రూపాయికి కొవిడ్‌ షాక్‌

ABN , First Publish Date - 2021-04-08T06:01:41+05:30 IST

దేశంలో కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ విజృంభణ, స్థానిక లాక్‌డౌన్ల భయం రూపాయిపై ప్రభావం చూపింది. డాలర్‌ మారకంలో రూపాయి ఒక్క రోజులోనే 105 పైసలు క్షీణించి 74.47కి దిగజారింది

రూపాయికి కొవిడ్‌ షాక్‌

ఒక్క రోజులోనే రూ.1.05 పతనం 20 నెలల్లో భారీ క్షీణత


ముంబై: దేశంలో కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ విజృంభణ, స్థానిక లాక్‌డౌన్ల భయం రూపాయిపై ప్రభావం చూపింది. డాలర్‌ మారకంలో రూపాయి ఒక్క రోజులోనే 105 పైసలు క్షీణించి 74.47కి దిగజారింది. గత 20 నెలల కాలంలో ఒక రోజులో రూపాయికి ఏర్పడిన భారీ క్షీణత ఇదే. అలాగే గత ఏడాది నవంబరు 13వ తేదీ తర్వాత నమోదైన కనిష్ఠ స్థాయి కూడా ఇదే. 2019 ఆగస్టు 5వ తేదీన రూపాయి ఒక రోజులో భారీ క్షీణతను నమోదు చేసింది. బుధవారం ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి 73.52 వద్ద ప్రారంభమై ఆ స్థాయి నుంచి 74.50 పరిధిలో ట్రేడయింది. చివరికి 105 పైసల నష్టంతో 74.47 వద్ద ముగిసింది. ఆర్‌బీఐ రెపోరేట్లను యథాతథంగా కొనసాగించడంతో పాటు ఇటీవల చారిత్రక గరిష్ఠ స్థాయిలో పెరుగుతున్న కరోనా కేసుల వల్ల ఆర్థిక రికవరీపై అస్థిరత మేఘాలు అలముకున్నాయన్న వ్యాఖ్యలు రూపాయిపై ప్రభావం చూపాయని విశ్లేషకులంటున్నారు. రాబోయే రెండు సెషన్లలో రూపాయి 73.70-74.75 పరిధిలో కదలాడవచ్చునని చెబుతున్నారు. 


ఈక్విటీకి ఆర్‌బీఐ పాలసీ కిక్‌: రిజర్వు బ్యాంకు కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచినా ద్రవ్యవిధానంలో సరళ వైఖరి కొనసాగిస్తామని ప్రకటించడం ఈక్విటీ మార్కెట్‌కు ఉత్తేజం ఇచ్చింది. వడ్డీరేట్ల ప్రభావానికి లోనయ్యే బ్యాంకింగ్‌, ఆటో, ఐటీ స్టాక్‌ల మద్దతుతో కీలక సూచీలు పరుగులు తీశాయి. సెన్సెక్స్‌ 460.37 పాయింట్ల లాభంతో 49,661.76 వద్ద ముగిసింది. నిఫ్టీ 135.55 పాయింట్లు లాభపడి 14,819.05 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌ షేర్లలో 2.25 శాతం లాభంతో ఎస్‌బీఐ అగ్రగామిగా నిలిచింది. ఐసీఐసీఐ బ్యాంక్‌, నెస్లె ఇండియా, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, మహీంద్రా, భారతి ఎయిర్‌టెల్‌, మారుతి లాభపడిన షేర్లలో ఉన్నాయి. రూపాయి భారీ క్షీణత ప్రభావం వల్ల ఐటీ షేర్లు కూడా మంచి లాభాల్లో ముగిశాయి. 


క్లీన్‌ సైన్స్‌ రూ.1,400 కోట్ల ఐపీఓ: ప్రత్యేక రసాయనాల తయారీ రంగంలోని క్లీన్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ కంపెనీ రూ.1,400 కోట్ల ఐపీఓ కోసం సెబీకి దరఖాస్తు చేసింది. కంపెనీ ప్రమోటర్లు, పీఈ సంస్థలు ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) తమ పెట్టుబడుల్లో కొంత భాగాన్ని ఈ ఐపీఓ ద్వారా విక్రయిస్తారు. 

Updated Date - 2021-04-08T06:01:41+05:30 IST