర్‌ సర్వేకు ఆదేశించింది. జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో  తాండూరు జిల్లా ఆసుపత్రి, 4 ఏరియా ఆసుపత్రులు, 23 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 23 పీహెచ్‌సీల పరిధిలో ఇంటింటికి తిరిగి సర్వే నిర్వహించేందుకు 754 బృందాలను నియమించారు. ఒక్కో బృందంలో సర్వే ఏఎన్‌ఎం, ఆశ వర్కర్‌, పంచాయతీ/మునిసిపల్‌ సిబ్బందిని నియమించారు. ఈనెల 21 నుంచి సర్వే బృందాల్లోని సభ్యులు ఇంటింటికి తిరిగి ఆ ఇంట్లో ఎవరికైనా అనారోగ్య లక్షణాలు ఉన్నాయా, ఉంటే ఏయే లక్షణాలతో బాధపడుతున్నారనేది అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో 2,20,386 గృహాలు ఉండగా, శుక్రవారం వరకు 2,17,014 గృహాలను సందర్శించారు. ఈ గృహాల్లో 8,966 మంది జ్వరం, జలుబు, దగ్గు, శరీర నొప్పుల వంటి అనుమానిత లక్షణాలతో బాధపడుతున్నట్లు గుర్తించారు. వీరిలో 8,819 మందికి పీసీఎం, సీపీఎం, బీ కాంప్లెక్స్‌, విటమిన్‌ సి ట్యాబ్లెట్లు పంపిణీ చేశారు. కాగా, అనుమానిత లక్షణాలు తీవ్రంగా ఉన్న 4,132 మందికి కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయగా, వారిలో 349 మందికి పాజిటివ్‌ ఉన్నట్లు గుర్తించారు. కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన వారికి కిట్లు పంపిణీ చేసి అయిదు రోజుల పాటు హోంఐసోలేషన్‌లో ఉండాలని, ఈ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సర్వే, ఆరోగ్య సిబ్బంది బాధితులకు వివరించారు. 

19 పీహెచ్‌సీల పరిధిలో సర్వే పూర్తి

వికారాబాద్‌ జిల్లాలో 23 పీహెచ్‌సీల పరిధిలో సర్వే కొనసాగగా, వాటిలో 19 పీహెచ్‌సీల పరిధిలో ఇంటింటి సర్వే పూర్తి చేశారు. ఈనెల 28వ తేదీ వరకు అంగడి రాయిచూర్‌, బంట్వారం, బషీరాబాద్‌, బొంరాస్‌పేట్‌, చెన్‌గోముల్‌, చిట్యాల్‌, ధారూరు, దోమ, దౌల్తాబాద్‌, జిన్‌గుర్తి, కోట్‌పల్లి, కులకచర్ల, మోమిన్‌పేట్‌, నవాల్గ, నాగసమందర్‌, పట్లూర్‌, పూడూరు, సిద్దులూరు, యాలాల్‌ పీహెచ్‌సీల పరిధిలో ఇంటింటి సర్వే పూర్తి చేశారు. ఇంకా, నవాబ్‌పేట, పెద్దేముల్‌, వికారాబాద్‌, తాండూరు పరిధిలో ఇంకా 3372 గృహాల్లో సర్వే పూర్తి చేయాల్సి ఉంది. 

Updated Date - 2022-01-29T05:28:37+05:30 IST