రాజన్న ఆలయాధికారులతో సమావేశమైన జడ్పీ సీఈవో
వేములవాడ టౌన్, జనవరి 21: వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆల యంలో కొవిడ్ నిబంధనలు పకడ్బందీగా అమలు చేయాలని జడ్పీ సీఈవో గౌతమ్‌రెడ్డి ఆలయాధికారులకు సూచించారు. రాజన్న ఆలయంలో కొవిడ్, ఒమె ౖక్రాన్ వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకున్న చర్యలను శుక్రవారం పరిశీలించారు. అనంతరం రాజన్న ఆలయ గౌస్ట్‌హౌస్ సమావేశ మందిరంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేడారం సమ్మక్క జాతరకు వెళ్లే భక్తులు ముందుగా రాజన్న ఆలయానికి మొక్కులు చెల్లించుకోవడానికి అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రతీ భక్తుడు మాస్కు ధరించేలా చూడాలన్నారు. ఎంట్రీపాయింట్ల వద్ద సానిటైజర్ స్టాండ్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. రాజన్న ఆలయానికి వచ్చే భక్తులకు కొవిడ్ నిబంధనలు తెలిసే విధంగా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. పారిశుధ్యం మెరుగపర్చాలన్నారు. జగిత్యాల రోడ్డు వైపున, గుడిచెరువు పార్కింగ్ స్థలంలో మరిన్ని లైట్లు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో రాజన్న ఆలయ ఈఈ, ఏఈవో ఉన్నారు.